జిల్లాలో ఇంటింటికీ వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-09-18T04:23:41+05:30 IST

జిల్లాలో ఇక నుంచి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ప్రణాళిక రుపొందించింది.

జిల్లాలో ఇంటింటికీ వ్యాక్సినేషన్‌
కాగజ్‌నగర్‌లో ఇంటికి వెళ్లి మహిళకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది

- 100శాతం లక్ష్యంగా ముందుకు

- జిల్లాలో 138వ్యాక్సినేషన్‌ కేంద్రాల ఏర్పాటు

- ప్రతి కేంద్రానికి రెండు బృందాలు

- 45 రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 17: జిల్లాలో ఇక నుంచి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ప్రణాళిక రుపొందించింది. మిగతా జిల్లాలతో పోలిస్తే కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వెనుకబడి ఉండటంతో 45రోజులపాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ఇంటింటికి వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. 

జిల్లాలో 138 వ్యాక్సినేషన్‌ కేంద్రాల ఏర్పాటు..

ప్రజల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను రూపుమాపి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో వ్యాక్సిన్‌పై అపోహలుండటంతో వారికి అవగాహన కల్పించేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. గతంలో జిల్లాలో 24పీహెచ్‌సీ, రెండు సీహెచ్‌సీలలో కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్‌ చేశారు. ప్రస్తుతం 100 శాతం వ్యాక్సినేషన్‌ చేపట్టేందుకు అధికారులు జిల్లా వ్యాప్తంగా 138 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 108రూరల్‌ సబ్‌సెంటర్లు, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 30వార్డులలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఒక్కొక్క కేంద్రంలో ప్రతిరోజు 100మందికి అంటే 138కేంద్రాల ద్వారా 13,800మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఇంటింటికి టీకాలు..

జిల్లాలో 100శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంతో 45రోజులపాటు స్పెషల్‌ డ్రైవ్‌ను చేపడుతున్నారు. ఇందుకోసం 138కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రతి కేంద్రానికి రెండు టీంలను ఏర్పాటు చేశారు. ఒక టీంలో ఏఎన్‌ఎం, ఆశా, హెల్త్‌వర్కర్‌లు ఉండగా మరో టీంలో సర్పంచ్‌, వార్డుమెంబర్‌, పంచాయతీకార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. వీరు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి 18సంవత్సరాలు నిండి టీకా తీసుకొని వారి వివరాలు సేకరించి వారికి టీకాపై అవగాహన కల్పించి, అపోహలు దూరం చేసి టీకాలు వేయనున్నారు. ప్రతి వ్యాక్సినేషన్‌ కేంద్రానికి ఏఈవోను నోడల్‌ అధికారిగా నియ మించారు. మండలస్థాయిలో ఎంపీడీవో, ఎంపీపీ, పీహెచ్‌సీ వైద్యాధికారితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రి యపై జిల్లాస్థాయిలో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశారు. 

జిల్లాలో 3.8లక్షల మంది..

జిల్లాలో 18ఏళ్లు పైబడిన వారు 3.8లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు లక్ష మందికి మొదటిడోస్‌, 80వేల మంది మొదటి, రెండో డోస్‌ వేసుకున్నారు. అర్హులైన మిగతా వారికి వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నారు. గతంలో వ్యాక్సిన్‌ డోస్‌లు తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం జిల్లాలో సరిపడే డోస్‌లు అందుబాటులో ఉన్నాయి. టీకాలపై గిరిజన ప్రాంతాల్లో ఉన్న అపోహలను తొలగించడానికి అన్ని కుల సంఘాల పెద్దలు, రాయిసెంటర్‌ ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.  గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పిం చాలని పేర్కొన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్‌ పూర్తయితే సాధారణ పరిస్థితులు నెలకొననున్నాయి. 

నూరు శాతం లక్ష్యం పెట్టుకున్నాం..

- రాహుల్‌రాజ్‌, కలెక్టర్‌

జిల్లాలో వ్యాక్సినేషన్‌ 100శాతం పూర్తిచేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలో 138 కేంద్రాలద్వారా ప్రతిరోజు ఒక్కో కేంద్రానికి 100మందికి వ్యాక్సినేషన్‌ వేస్తాం. సాధారణ జీవితం గడపడానికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియం ఒక్కటే మార్గం. అపోహలు విడనాడి అర్హులైన ప్రతిఒక్కరూ టీకాను వేయించుకోవాలి.

Updated Date - 2021-09-18T04:23:41+05:30 IST