నేడు, రేపు ‘ఇంటి’పోరు!

ABN , First Publish Date - 2020-07-06T07:51:10+05:30 IST

ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతిని ఎత్తిచూపుతూ సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని

నేడు, రేపు  ‘ఇంటి’పోరు!

  • మేం కట్టిన ఇళ్లు ఇవ్వరు.. ఇళ్ల స్థలాల్లో అవినీతి
  • ప్రభుత్వ వైఫల్యంపై టీడీపీ సమరం
  • ప్రతి నియోజకవర్గంలో.. స్కాం జరిగిన ప్రాంతాల సందర్శన
  • కక్షతోనే కొల్లు రవీంద్రపై కేసు
  • ఆయన చీమకైనా అపకారం చేయరు
  • కావాలనే హత్య కేసులో ఇరికించారు
  • బీసీ నేతలకు వైసీపీ వేధింపులు
  • టీడీపీ నాయకుల ఆగ్రహం
  • చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌


అమరావతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతిని ఎత్తిచూపుతూ సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం తమ పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను ఇంతవరకూ పేదలకు అందించలేదని.. టీడీపీపై కక్షతో వాటిని వారికి స్వాధీనం చేయకుండా వేధిస్తున్నారని నేతలు ఆరోపించారు. గ్రామాల్లో పేదలు కట్టుకున్న ఇళ్ళకు బిల్లులు కూడా ఇవ్వకుండా సతాయిస్తున్నారని, దీనిపై సోమ, మంగళవారాల్లో నిరసనలు చేపడతామని తెలిపారు. ఇళ్ల స్ధలాల కేటాయింపు కోసం చేసిన భూ సేకరణలో కుంభకోణాలు, పనికిరాని భూములను పేదలకు అంటగట్టే ప్రయత్నం చేయడం.. పేదల నుంచి డబ్బు వసూలు చేయడంపై మంగళవారం నిరసనలు నిర్వహించాలని నిశ్చయించారు. ఈ రెండు రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా కుంభకోణాలు జరిగిన ప్రాంతాలను.. ఇళ్లు ఇవ్వకుండా ఆపిన ప్రదేశాలను పార్టీ నేతలు సందర్శించి ఆ అంశాలను హైలైట్‌ చేయాలని నిర్ణయించారు. కరోనా వైరస్‌ నిబంధనలు పాటిస్తూ వర్చువల్‌ నిరసనలు జరపాలని చంద్రబాబు సూచించారు. హత్యలు చేసిన వాళ్లను వదిలేసి అమాయకులపై హత్యానేరం కేసులు పెడుతున్నారని.. వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని 13 నెలలైనా పట్టుకోలేకపోయారని విమర్శించారు.


అవినీతిని ఎత్తిచూపినందుకే..

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. రవీంద్రది గొడవలకు వెళ్లే స్వభావం కాదని, చీమకు కూడా అపకారం చేయని వ్యక్తిని వైసీపీ నేతల అవినీతిని ఎత్తిచూపాడన్న కోపంతో హత్య కేసులో ఇరికించారని ఆరోపించారు. ‘మచిలీపట్నంలో రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరులో పరస్పరం హత్యలు చేసుకున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య కక్షలను వైసీపీయే రెచ్చగొట్టింది. టీడీపీ హయాంలో ఇటువంటి కక్ష సాధింపులు లేవు. ఆ సమయంలో ఈ కుటుంబాల మధ్య ఘర్షణలూ లేవు. ఈ రెండు కుటుంబాల మధ్య పోరు గురించి బందరులో అందరికీ తెలుసు. అందులో రవీంద్రను ఇరికించడం అన్యాయం’ అని కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నారు. ‘జూన్‌ 29వ తేదీన మోకా భాస్కరరావు హత్య జరిగింది. నిందితులు లొంగిపోయారని ఉదయం 11.45కే టీవీ చానళ్లల వార్తలు వచ్చాయి. నిందితులు దొరికారని జగన్‌ పత్రికలో 30న వార్త వచ్చింది. పోలీసులకు లొంగిపోయినవారు రవీంద్రతో ఫోన్లో ఎలా మాట్లాడతారు? ఆయనకు నిందితులు ఫోన్‌ చేశారా.. వారితో ఎవరైనా చేయించారా? రవీంద్రను ఇరికించడానికే ఫోన్‌కాల్స్‌ డ్రామా ఆడుతున్నారా? ఏ ప్రాథమిక విచారణ లేకుండా రవీంద్రను అరెస్టుచేసి జైలుకు పంపారు’ అని ఓ ఎమ్మెల్సీ చెప్పారు. టీడీపీలోని బీసీ నాయకత్వంపై పనిగట్టుకొని వేధింపులకు దిగుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘అచ్చెన్నాయుడిని ఏసీబీ కేసులో, రవీంద్రను హత్య కేసులో ఇరికించారు. యనమలపై ఎస్సీ, ఎస్టీ కేసు.. అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు పెట్టారు. తొలి ఏడాది దళితులపై దాడులు, దౌర్జన్యాలు చేశారు. ఇప్పుడు బీసీ నేతలపై పడ్డారు’ అని ధ్వజమెత్తారు.


మనది అభివృద్ధి... వారిది కక్ష సాధింపు

టీడీపీ తన పాలనలో అభివృద్ధిపై దృష్టి పెట్టి పనిచేస్తే వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులు, రాజకీయ వేధింపులు లక్ష్యంగా పనిచేస్తోందని తెలుగుదేశం నేతలు విమర్శించారు. ‘కొత్త రాష్ట్రం ఎలా ముందుకు వెళ్లాలా అని అదే దృష్టితో పనిచేశాం. పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని భావించి దాని కోసం చాకిరీ చేశాం. కియా, అపోలో టైర్లు, హీరో మోటార్‌ సైకిళ్ల ఫ్యాక్టరీ, అశోక్‌ లేలాండ్‌, ఏషియన్‌ పెయింట్స్‌ వంటి పరిశ్రమలు తెచ్చాం. కర్నూలులో ఎయిర్‌ పోర్ట్‌ పూర్తి చేశాం. ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ అభివృద్ధి చేశాం. నంద్యాలలో మెగా సీడ్‌ పార్క్‌ తెచ్చాం. చిత్తూరులో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు తెచ్చాం. విశాఖను ఆర్ధిక రాజధానిగా మలిచాం. మెడ్‌టెక్‌ పార్క్‌ పెట్టాం. సాఫ్ట్‌వేర్‌, ఇతర కంపెనీలు తెచ్చాం. వైసీపీ వచ్చాక అన్ని పరిశ్రమలను తరిమేశారు. వాటాల కోసం పారిశ్రామికవేత్తలను బెదిరించారు. ప్రభుత్వ టెర్రరిజంతో భయానక వాతావరణం సృష్టించారు. ప్రతి పనిలో అవినీతితో దోచుకుంటున్నారు. ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోలులో రూ.8 వేల కోట్లలో రూ.5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. పట్టాలు ఇవ్వడానికి ఒక్కొక్కరి నుంచి రూ.30వేల నుంచి రూ.60 వేల వరకూ వసూలు చేస్తున్నారు’ అని చంద్రబాబు విమర్శించారు.

Updated Date - 2020-07-06T07:51:10+05:30 IST