ఇళ్లు.. ఎన్నాళ్లు?

ABN , First Publish Date - 2022-08-01T05:03:07+05:30 IST

టిడ్కో ఇళ్ల నిర్మాణం సంవత్సరాలుగా కొలిక్కి రావడం లేదు. పేదల కోసం మూడు కేటగిరీల్లో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ఇళ్లను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. లబ్ధిదారుల ఎంపికను మళ్లీ చేపట్టి కూడా నిర్మాణాలు పూర్తి చేయడం లేదు.

ఇళ్లు.. ఎన్నాళ్లు?
ఇంకా పూర్తికాని టిడ్కో గృహాలు

కనీస సదుపాయాలకు నోచుకోని టిడ్కో గృహాలు
కానరాని పక్కా రహదారులు
తాగునీరూ కరువే
నిర్మాణ దశలోనే వందలాది ఇళ్లు
సారిపల్లిలో 800 మందికి పంపిణీ
ఒకరూ నివాసానికి రాని వైనం
తాళాలు వేసి ఊరుకున్న లబ్ధిదారులు
ఇంకా నిర్మాణ దశలోనే తాగునీటి ట్యాంక్‌
కొండవెలగాడలోనూ నిర్మాణాల్లో జాప్యం
బొబ్బిలి టిడ్కో గృహాలకు నేటికీ దారి కరువు
మంచినీరు, విద్యుత్‌ సదుపాయాలు కల్పించని అధికారులు


టిడ్కో ఇళ్ల నిర్మాణం సంవత్సరాలుగా కొలిక్కి రావడం లేదు. పేదల కోసం మూడు కేటగిరీల్లో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ఇళ్లను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. లబ్ధిదారుల ఎంపికను మళ్లీ చేపట్టి కూడా నిర్మాణాలు పూర్తి చేయడం లేదు. మౌలిక సౌకర్యాలూ కల్పించడం లేదు. పక్కా రహదారులు లేవు. తాగునీరు లభ్యం కావడం లేదు. దీంతో సారిపల్లిలో పంపిణీ చేసిన ఇళ్లలో ఉండేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇళ్లకు తాళం వేసి ఊరుకున్నారు. కొండవెలగాడ గృహాలదీ ఇదే దుస్థితి. ఇక బొబ్బిలి టిడ్కో గృహాలను చూస్తే విస్తుపోవాల్సిందే. బురదమయమైన రహదారి.. అర్ధాంతర నిర్మాణాలు... పొదలే కనిపిస్తున్నాయి.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ఏళ్లుగా సా...గుతూ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వీటిని చేపట్టారు. అప్పట్లోనే కీలకమైన పనులన్నీ పూర్తి చేశారు. కొంత మంది లబ్ధిదార్లకు ఇళ్లను కేటాయించే తంతు కూడా చేపట్టారు. అంతలో ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడంతో టిడ్కో ఇళ్ల పరిస్థితీ మారిపోయింది. పైగా ఈ ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను మళ్లీ కొత్తగా చేపట్టింది. ఇందులో భాగంగా 800 మంది లబ్ధిదార్లకు వాటిని అప్పగించింది. అయినప్పటికీ వారెవరూ అందులో నివాసముండేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఫ గత నెల 23న 800 మంది లబ్ధిదార్లకు ఇళ్లను అప్పగించారు. ఆ రోజు కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌లు హాజరయ్యారు. ఆ రోజు వారు మాట్లాడుతూ పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదార్లకు ఇళ్లను అప్పగిస్తున్నట్లు చెప్పారు. క్షేత్ర స్థాయి పరిస్థితికి వారి ప్రకటన భిన్నంగా ఉంది. ఇంకా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మౌలిక సదుపాయాలు లేవు. ఈ కారణంతోనే ఇంట్లో దిగేందుకు ఎవరూ ఆసక్తిచూపడం లేదు. తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు. భారీ తాగునీటి రిజర్వాయర్‌(ట్యాంక్‌) నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. కేవలం మొదటి వరుస ఇళ్ల నిర్మాణాలే పూర్తి చేశారు. ఇందులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు 10 బ్లాకులు, సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు 15 బ్లాకులు ఉన్నాయి. మరో రెండు వరుసల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎప్పటికి పూర్తవుతాయో అధికారులు, నేతలకే తెలియాలి.
ఫ కొండవెలగాడ సమీపంలోని సోనియానగర్‌ వద్ద 1,120 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇవి కూడా ఎప్పటికి పూర్తిచేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంకా మరుగుదొడ్లు, ప్లంబింగ్‌ పనులు చేస్తూనే ఉన్నారు.

నిండా సమస్యలే...
బొబ్బిలి, జూలై 31: బొబ్బిలి పట్టణ పేదలకు రామన్నదొరవలస మున్సిపల్‌ సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్కు సమీపంలో 31.69 ఎకరాల్లో టిడ్కో ఇళ్లు చేపట్టారు. 2448 మంది లబ్ధిదారుల కోసం 51 బ్లాకుల్లో జి-ప్లస్‌-3 ప్రాతిపదికన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో బ్లాకులో 48 ఇళ్లను నిర్మించి పేదలకు ఇవ్వాలన్నది లక్ష్యం.  2018 డిసెంబరులో అప్పటి టీడీపీ మంత్రి ఆర్‌వి సుజయ్‌కృష్ణరంగారావు 2090 మందికి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. నిర్మాణ దశలో ఉండగానే ఈ ప్రక్రియ పూర్తి చేశారు.
తర్వాత ఎన్నికలు వచ్చాయి.  ప్రభుత్వం మారడంతో టిడ్కో ఇళ్లకు గ్రహణం పట్టింది. ఎక్కడ నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి. 768 మంది ఇళ్లను రద్దు చేశారు. వారికి చెల్లించిన డిమాండ్‌ డ్రాప్టులను మాత్రం వాపసు చేయలేదు. దీనిపై టీడీపీ నాయకత్వంలో టిడ్కో లేఅవుట్లలో ఆందోళనలు కూడా చేపట్టారు.  అయినా ప్రభుత్వం కనికరించకుండా జగనన్న లేఅవుట్ల పేరుతో కొత్త వాటికి ప్రాధాన్యం ఇచ్చింది. నిలిచిపోయిన టిడ్కో ఇళ్లకు రివర్స్‌ టెండరింగ్‌తో పనులు ప్రారంభించారు. కొంతమంది  లబ్ధిదారుల నుంచి లిఖితపూర్వకమైన పత్రాలు తీసుకొని వారికి కొత్త లేఅవుట్లలో ఇళ్లను కేటాయించారు. మొదటి కేటగిరీ లబ్ధిదారులకు సోమవారం నుంచి రూపాయి చార్జీతో రిజిస్ర్టేషన్లకు సన్నద్ధమవుతున్నట్లు మున్సిపల్‌ కమిషనరు సత్తారు శ్రీనివాసరావు తెలిపారు.  మిగిలిన 2, 3 కేటగిరీల లబ్ధిదారులకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించనున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అక్కడ కనీస సదుపాయాలైన రోడ్లు,  డ్రైయిన్లు, మంచినీరు, విద్యుత్‌ సదుపాయాలు కల్పించలేదు. ఆ బ్లాకులకు రంగులు, ఫినిషింగ్‌ వర్క్‌లు, అంతర్గతరోడ్లు, కుళాయిలు వంటివేవీ లేవు. బొబ్బిలి పట్టణం నుంచి టిడ్కో కాలనీకి చేరుకునేందుకు ఇప్పటికీ రహదారిని నిర్ణయించలేదు. రామన్నదొరవలస మీదుగా లేకా గ్రోత్‌సెంటరు మీదుగా అన్నది ఇంకా తేలలేదు.  గ్రోత్‌సెంటరు నుంచైతే బొబ్బిలి-సాలూరు రైల్వే ట్రాక్‌ ఉంది. రైల్వేశాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. టిడ్కోలో  ఇంకా రెండు బ్లాకులకు శ్లాబ్‌లు వేయాలి.



Updated Date - 2022-08-01T05:03:07+05:30 IST