ముంబై : మహారాష్ట్రలో శాసన సభ, శాసన మండలి సభ్యులకు గోరేగావ్‌లో ఇళ్ళు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిర్ణయాన్ని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యతిరేకించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నికైన 300 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇళ్ళు ఇవ్వాలని మహా వికాస్ అగాడీ ప్రభుత్వం నిర్ణయించింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మార్చి 25న శాసన సభలో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గోరేగావ్‌లో 300 ఇళ్ళు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముంబై, నవీ ముంబై, థానే మినహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారికి వీటిని ఇస్తామన్నారు.
మహా వికాస్ అగాడీ కూటమిలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉన్నాయి. 300 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముంబైలో ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శరద్ పవార్ మాట్లాడుతూ, ఈ నిర్ణయాన్ని మహా వికాస్ అగాడీ కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుందన్నారు. చట్ట సభల సభ్యుల కోసం ఇళ్ళను ప్రభుత్వం నిర్మించకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (MHADA) నిర్మించే ఇళ్ళలో వీరికి రిజర్వేషన్ కల్పించవచ్చునని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలకు తాను ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడం లేదన్నారు.
థాకరే ప్రతిపాదనపై బీజేపీ స్పందిస్తూ, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎమ్మెల్యేలకు ఈ ఆఫర్ ఇస్తున్నారని ఆరోపించింది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల్లో అత్యధికులు మిలియనీర్లని, వారికి ఇళ్ళు ఇవ్వడమెందుకని ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్ళ పదవీ కాలానికి మాత్రమే వీరు ఎన్నికయ్యారని, వీరు శాశ్వత ప్రభుత్వ, శాసన సభ ప్రతినిధులు కాదని అంటున్నారు. మహారాష్ట్ర అప్పుల భారం రూ.6.25 లక్షల కోట్లకు చేరుకుందని, ఇటువంటి సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇళ్లు ఎందుకు ఇవ్వాలని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర మంత్రి అశోక్ చవాన్ స్పందిస్తూ, ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తనకు తెలియదన్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ, ఈ ఇళ్లు ఉచితంగా ఇవ్వబోమని, MLA/MLC దంపతుల పేరు మీద ఇల్లు లేనివారికి మాత్రమే ఫ్లాట్ ఇస్తామని చెప్పారు. ఇటువంటివారు రూ.70 లక్షలు చెల్లించవలసి ఉంటుందన్నారు.
మహారాష్ట్రలో 288 మంది ఎమ్మెల్యేలు, 78 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో దాదాపు 60 మంది ముంబై, థానే, నవీ ముంబైలకు చెందినవారు.
ఇవి కూడా చదవండి