దినదిన గండంగా రేషన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2021-02-24T07:17:48+05:30 IST

ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఈ నెలలో 23 రోజులు గడిచినా.. 43 శాతం రేషన్‌ మాత్రమే పంపిణీ జరిగిందంటే ఈ కార్యక్రమ వైఫల్య స్థాయిని అర్థం చేసుకోవచ్చు.

దినదిన గండంగా రేషన్‌ పంపిణీ
నిమ్మనపల్లెలో రేషన్‌ వాహనం దగ్గర గుమికూడిన జనం

రెవెన్యూ ఉద్యోగులకు తలనొప్పులు


23 రోజుల్లో 43 శాతమే పంపిణీ


చిత్తూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఈ నెలలో 23 రోజులు గడిచినా.. 43 శాతం రేషన్‌ మాత్రమే పంపిణీ జరిగిందంటే ఈ కార్యక్రమ వైఫల్య స్థాయిని అర్థం చేసుకోవచ్చు. ఇంటింటికీ సరుకులను చేర్చేందుకు జిల్లాకు 724 రేషన్‌ పంపిణీ వాహనాలు మంజూరవగా.. ఈ నెల నుంచి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.పని వత్తిడి   తట్టుకోలేక ఇప్పటికే అధికారికంగా 23 మంది, అనధికారికంగా 70మందికిపైగా వాహన ఆపరేటర్లు రాజీనామా చేసినట్లు సమాచారం. కొన్నిచోట్ల రాజీనామా స్థానంలో కొత్తగా నియమించిన రెండో వ్యక్తి కూడా మానేయడంతో మూడో వ్యక్తిని పెట్టుకున్నారు.మరోవైపు ఈ కార్యక్రమం రెవెన్యూ అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. పంపిణీ వందశాతం పూర్తి చేయాలని తహసీల్దార్లకు లక్ష్యం ఇవ్వడం.. వీఆర్వోలు వాహనం వెనుక వెళ్లడం.. వంటి పనులను అదనంగా కేటాయించడంతో ఇబ్బంది పడుతున్నారు. 


వాహన ఆపరేటర్ల రాజీనామా బాట

తొలుత ఈ కార్యక్రమంతో లాభపడొచ్చనే ఉద్దేశంతో చాలామంది అధికార పార్టీ కార్యకర్తలు వాహనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ.3 లక్షల రాయితీ వస్తుండడంతో స్థానిక ఎమ్మెల్యేలతో సిఫారసు చేయించుకుని మరీ వాహనాలను సొంతం చేసుకున్నారు. తీరా కార్యక్రమం ప్రారంభమయ్యాక ఈ పని తాము చేయలేమని చేతులెత్తేస్తున్నారు. నాయకుల అండతో బి.కొత్తకోట వంటి మండలాల్లో కొందరు ఆపరేటర్లు అసలు పంపిణీయే ప్రారంభించలేదు. మరికొందరు ఇష్టమొచ్చినట్లు పంపిణీ చేస్తూ.. వీఆర్వోల మీద పెత్తనం చెలాయిస్తున్నారు. చిత్తూరు నగరంలో ఒక ఆపరేటర్‌ పేరిట రెండు వాహనాలున్నాయి. రెండు జీతాలు తీసుకుంటున్నాడు. ఎమ్మెల్యేకి దగ్గరి వ్యక్తిగా చెప్పుకుని వీఆర్వోలను బెదిరిస్తున్నారు. కొంతమంది ఆపరేటర్లు  హెల్పర్లు లేక, డీలర్ల సహకారం లేక ఇబ్బంది పడుతున్నారు. ఆపరేటర్ల వేతనాన్ని రూ.16 వేల నుంచి రూ.21 వేలకు పెంచినా.. ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికే 70 మందికి పైగా రాజీనామా చేసినట్లు సమాచారం. 23మంది రాజీనామాలను అధికారులు ఆమోదించారు. తిరుపతి రూరల్‌ మండలంలో 18 మందికిగానూ 16 మంది ఆపరేటర్లు హెల్పర్లను నియమించకుంటే తమ రాజీనామాలను ఆమోదించాలని మంగళవారం తహసీల్దార్‌ భాగ్యలక్ష్మికి వినతి పత్రం అందించారు. హెల్పర్ల కోసం ప్రభుత్వం ఇస్తున్న రూ.5 వేలు సరిపోవడం లేదని, ప్రభుత్వమే హెల్పర్లను నియమించాలని ఆపరేటర్లు కోరుతున్నారు. పలమనేరు నియోజకవర్గంలోని ఓ మండలంలో మొదటి ఆపరేటర్‌ రాజీనామా చేశాక రెండో వ్యక్తిని నియమించుకున్నారు. తీరా అతను కూడా మానేయడంతో అక్కడి తహసీల్దార్‌ కష్టమ్మీద మూడో వ్యక్తిని నియమించుకున్నారు. ఆపరేటర్ల రాజీనామాలను ఆమోదించి వారి స్థానంలో కొత్తవారిని నియమించుకోమని సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ సూచించినా అదంత సులభంగా అయ్యేట్లు లేదని తహసీల్దార్లు వాపోతున్నారు.


రెవెన్యూ సిబ్బందికి తలనొప్పి

రేషన్‌ పంపిణీ వంద శాతం పూర్తి చేయాలని సూచిస్తూ.. ఇటీవల మదనపల్లె డివిజన్‌లోని తహసీల్దార్లతో ఉన్నతాధికారులు వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. ఇక్కడి వరకు బాగున్నా.. తెల్లవారుజామున 5 గంటలకు వారు పనిచేసే మండల కేంద్రాల నుంచి హాజరుకావాలని ఆదేశించారు. దీంతో వారు పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. క్షేత్రస్థాయిలోని ఇబ్బందులను పట్టించుకోకుండా వందశాతం రేషన్‌ పంపిణీ పూర్తి చేయమనే ఉన్నతాధికారుల ఆదేశాలతో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మొదటి నెల కావడంతో రేషన్‌ వాహనంతో పాటు వీఆర్వోలు కూడా తిరగాల్సి వస్తోంది. రేషన్‌ వాహనాల బాధ్యత ఉండడంతో రోజు సచివాలయాలకు వెళ్లి బయోమెట్రిక్‌ వేసే పని నుంచి మినహాయించాలని వీఆర్వోలు మంగళవారం తిరుపతి ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. 


రిపేర్‌ వస్తే జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సిందే

రేషన్‌ పంపిణీ చేసే యంత్రాలు సాంకేతికంగా పనిచేయకపోతే.. వాటిని తీసుకుని జిల్లా కేంద్రానికి వెళ్లాలి. ఏ చిన్న మరమ్మతు వచ్చినా ఇదే పరిస్థితి. ఈ బాధ్యతంతా వీఆర్వోల మీదే ఉండడం వారికి అదనపు భారంగా మారింది. జిల్లా మొత్తానికి యంత్రాలను రిపేర్‌ చేసే వ్యక్తి ఒకరే ఉండడంతో, అదీ జిల్లా కేంద్రంలో మాత్రమే ఉండడంతో రెవెన్యూ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. టెక్నికల్‌ సపోర్ట్‌ పూర్తిగా లేకపోవడం కూడా పంపిణీ వందశాతం పూర్తికాకపోవడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.


మాయమైన వెయింగ్‌ మిషన్లు ఎక్కడ?

   రేషన్‌ పంపిణీకి ఉద్దేశించిన మొబైల్‌ వాహనాల్లో ఉండాల్సిన అతి ముఖ్యమైన పరికరం వెయింగ్‌ మిషన్‌.అవి ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 73 గల్లంతైనట్లు తేలింది. 724 మొబైల్‌ వాహనాల్లో బియ్యం తూకం వేసేందుకు వెయింగ్‌ మిషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజా లెక్కల ప్రకారం ఇంత వరకు 651 వాహనాలకు వెయింగ్‌ మిషన్లు అమర్చారు. వాటిలో 449 పనిచేస్తుండగా 202 మిషన్లు రిపేరయ్యాయి.గల్లంతైన 73 మిషన్లు ఎక్కడున్నాయో తెలియడం లేదు. ఈ వాహనదారులు కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను ప్రశ్నిస్తున్నా జిల్లా పర్యవేక్షణాధికారి సోమయాజులు సరిగా సమాధానం చెప్పడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. దీంతో మాయమైన వెయింగ్‌ మిషన్లు ఎక్కడున్నాయో 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని జేసీ మార్కండేయలు మంగళవారం రాత్రి సోమయాజులకు తాఖీదులు జారీ చేశారు. నివేదిక అందిన తరువాత వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానన్నారు. 

Updated Date - 2021-02-24T07:17:48+05:30 IST