House thief: ప్రియురాలి కోసం...!

ABN , First Publish Date - 2022-08-09T14:17:40+05:30 IST

ప్రియురాలి మోజులో పడిన ఓ పారిశ్రామికవేత్త.. ఆమెను సంతోషపెట్టేందుకు తన భార్య నగలే చోరీ చేసి కటకటాలపాలైన ఉదంతమిది. రెండు వ్యాపా

House thief: ప్రియురాలి కోసం...!

- ఇంటి దొంగగా మారిన పారిశ్రామికవేత్త 

- ప్రేయసికి 550 సవర్ల నగలు అప్పగింత

- లగ్జరీ కారులో షికార్లు 

- పోలీసుల జోక్యంతో కటకటాలపాలు


చెన్నై, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రియురాలి మోజులో పడిన ఓ పారిశ్రామికవేత్త.. ఆమెను సంతోషపెట్టేందుకు తన భార్య నగలే చోరీ చేసి కటకటాలపాలైన ఉదంతమిది. రెండు వ్యాపారాల్లో సంపాదించిన డబ్బు ధారపోసినా, కారు, ఇల్లు కొనుగోలు చేసి ఇచ్చినా ఆమె సంతృప్తిచెందకపోవడంతో ఆఖరికి తన ఇంట్లోని నగలే దొంగతనం చేసి దొరికిపోయాడా ప్రబుద్ధుడు. స్థానిక పూందల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు ఇలా వున్నాయి...  పూందమల్లి ముత్తునగర్‌కు చెందిన శేఖర్‌ (40) స్వీట్‌షాపు, ఫైనాన్స్‌ సంస్థ నడుపుతున్నాడు. రెండేళ్ల క్రితం శేఖర్‌ భార్య మనస్పర్థల కారణంగా పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా తరచూ శేఖర్‌(Shekhar) అత్తగారింటికి వెళ్ళి వస్తుండేవాడు. ఆ సమయంలో తన బావమరిది బీరువాలో తన భార్య నగలను గమనించిన శేఖర్‌.. వరుసగా వాటిని చోరీ చేశాడు. మొత్తం 550 సవర్ల బంగారు నగలను చోరీ చేశాక రెండు రోజుల నుంచి కనిపించకుండాపోయాడు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బీరువా తెరిచి చూసిన శేఖర్‌ బావమరిది.. నగలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. తమ ఇంటికి శేఖర్‌ తప్ప ఇంకెవ్వరూ రాలేదని ఆయన భార్య, కుటుంబీకులు తెలుపటంతో పోలీసులకు ఆయనపై అనుమానం కలిగింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. రెండేళ్లుగా ఓ యువతితో ఏర్పడిన వివాహేతర సంబంధం కారణంగా చోరీ చేసిన నగలన్నీ ఆమెకే ఇచ్చానని పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. అంతేగాక ఆమెకు ఓ లగ్జరీ కారు, ఓ ఇల్లు కొనుగోలు చేసి ఇవ్వడంతో పాటు స్వీట్‌షాపు, ఫైనాన్స్‌ సంస్థ ద్వారా వచ్చిన డబ్బు ఆమెకే ధారపోశాడని తేలింది. అయినా ఆమె ధనదాహం తీరకపోవడంతో, ఆమెను సంతృప్తిపరిచేందుకు తన భార్య నగల్ని చోరీ చేసి ఇచ్చినట్లు పోలీసులు గ్రహించారు. ఆ కారులో ఆ యువతితో తిరిగేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు ఆ యువతిని కూడా అరెస్టు చేశారు. ఆమె వివాహిత అని, ఆమె భర్త వస్త్రదుకాణం(clothing store) నడుపుతున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. కాగా శేఖర్‌ తనకెలాంటి నగలు ఇవ్వలేదని ఆ యువతి దర్యాప్తులో పేర్కొన్నట్లు తెలిసింది. దాంతో పోలీసులు ఈ వ్యవహారంపై తీవ్ర విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-08-09T14:17:40+05:30 IST