మీ హక్కు.. మాకొద్దు

ABN , First Publish Date - 2021-12-01T06:07:30+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై లబ్ధిదారులు గుర్రుగా ఉన్నారు.

మీ హక్కు.. మాకొద్దు

సంపూర్ణ గృహ హక్కుపై గుర్రు 

జగనన్న ఓటీఎస్‌పై లబ్ధిదారుల వ్యతిరేకత

జిల్లాలో 3.57 లక్షల మంది లబ్ధిదారుల గుర్తింపు

రూపాయికే రిజిస్ట్రేషన్‌ అన్నారు.. మరి వేలు ఎందుకు 

సచివాలయ సిబ్బంది, వలంటీర్లపై అధికారుల ఒత్తిడి 



ఏళ్ల క్రితం స్థలం కాగితాలు తీసుకున్నారు.. ఇల్లు కట్టించారు.. ఇప్పుడేమో ఆ కాగితాలు కావాలంటే అప్పడు కట్టించిన ఇంటి నగదును చెల్లించాలంటున్నారు. ఇదేందని పలువురు లబ్ధిదారులు ఆశ్చర్యపోతున్నారు. బాదుడే.. బాదుడు.. అన్న తీరులో ప్రభుత్వం అందిన కాడికి పీల్చిపిప్పిచేసే క్రమంలో తాజాగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరిట  పెద్దమొత్తంలో నగదు వసూళ్లపై పాలకులు దృష్టి సారించారు. పేదలకు గూడు కల్పించాలని గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లపై ప్రస్తుత పాలకులు కన్నేశారు. కొంత సబ్సిడీతో గృహాలు నిర్మించుకునేందుకు అప్పటి ప్రభుత్వాలు అందచేసిన రుణాలను వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఆ గృహ రుణాల గురించి ఏ ప్రభుత్వం ఆలోచించకపోవడంతో ఇంతకాలం తమకు ప్రభుత్వాలు ఉచితంగా ఇళ్లు కట్టించాయనే లబ్ధిదారులు భావించారు. ఆయా నివాసాల్లో ఉన్న వారికి ఓటీఎస్‌ కింద రిజిస్ట్రేషన్‌ చేసి సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తామంటూ ప్రస్తుత పాలకులు ఆశ చూపుతున్నారు. అయితే ఎప్పుడో కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరి అష్టకష్టాలు పడుతున్న తమకు మరమ్మతులకు నిధులు ఇవ్వకపోగా తామే రూ.వేలకు వేలు కట్టాలంటూ ఇళ్ల వద్దకు వస్తున్న సచివాలయ సిబ్బందిపై మండిపడుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి - గుంటూరు/అచ్చంపేట)

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై లబ్ధిదారులు గుర్రుగా ఉన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన రుణంతో ఇల్లు నిర్మించుకున్న వారికి ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పేరుతో రూపాయికే హక్కులు కల్పిస్తామంటున్న వైనంపై మండిపడుతున్నారు. పేరుకు రూపాయి అని వేలకు వేలు కట్టమంటే ఎక్కడి నుంచి తేవాలి అని నిలదీస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం లక్ష్యం నిర్ధేశించి  అధిగమించాల్సిందేనంటూ సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతుంది. జిల్లాలో 1983 నుంచి 2014 మార్చి వరకు గృహ రుణాలు పొందిన వారు 3.57 లక్షల మంది ఉన్నారు. అయితే గూడు కట్టుకున్నది పేదలే కాబట్టి ఇచ్చిన రుణాలను ఏ ప్రభుత్వమూ ఇంతవరకు తిరిగి కట్టించుకోలేదు.  ఆయా రుణాలను తిరిగి చెల్లించాలని అడిగిన వారు ఇప్పటి వరకు ఎవరూ లేరు. దీంతో పక్కా గృహాలు పొందిన వారు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం ఉచితమే అని ఇంతకాలం అనుకున్నారు. జిల్లాలో దాదాపు 80 శాతం మంది పక్కా గృహాలు పొందిన వారు తిరిగి రుణాలను ప్రభుత్వానికి చెల్లించలేదు. పక్కా గృహం మంజూరు చేసే సమయంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు లబ్ధిదారుల వద్ద పట్టా, భూమి రిజిస్ట్రేషన్‌ పత్రాలు తీసుకుని రుణం మంజూరు చేశారు. ప్రస్తుతం 30 ఏళ్లుగా ఆయా పత్రాలన్నీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ వద్దనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఆ పాత రుణాలను రాబట్టుకునేందుకు సిద్ధమైంది. అందుకోసం సరికొత్త ఎత్తుగడ వేసింది జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో వసూళ్లకు సిద్ధమైంది. డబ్బులు చెల్లించాలని లబ్ధిదారులపై అటు వలంటీర్లు, ఇటు సచివాలయ సిబ్బంది ద్వారా ఒత్తిడ్తి తెస్తున్నారు. అయితే లబ్ధిదారులు మాత్రం ఈ పథకానికి ససేమిరా అంటున్నారు. మీ హక్కులు మాకొద్దు అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. పట్టణాలు, నగరంలో అక్కడక్కడ కొందరు ముందుకు వస్తున్నప్పటికీ మండలాల్లో మాత్రం స్పందన కనిపించకపోగా తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. 

 జిల్లాలో గత 40 ఏళ్లలో 3.57 లక్షల మంది ప్రభుత్వం అందించే రుణంతో పక్కా గృహాలు నిర్మించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరి నుంచి తిరిగి రుణాలను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ధేశించింది. అనేక మంది ఇళ్లను అమ్మేసుకున్నారు. అయితే ఎవరైతే అసలు లబ్ధిదారుడు ఉన్నారో వారి నుంచి ఓటీఎస్‌ కింద డబ్బులు కట్టించుకుని రిజిస్ట్రేషన్‌ చేస్తామంటూ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళుతున్నారు. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న పక్కా గృహాలు అనేక చోట్ల నివాసానికి పనికి రాకుండా ఉన్నాయి. కొన్ని చోట్ల ఆనవాళ్లు కూడా లేవు. దీంతో ఓటీఎస్‌పై గ్రామీణ లబ్ధిదారుల్లో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఇంకొందరు గత ప్రభుత్వాలు ఇచ్చిపోతే ఈ ప్రభుత్వం వాటి మరమ్మతుకలు నిధులు ఇవ్వాల్సింది పొయి, డబ్బులు కట్టాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒన్‌టైం సెటిల్‌మెంట్‌కు సంబంధించి వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం టార్గెట్లు నిర్ణయించింది. లబ్ధిదారుల నుంచి నగదు కట్టించాలంటూ వారిపై ఒత్తిడి తెస్తుంది. గ్రామాల్లో ఉన్నతాధికారులు పర్యటిస్తూ హెచ్చరికులు జారీ చేస్తున్నారు.    


అనేక అనుమానాలు.. ఆందోళనలు

ఓటీఎస్‌ పథకంలో చాలావరకు చట్టబద్ధ సమస్యలు ఉన్నాయి. దీంతో  ఈ పథకంపై లబ్ధిదారుల్లో అనేక అనుమాలు నెలకొంటున్నాయి. ఇలా క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఎంచుకున్న విధానం చట్టబద్ధం కాదని పలువురు భావిస్తున్నారు. దీనికి తోడు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ విధానం ప్రయోగత్మాక దశలో ఉండటం కూడా లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామ సచివాలయాల ఏర్పాటు, సిబ్బంది నియామకాలకు సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. ఈ దశలో సచివాలయ వ్యవస్థలో తెచ్చిన ఈ పథకంపై పలువురు ఆసక్తి చూపడంలేదు. దీనికి తోడు గ్రామ సచివాలయ కార్యదర్శిని సబ్‌ రిజిస్ట్రార్‌ హోదా కల్పించడంపై ఎవరైనా కోర్టులో సవాల్‌ చేస్తే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనలోనూ ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో రూ.వేలు ఓటీఎస్‌ కింద ప్రభుత్వానకి సమర్పించుకుంటే ఎలాంటి వివాదాలు చోటుచేసుకున్నా నష్టపోతామని పలువురు భావిస్తున్నారు. 


ఓటీఎస్‌కి.. ప్రత్యేక అధికారులు

జగనన్న సంపూర్ణ గృహ హక్కు(ఓటీఎస్‌) పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటీఎస్‌లో తలెత్తే అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యతలను ప్రత్యేక అధికారులకు కేటాయించారు.  ఇంటి పత్రాలను మార్టుగేజ్‌ చేసుకుని రుణాలు పొందిన లబ్ధిదారుల వివరాలను మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌, సచివాలయాలకు పంపించారు. ఈ  క్రమంలో ఓటీఎస్‌ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించి ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్‌ తెలిపారు. 


 ఉచితమని.. ఓటీఎస్‌ ఏమిటి? 

పులిచింతల పునరావాస కేంద్రమైన పెదపాలెంలోని చిట్యాల తండావాసులపై ఓటీఎస్‌ పేరుతో నగదు కట్టాలని తెస్తున్న ఒత్తిడిపై కాలనీవాసులు మండిపడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 2008లో బెల్లంకొండ మండలం చిట్యాల తండా నుంచి సొంత గృహాలు, భూములు అన్ని వదిలేసుకుని పెదపాలెం వద్ద నిర్మించిన పునరావాస కేంద్రానికి చేరారు. అప్పట్లో ప్రభుత్వం అన్నీ ఉచితంగా ఇస్తామంటూ వాగ్దానం చేసింది. పెదపాలెం గ్రామ పంచాయతీలో కలిసినప్పటికీ పునరావాస కేంద్ర అభివృద్ధికి నిధులు లేక పోవటంతో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. మాకు ప్రభుత్వం ఐదు సెంట్లు ఇచ్చి పూర్తి హక్కులతో ఇళ్ళు కట్టించి రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పి మోసగిస్తుంది అంటూ తండావాసులు మండిపడుతున్నారు.


పట్టాలు మాత్రమే ఇచ్చారు

డీకే పట్టాలు మాత్రమే ఇచ్చారని ఓటీఎస్‌ వర్తించదంటున్నారు. ప్రభుత్వం మాకు ప్రకటించిన రాయితీలు కచ్చితంగా నెరవేర్చాలి. లేకుంటే మేము మా హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాము.

- బాణావత్‌ బీక్కూనాయక్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ 


హక్కులు కల్పించండి

పునరావాస కేంద్రంలో ఉంటున్న మాకు నివాస హక్కులు కల్పించండి. కాలనీకి వసతులు కరువయ్యాయి. ముళ్ళ పొదలు పెరిగి అడవిలా మారింది. మాకు ఏ అధికారి సహకరించటం లేదు. మా సమస్యలు పరిష్కరించండి.

- కుంభా శ్రీను, పునరావాస కేంద్రం

 

Updated Date - 2021-12-01T06:07:30+05:30 IST