ఇళ్లకు.. బ్రేక్‌

ABN , First Publish Date - 2021-10-11T05:28:29+05:30 IST

హైకోర్టు తీర్పుతో జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను ఎక్కడికక్కడ నిలిపేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.

ఇళ్లకు.. బ్రేక్‌

హైకోర్టు తీర్పుతో ఆగిన నిర్మాణాలు

జగనన్న ప్లాట్ల ప్రమాణాలపై అభ్యంతరాలు

ఎక్కడికక్కడ నిలిచిపోనున్న 11,209 ఇళ్ల నిర్మాణాలు



జగనన్న ఇళ్లకు.. బ్రేక్‌ పడింది. ప్రమాణాలకు అనుగుణంగా జగనన్న కాలనీల లేఅవుట్లు లేవన్న హైకోర్టు అభ్యంతరాలతో జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైన 11,209 ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. సెంటు, సెంటున్నరలో కొత్తగా కాలనీలు ఏర్పాటు చేస్తే అవి మురికివాడలుగా తయారవుతాయని  సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. దీనిపై నెలరోజుల్లో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, మరో నెలలోనే నివేదిక తెప్పించుకుని... దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో అప్పటిదాకా ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు తీర్పుతో ఆయా నిర్మాణ పనులపై ప్రభావం పడింది. మరోవైపు ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు, పలువురు వ్యక్తులు ఇరుకిరుకు ఇళ్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


గుంటూరు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు తీర్పుతో జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను ఎక్కడికక్కడ నిలిపేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఆయా లేఅవుట్లలో లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టొదని హైకోర్టు వెలువరించిన తీర్పుతో ఈ పరిస్థితి నెలకొన్నది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమిని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇళ్ల నిర్మాణాలు చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ పథకంలో లోపాలను స్పష్టంగా ఎత్తి చూపింది. ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని, ఆ ప్రక్రియ ముగిసే వరకు ఇళ్ల నిర్మాణాలను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కమిటీ లబ్ధిదారులకు అదనంగా భూమిని సిఫార్సు చేస్తే ఆ లేఅవుట్లను సవరించాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో జిల్లాలో ఇప్పటికే ప్రారంభించిన 11,209 ఇళ్ల నిర్మాణాలను ఉన్నపళంగా నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది.


ఇరుకిరుకు ఇళ్లతో అవస్థలే..

ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో దగ్గరదగ్గరగా ఇరుకిరుకు ఇళ్లు ఉంటే అంటువ్యాధులు వేగవంతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా తాము రూ.3 లక్షల విలువ చేసే ఆస్తిని పేదలకు ఇస్తోన్నామని గొప్పులు చెప్పుకొంటోన్నది. అయితే ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఒక్క మహిళలకే ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న నిబంధన ఏ చట్టంలోనూ లేదు. అయితే వైసీపీ ప్రభుత్వం పురుషులు, ట్రాన్స్‌జెండర్ల పేర్లతో ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడాన్ని కూడా హైకోర్టు తప్పు పట్టింది. కన్వేయన్స్‌ డీడ్‌లు రద్దు చేసి గతంలో వలే డీ-ఫారం పట్టాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.


కనీసం రెండున్నర సెంట్లు ఉంటేనే

పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు కనీసం రెండున్నర సెంట్లు అయినా ఉండాలన్న అభిప్రాయం వివిధ వర్గాల ద్వారా వ్యక్తమౌతోన్నది. అప్పుడే సక్రమంగా ఇంటిని నిర్మించుకోవచ్చని, లేదంటే ఇరుకిరుకు నివాసంలో అవస్థలు పడాల్సి వస్తుందనే అభిప్రాయం ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ కమిటీని నియమిస్తే ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు చెప్తున్నారు. అప్పుడు వారికి స్థలాలు ఇవ్వడానికి అదనంగా భూమిని సేకరించాల్సిన పరిస్థితి ఉత్పన్నమౌతుంది. అసలే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అదనంగా భూమిని సేకరిస్తుందో, లేదోనన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మొండివైఖరికి తెనాలికి చెందిన పొదిలి శివమురళీతో పాటు మరో 128 మంది హైకోర్టులో కేసు వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతున్నది.


జిల్లాలో మందకొడిగా నిర్మాణాలు

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద జిల్లాలో 2 లక్షల 64 వేల 969 మందికి నివేశన స్థలాలను పంపిణీ చేసింది. ఇందుకోసం 1,474 లేఅవుట్లను వేసింది. జిల్లాలో తొలి విడత కింద లక్షా 22 వేల 435 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆ మేరకు లబ్ధిదారులతో అధికారులు శంకుస్థాపనలు చేయించారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే జిల్లాలో మందకొడిగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 11,209 మందితో భవన నిర్మాణ పనులు ప్రారంభింపచేశారు. వీటిల్లో 9,856 నిర్మాణాలు రూఫ్‌ స్థాయికి చేరుకున్నాయి. ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జాయింట్‌ కలెక్టర్‌ని నియమించింది. అంతేకాకుండా జిల్లాలోని ఇతర జాయింట్‌ కలెక్టర్లకు కూడా పర్యవేక్షణ బాధ్యతలు కేటాయించారు. కాగా లేఅవుట్‌లు ఎక్కడో 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండటం, అక్కడ నివాసానికి ఏమాత్రం యోగ్యంగా లేకపోవడంతో సింహభాగం లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాలేదు. సచివాలయాల సిబ్బందితో పలుమార్లు బెదిరింపులకు కూడా దిగారు. ఇల్లు నిర్మించుకోకపోతే ఇచ్చిన పట్టా రద్దు చేస్తామని చెప్పారు. అయినా లబ్ధిదారులు ముందుకు రాలేదు.

Updated Date - 2021-10-11T05:28:29+05:30 IST