వర్షాకాలం.. ఇంటిని తీర్చిదిద్దుకుందాం.. కాస్త మనసు పెడితేనే..

ABN , First Publish Date - 2021-06-13T13:40:22+05:30 IST

వర్షాకాలం వస్తూనే ప్రకృతికి నూతన రంగులనూ జోడిస్తుంది.

వర్షాకాలం.. ఇంటిని తీర్చిదిద్దుకుందాం.. కాస్త మనసు పెడితేనే..

  • కరోనా కాలంలో అప్రమత్తతే కీలకం
  • కాస్త మనసు పెడితేనే ఆహ్లాదకరం


హైదరాబాద్‌ సిటీ : వర్షాకాలం వస్తూనే ప్రకృతికి నూతన రంగులనూ జోడిస్తుంది. తొలకరి జల్లుల వేళ మట్టి వాసనలు ఆస్వాదిస్తూ, లివింగ్‌రూమ్‌ కిటికీల నుంచి వర్షపు చినుకుల వయ్యారాలకు పులకించి పోయే వారెందరో! ఈ వర్షాకాలం లో ఇండోర్‌లలో గడుపుతున్న వారు తమకు ఆవహించిన నీరసం పొగొట్టుకోవాలనుకుంటే ఇంటిలో నూతన రంగులను జోడించడమూ అవసరమే అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. దీనితో పాటుగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో ఇబ్బందుల బారిన పడకుండా ఉండాలంటే కొద్దిపాటి జాగ్రత్తలూ తీసుకోవాలంటున్నారు వారు. కరోనా కాలం.. అందునా వర్షాకాలంలో తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి ఇంటీరియర్‌ డిజైనర్లు పియూష్‌, ఉదయ్‌ అందిస్తున్న సూచనలు...


తేమ లేకుండా చూసుకోవాలి

కొత్తగా కట్టిన అపార్ట్‌మెంట్‌లైనా నాణ్యతాపరంగా కొంతమంది బిల్డర్లు రాజీపడుతుండటంతో నాలుగేళ్లకే గోడలు చెమ్మరావడం, శ్లాబుల నుంచి నీరు కారడం కనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి పనులు చేయించాలనుకున్నప్పుడు వర్షాలు రాకముందే చేయించడం మంచి ది. ప్రస్తుతం ఇంకా వర్షపు జోరు ఆరంభం కాలేదు కాబట్టి తగిన ప్రయత్నాలూ చేయవచ్చు. పగుళ్లుఉంటే ఈ తేమ కనిపిస్తుంటుంది. తేమ, దాని కారణంగా ఏర్ప డే నాచు, తద్వారా గది వాతావరణంలో వచ్చే మార్పులు వైరస్‌ వృద్ధికి అనువుగా ఉండే అవకాశాలున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుని పగుళ్లు పూరించడం, వీలున్న చోట క్రాక్‌ ఫిల్‌ పుట్టీ పట్టించడం చేయాలి.


వెంటిలేషన్‌కు ప్రాధాన్యమివ్వాలి

వర్షాకాలంలో సాధారణంగా చాలామంది ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంచుతుంటారు. కానీ, కరోనా కాలంలో వెంటిలేషన్‌కు అమిత ప్రాధాన్యం ఏర్పడింది. వర్షాకాలంలో ఇది మరీను. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, తడిచిన వస్త్రాలు లేదంటే షూస్‌ తదితర కారణాల వల్ల మూసి ఉంచిన గదులలో చెడు వాసన వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల కనీసం పగలైనా తలుపులు తెరిచి ఉంచాలి. దీనితోపాటుగా ప్రతి గదిలోనూ ఫుట్‌ మ్యాట్స్‌ను డోర్స్‌ దగ్గర ఉంచితే ఈ సమస్య కూ పరిష్కారం లభిస్తుంది. గదికి తగినట్లుగా రంగులు ఉంటే, మీ భావాలనూ మార్చగలవట. ఈ వర్షాకాలంలో ఇంటీరియర్స్‌ బ్రైట్‌ కలర్స్‌లో ఉంటే బాగుంటుంది.


లివింగ్‌ రూమ్‌ కోసం..

లివింగ్‌ రూమ్‌ దగ్గరకు వచ్చేసరికి ఇంటీరియర్స్‌ పరంగా ప్రయోగాలు చేయడానికి అపరిమిత అవకాశాలుంటాయి. లివింగ్‌రూమ్‌ను ప్రకాశవంతంగా మలుచుకోవడానికి గోడలకు బ్రైట్‌ రెడ్స్‌, బ్లూ లేదంటే పసుపు రంగు జోడించవచ్చు. ఇటీవలి కాలంలో వస్తున్న హెచ్‌డీ కలర్స్‌ రూమ్‌ కనిపించే విధానం మొత్తాన్నీ మార్చడంతో పాటుగా పది కాలాల పాటు ఆ కొత్తదనం నిలిచి ఉండేటట్లు చేస్తాయి. వర్షాకాలం అనగానే బయట నుంచి ఓ విధమైన తేమ వాసన వస్తుంటుంది. కనుక సువాసనలు వెదజల్లే క్యాండిల్‌ను సెంటర్‌ టేబుల్‌ మీద ఉంచితే రూమ్‌ కొత్తగా కనబడటమే కాదు.. తాజా అనుభూతులనూ అందిస్తుంది. లివింగ్‌రూమ్‌లో మరీ ఎక్కువగా ఫర్నిచర్‌ లేకుండా చూసుకోవడం మంచిది. ఈ గదిలో టర్క్యూయిస్‌ కలర్‌ బాగుంటుంది.  గోడలకు ఈ  రంగు కాకపోతే కర్టెన్స్‌, వాల్‌ పేపర్స్‌ లాంటివి కూడా ఈ రంగులో జోడించుకోవచ్చు. ఇక లివింగ్‌ రూమ్‌లో  ఆహ్లాదాన్ని అందించే మరో కలర్‌ కాంబినేషన్‌ ఎల్లో-ఆరెంజ్‌.


బెడ్‌రూమ్‌..

ఎక్కువ మందికి ఇంటిలో ఇష్టమైన రూమ్‌ బెడ్‌రూమ్‌ కావొచ్చు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో కూడా దానిలో పెద్దగా మార్పేమీ లేదనే వారే ఎక్కువ. పసుపు రంగులో షేడ్స్‌ ఉంటే మరింత ప్రకాశవంతంగా రూమ్‌ ఉంటుంది. అలాగే పర్పుల్‌, పింక్‌ కాంబినేషన్‌లలో కార్పెట్స్‌, ఫ్లవర్‌ వాజ్‌లు, పెయింటింగ్స్‌ వంటివి కూడా ఉంచితే అందంగా ఉంటుంది. 


కిచెన్‌కీ కావాలో కలర్‌..

మహిళలు ఇంటిలో అధికంగా గడిపే గది కిచెన్‌ అని చెప్పకతప్పదు. కరోనా కాలంలో తమకు పనెక్కువ అయిందని వాపోయే ఇల్లాళ్లు ఎక్కువగానే కనబడుతున్నారు. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే అది ఆమె తయారుచేసే రుచికరమైన ఫుడ్‌పై కూడా కనిపిస్తుందని కొంతమంది చెబుతుంటారు కానీ కష్టమైన వంటపని కూడా ఇష్టంగా చేయాలనుకునేవారు కిచెన్‌ను రంగులమయం చేసుకోవడమే మంచిది. డైనింగ్‌ టేబుల్‌ ప్లెయిన్‌గా ఉండటంతో పాటుగా డైనింగ్‌ క్లాత్‌గా పేస్టల్‌ కలర్‌ వాడితే బాగుంటుంది. 


ఇంకా ఈ మాన్‌సూన్‌లో ఏం చేయవచ్చంటే...

- ప్రకాశవంతమైన, ఆహ్లాదకరమైన డోర్‌మ్యాట్‌ను ఇంటి బయట ఉంచితే వర్షం వల్ల మురికి తొక్కుకుంటూ వచ్చేవారు సైతం కాళ్లను ఆగి తుడుచుకోవడానికి సహాయపడిన వారవుతారు.

- వాల్‌ పెయింట్‌ కలర్స్‌ను కాంప్లిమెంట్‌ చేయాలనుకుంటే హెవీ ఫ్యాబ్రిక్స్‌కు బదులుగా లైట్‌ కాటన్‌ డ్రేప్స్‌ బాగుంటాయి. లైట్‌ కాటన్‌ కర్టెన్స్‌ అయితే ఇంటిలోకి మరింత సూర్యరశ్శి రావడానికి తోడ్పడటంతో పాటుగా గాలి రావడానికి కూడా తోడ్పడుతుంది.

- వర్షాకాలంలో మరకలు పడటం సహజం. ఇటీవలి కాలంలో వస్తున్న రంగులు ఈ మరకలు సైతం తుడుచుకుంటే సులువుగా పోయేలా చేస్తున్నాయి కాబట్టి వాటి వైపూ చూడవచ్చు.

- వర్షాకాలంలో షార్ట్‌సర్క్యూట్స్‌ కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎలక్ర్టికల్‌ స్విచ్‌లు మరీ ముఖ్యంగా కిటికీలకు, విండోలకు దగ్గరగా ఉన్నవి పొడిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.

- చాలామంది తమ గదులలో మంచాలను గోడలకు తాకేలా అమర్చుకుంటారు. దీనివల్ల చెక్క త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. అలాగే వర్షాకాలంలో చెదలు కూడా విజృంభించే అవకాశాలున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.



Updated Date - 2021-06-13T13:40:22+05:30 IST