పదవి చేపట్టిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేసిన స్వీడన్ మహిళా ప్రధాని

ABN , First Publish Date - 2021-11-25T19:38:11+05:30 IST

స్వీడన్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా రికార్డు సృష్టించిన

పదవి చేపట్టిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేసిన స్వీడన్ మహిళా ప్రధాని

డెన్మార్క్ : స్వీడన్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా రికార్డు సృష్టించిన మగ్దలీనా ఆండర్సన్ ఆ పదవిని చేపట్టిన కాసేపటికే రాజీనామా చేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన  బడ్జెట్‌కు ఆమోదం లభించకపోవడంతోపాటు, ఆమె నేతృత్వం వహిస్తున్న కూటమి నుంచి గ్రీన్స్ పార్టీ వైదొలగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఆమె రెండు పార్టీలతో కలిసి మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 


ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంటులో తిరస్కరణకు గురి కాగా, ప్రతిపక్షం ప్రతిపాదించిన బడ్జెట్‌కు అనుకూలంగా 154 ఓట్లు, ప్రతికూలంగా 143 ఓట్లు లభించాయి. దీంతో ఆండర్సన్ నేతృత్వంలోని సోషల్ డెమొక్రాటిక్ పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి వైదొలగడమే మంచిదని నిర్ణయించుకుంది. దీంతో ఆమె ప్రధాన మంత్రి పదవికి బుధవారం రాజీనామా సమర్పించారు. ఆ పదవిలో ఆమె సుమారు 7 గంటలపాటు మాత్రమే ఉన్నారు. 


ఆండర్సన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇది గౌరవానికి సంబంధించిన విషయమని చెప్పారు. ప్రభుత్వ చట్టబద్ధతను, నియమబద్ధతను ప్రశ్నించే పరిస్థితిలో ప్రభుత్వాన్ని నడపటం తనకు ఇష్టం లేదన్నారు. ప్రభుత్వం నుంచి వైదొలగాలని సంకీర్ణ ప్రభుత్వంలోని ఓ పార్టీ నిర్ణయించుకుంటే, ఆ సంకీర్ణ ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాలన్నారు. 


ఇదిలావుండగా, తాను సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపేందుకు సిద్ధమేనని పార్లమెంటరీ స్పీకర్ ఆండ్రియాస్ నోర్లెన్‌కు ఆండర్సన్ తెలిపారు. దీంతో నోర్లెన్ స్పందిస్తూ, తాను ఎనిమిది పార్టీల నేతలతో సంప్రదిస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన ఓ విధానాన్ని ఆయన గురువారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన గ్రీన్ పార్టీ మరోసారి  ప్రధాన మంత్రి పదవి కోసం జరిగే ఎన్నికలో ఆండర్సన్‌కు మద్దతిస్తామని ప్రకటించింది. 


Updated Date - 2021-11-25T19:38:11+05:30 IST