Abn logo
Apr 8 2020 @ 04:47AM

కళ తప్పిన హోటల్‌..

ఆతిథ్య రంగం వెలవెల

అంతంతమాత్రంగా ఉన్న పరిశ్రమ

కరోనా దెబ్బతో పూర్తిగా కుదేలు

రోడ్డునపడ్డ 80 వేల మంది ఉద్యోగులు

లాక్‌డౌన్‌తో ఇళ్లకు పంపేసిన యజమానులు

బ్యాంకు లోన్లు కూడా కట్టలేమంటున్న నిర్వాహకులు

పునఃప్రారంభించినా కొన్నాళ్లు వ్యాపారం ఉండదంటున్న యజమానులు

గాడిలో పడాలంటే మరో రెండేళ్లు పట్టవచ్చునని వెల్లడి


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): కరోనా దెబ్బకు హోటల్‌ పరిశ్రమ పూర్తిగా కుదేలైపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా హోటళ్లు, లాడ్జిలు, గెస్ట్‌హౌస్‌లు పూర్తిగా మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తరువాత కూడా పెద్దగా వ్యాపారం వుండకపోవచ్చునని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గుతుందని, పూర్తిగా పరిశ్రమ కోలుకోవాలంటే ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుందని అభిప్రాయపడుతున్నారు.


నగరంలో హోటళ్లు, లాడ్జిలు, గెస్ట్‌హౌస్‌లు, సర్వీసు అపార్టుమెంట్లు వంటివి చిన్నా,పెద్దా కలిపి వెయ్యి వరకూ ఉన్నాయి. వీటిలో పది వేల గదులు అందుబాటులో ఉన్నాయి. విశాఖకు సాధారణంగా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొన్నేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు, సమావేశాలు జరుగుతుండడంతో రూమ్‌లకు డిమాండ్‌ ఎక్కువగానే ఉంటోంది. రూమ్‌ ఆక్యుపేషన్‌ సగటు 60 నుంచి 80 శాతం వరకూ ఉండేది.  ఈ నేపథ్యంలో హోటల్‌ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. నగరంలోని హోటళ్లలో సుమారు 80 వేల మంది పనిచేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత కొంతవరకూ హోటల్‌ రంగం డీలా పడినా తర్వాత పుంజుకోగలిగింది. అంతా సజావుగా సాగిపోతోందనుకున్న సమయంలో కరోనా రూపంలో ముప్పు వచ్చిపడింది. కరోనా దెబ్బకు ఎక్కడివారు అక్కడే నిలిచిపోవడంతో హోటళ్లు అతిథులు లేక బోసిపోయాయి. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పూర్తిగా మూసేయాల్సి వచ్చింది.


వ్యాపారాలు లేనప్పుడు ఎందుకనే భావనతో ఉద్యోగులు, సిబ్బందికి యజమానులు జీతాలు సెటిల్‌ చేసి ఇళ్లకు పంపించేశారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత పరిస్థితిని బట్టి పిలుస్తామంటూ పరోక్షంగా ఉద్యోగాలు తీసేసినట్టు సంకేతాలిచ్చేశారు. లాక్‌డౌన్‌ ఎత్తేసినా ఇప్పటికిప్పుడు హోటళ్లకు జనం వస్తారని నిర్వాహకుల్లో నమ్మకం కనిపించడం లేదు. కరోనా వైరస్‌ భయంతో పాటు, లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నందున ఇప్పట్లో ఎవరూ ఇళ్లు కదిలే అవకాశం వుండకపోవచ్చునని పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌కు ముందు వివిధ వ్యాపారాలకు సంబంధించి ఆయా సంస్థల ప్రతినిధులు తరచూ నగరానికి వచ్చి సమావేశాలు ఏర్పాటుచేస్తుండేవారు. దీనివల్ల హోటళ్లు సందడిగా ఉండేవి. ఇకపై అలాంటివి కూడా వుండే అవకాశం లేదు కాబట్టి వ్యాపారాలు దెబ్బతింటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.


లాక్‌డౌన్‌ ఎత్తేసినా ధీమా కరువే..

లాక్‌డౌన్‌ కారణంగా హోటళ్లను మూసేశామని, లాక్‌డౌన్‌ తర్వాత తిరిగి హోటళ్లను తెరిచినా వ్యాపారం జరుగుతుందనే గ్యారంటీ లేదని కొంతమంది నిర్వాహకులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు ఉపాధి లేకపోవడం, ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు లేకపోవడం, ఉద్యోగంపై భరోసా లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం జీతాలు చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడం వంటివి ప్రజల్లో కొనుగోలు శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వీకెండ్స్‌ పేరుతో బయటకు వెళ్లడం, ఎంజాయ్‌ చేయడం వంటి వాటికి స్వస్తి చెప్పేస్తారని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఉన్నంతలో పొదుపు మంత్రం జపిస్తారని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. చేతిలో డబ్బున్నవారు కూడా ఖర్చుపెట్టేందుకు వెనుకాడతారని, హోటళ్లకు పూర్వవైభవం రావడానికి మరో రెండేళ్లయినా పడుతుందని పేర్కొంటున్నారు. 


సిబ్బంది కోత...జీతాలు కుదింపు

లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత హోటళ్లను తిరిగి తెరిచినా వ్యాపారులు నిర్వహణ ఖర్చులను భారీగా తగ్గించుకోవాలనే యోచనలో ఉన్నారు. ఇప్పుడున్న సిబ్బందిలో దాదాపు 75 శాతం మందిని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం వుందని ఒక ప్రముఖ హోటల్‌ యజమాని చెప్పారు. కొత్తగా తీసుకునే వారికి కూడా ఇప్పుడు ఇస్తున్నంత కాకుండా వీలైనంత తక్కువ వేతనం ఇస్తామని పేర్కొన్నారు. మరో రెండేళ్లపాటు నష్టాలతోనే నడపాల్సి వుంటుంది కాబట్టి, నిర్వహణ ఖర్చులు వీలైనంత తగ్గించుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హోటల్‌ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు ఉపాధి లేక రోడ్డునపడే పరిస్థితి కనిపిస్తోంది. 


హోటల్‌ రంగం పదేళ్లు వెనక్కి వెళ్లిపోతుంది: తాళ్లూరి సత్యనారాయణ,

రాష్ట్ర హోటల్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు

కరోనా నేపథ్యంలో హోటల్‌ రంగం పదేళ్లు వెనక్కి వెళ్లిపోయింది. నోట్ల రద్దు తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటైతే వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవాలనే యోచనలో హోటల్‌ వ్యాపారులు ఉన్నారు. అలాంటి తరుణంలో కరోనా దెబ్బకు వ్యాపారులంతా కుదేలైపోయారు. బ్యాంకుల నంచి తీసుకున్న అప్పులకు వాయిదాలు కట్టే పరిస్థితి కూడా ఉండదు. లాక్‌డౌన్‌ తర్వాత హోటళ్లను తెరిచినా అతిథులు రాక పెద్దగా ఉండకపోవచ్చు. జనం కొన్నాళ్లపాటు భయపడి ఇంట్లోనే ఉండిపోతారు. కనీసం రెండేళ్లపాటు ఇదే పరిస్థితి వుంటుంది కాబట్టి ఇప్పుడున్న సిబ్బందిని తగ్గించుకోవడం ఒక్కటే మార్గం. 


మళ్లీ కొత్తగా వ్యాపారం ప్రారంభించుకోవాల్సిందే:సీఎస్‌ఎన్‌ రాజు, అధ్యక్షుడు, నగర హోటల్‌ మర్చంట్స్‌ అసోషియేషన్‌

కరోనా దెబ్బకు మూతపడిన హోటళ్లన్నీ తిరిగి కొత్తగా వ్యాపారం ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి. హఠాత్తుగా హోటళ్లను మూసేయడం వల్ల ఒక్కొక్కరు భారీగా నష్టపోయారు. దీనికి లాక్‌డౌన్‌ సమయంలో వాటిల్లే నష్టం అదనం. లాక్‌డౌన్‌ తర్వాత హోటళ్లకు తాకిడి వుండే అవకాశం లేదు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు ఎంజాయ్‌మెంట్‌ వైపు చూసే అవకాశం ఉండదు. తిరిగి ఎప్పుడు గాడిలో పడుతుందనేది చెప్పడం కూడా కష్టం. 


Advertisement
Advertisement
Advertisement