హాట్‌ స్పాట్ల దిగ్బంధం

ABN , First Publish Date - 2020-04-09T07:39:07+05:30 IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో హాట్‌ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలను ఈనెల 30 వరకు పూర్తిగా దిగ్బంధించాలని...

హాట్‌ స్పాట్ల దిగ్బంధం

  • యూపీలోని 15 జిల్లాల్లో 30 వరకు కఠిన ఆంక్షలు
  • దేశంలో 24 గంటల్లో 773 కేసులు
  • 149కి పెరిగిన మరణాల సంఖ్య
  • మధ్యప్రదేశ్‌లో తబ్లీగీ వెళ్లొచ్చిన వ్యక్తి 
  • కుటుంబంలో 8 మందికి సోకిన కరోనా
  • బాధితుల్లో ముగ్గురు మైనర్లు, తల్లి మృతి
  • ముంబైలో సగం కేసులు 4 వార్డుల్లోనే


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.  రాష్ట్రంలోని 15 జిల్లాల్లో హాట్‌ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలను  ఈనెల 30 వరకు పూర్తిగా దిగ్బంధించాలని ఆ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. హోం డెలివరీని మాత్రమే అనుమతిస్తారు. ఆగ్రా, లఖ్‌నవు, గౌతమ్‌ బుద్ధ నగర్‌, కాన్పూర్‌, వారాణసీ, షామిల్‌, మీరట్‌, బరేలీ, బులంద్‌షహర్‌ తదితర జిల్లాల్లో కొవిడ్‌-19 బాధితులు ఎక్కువగా ఉన్నారు.  దేశంలో మంగళవారం నుంచి 32 మంది కరోనా వ్యాధిగ్రస్తులు మరణించారని, 773 మందికి వైరస్‌ సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 24 గంటల వ్యవధిలో కేసుల పెరుగుదలలో ఇదే అత్యధికం. మొత్తం మరణాల సంఖ్య 149కి, కేసులు 5,194కు పెరిగాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అత్యధిక మరణాలు నమోదైన మహారాష్ట్రలో చర్యలను ముమ్మరం చేశామని చెప్పారు. పుణెలో 35 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి మనిషి మనిషిని సర్వే చేస్తున్నాయని తెలిపారు. ‘‘మనం ఒక పెద్ద చాలెంజ్‌ను ఎదుర్కొంటున్నాం. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులే కాకుండా కొద్ది సంఖ్యలోనే అయినా లక్షణాలు లేని వ్యక్తుల నుంచి కూడా వైరస్‌ ఇతరులకు సంక్రమిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది’’ అని చెప్పారు. యూపీలో ఇప్పటివరకు 343 కరోనా కేసులు నమోదయ్యాయి.


మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ జిల్లాకు చెందిన ఒక కుటుంబంలో ఎనిమిది మందికి కరోనా వైరస్‌ సోకింది. ఆ కుటుంబంలో వ్యాపారం చేసే 49 ఏళ్ల వ్యక్తి దక్షిణాఫ్రికా వెళ్లాడు. తిరిగొస్తూ ఢిల్లీలోని నిజాముద్దీన్‌ తబ్లీగీ జమాత్‌కు హాజరయ్యాడు. గత నెల 19న ఇంటికి వచ్చాడు. అతనికి కరోనా సోకిందని గత వారం గుర్తించారు. అతని తల్లి ఈ నెల 4న చనిపోగా, కరోనాయే కారణమంటూ మెడికల్‌ రిపోర్టులు బుధవారం అందాయని వైద్య ఆరోగ్య విభాగం ముఖ్య అధికారి తెలిపారు. ఆ వ్యక్తి తండ్రి, ముగ్గురు మైనర్లు కూడా వైరస్‌ బారినపడిన వారిలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో తాజాగా మరో ఆరుగురికి కరోనా సోకింది. వీరిలో  న్యూస్‌ చానల్‌ విలేకరి ఒకరు ఉన్నారు. పోలీసు అధికారి నుంచి ఆ విలేకరికి వైరస్‌ పాకిందని గుర్తించారు. భోపాల్‌లో మొత్తం కేసులు 91కి పెరిగాయి. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో డీయూఎ్‌సఐబీ ఫ్లాట్లలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రం నుంచి ఎవరో మూత్రం నింపిన సీసాలను విసిరారు. పంప్‌ హౌస్‌ వద్ద బహిరంగ ప్రదేశంలో రెండు సీసాలు పడి ఉండడాన్ని ఉద్యోగులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదయింది. ముంబైలో ఇప్పటి వరకు గుర్తించిన 590 మంది కొవిడ్‌-19 రోగుల్లో సగం మంది నాలుగు అడ్మినిస్ట్రేటివ్‌ వార్డులకు చెందిన వారే. కార్పొరేషన్‌ పరిధిలో ఇటువంటి వార్డులు 24 ఉన్నాయి. 282 కరోనా కేసులను డీ, ఈ, సీ-సౌత్‌, కే-వెస్ట్‌ వార్డుల్లో గుర్తించామని బృహన్‌ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) తెలిపింది. ముంబై ప్రస్తుతం మహారాష్ట్రకే కాక దేశానికే కొవిడ్‌-19 హాట్‌ స్పాట్‌గా మారింది. పుణెలో మరో ఆరుగురు కరోనా రోగులు మరణించారు.  


ఢిల్లీ ఎయిమ్స్‌లో 30 మంది వైద్యులు, నర్సులు క్వారంటైన్‌కు... 

ఢిల్లీ ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో సెంటర్‌లో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కలిపి 30 మందిని క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. రెండు రోజుల కిందట బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలతో 72 ఏళ్ల వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయనకు సీటీ, ఎంఆర్‌ఐ వంటి పరీక్షలు నిర్వహించి, న్యూరాలజీ వార్డులో ఇతర రోగులతో పాటు ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఉన్నట్టుండి ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఛాతీ ఎక్స్‌-రే తీసి, వెంటిలేటర్‌ అమర్చారు. ఆయన నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపగా ఆయనకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు, నర్సులు, పరీక్షలు నిర్వహించిన టెక్నీషియన్లు క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.


Updated Date - 2020-04-09T07:39:07+05:30 IST