వేడి వేడి సభలు

ABN , First Publish Date - 2021-01-29T10:13:53+05:30 IST

రిపబ్లిక్ డే రోజున జరిగిన సంఘటనల దరిమిలా రైతు ఉద్యమకారులు తలపెట్టిన పార్లమెంటు ముట్టడి ఆగిపోయింది కానీ, ఉద్యమం వేడి చల్లారలేదు...

వేడి వేడి సభలు

రిపబ్లిక్ డే రోజున జరిగిన సంఘటనల దరిమిలా రైతు ఉద్యమకారులు తలపెట్టిన పార్లమెంటు ముట్టడి ఆగిపోయింది కానీ, ఉద్యమం వేడి చల్లారలేదు. శుక్రవారం నాడు రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించడంతో మొదలుకుని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొత్తం ఏదో రకంగా ప్రభుత్వం తీవ్రవిమర్శలను ఎదుర్కొనక తప్పదు. కొవిడ్ కారణంగా కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థకు చికిత్సచేయడానికి, బాధితవర్గాలకు ఊరట కలిగించడానికి ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఏమి చేయబోతున్నదోనన్న కుతూహలం తీవ్రతను గమనిస్తే, ప్రజల అంచనాలను ప్రభుత్వం అందుకోవడం సాధ్యం కాదనే అనిపిస్తుంది. ఇప్పటికే, కేంద్రసాయం విషయంలో అసంతృప్తితో ఉన్న అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా ప్రతిపక్ష రాష్ట్రాలు గుర్రుగా ఉన్నాయి. తమిళనాడు, బెంగాల్, అస్సాం వంటి కీలకరాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలు కూడా రాజకీయవాతావరణాన్ని ఉద్రిక్తంగా మలిచే అవకాశం ఉన్నది.


అసంతృప్తులను అణచివేయడానికి ఏమి చేయాలో కౌటిల్యుని అర్థశాస్త్రం అనేక ఉపాయాలు చెప్పింది. అపరచాణక్యుడిగా పిలిచే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో రైతుల ఆందోళనను బలహీనపరచడానికి చేస్తూ వచ్చిన అనేక ప్రయత్నాలు ఏమంత ఫలితాన్ని ఇవ్వలేదు కానీ, రిపబ్లిక్ డే పరిణామాలు మాత్రం ఉద్యమకారులను కొంతవరకు ఆత్మరక్షణలో పడవేశాయి. ఫలితంగా ఉద్యమ నాయకత్వంలో కొంత దృఢత్వం సడలినప్పటికీ, తేరుకుని తమను తాము స్థిరపరచుకోవడానికి రైతులు ప్రయత్నిస్తున్నారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన సంఘటనలకు కారకులెవరైనప్పటికీ, వాటికి కారకులు రైతు ఉద్యమకారులేనని విమర్శలు వచ్చినందున, ఆ వాతావరణంలో అణచివేతకు ఆమోదనీయత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఉద్యమనాయకుల మీద కేసులు మోపడం సరే, పెద్దగా అలజడి లేని ఢిల్లీ- యుపి సరిహద్దుల్లో రైతులను తొలగించడానికి కఠిన మార్గాలను అనుసరిస్తున్నది. గురువారం రాత్రిలోగా ఘాజీపూర్ నుంచి రైతులు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటమ్ ఇచ్చింది. కేంద్రం వెనుకాడుతున్న అంశాలలో కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్సాహపడడం భవిష్యత్ పరిణామాలకు సూచిక కావచ్చు. అదే సమయంలో, ఆందోళన అంతా ఒకటి రెండు రాష్ట్రాల రైతులకు పరిమితం అని ప్రచారం జరిగినప్పటికీ, ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా వివిధ రాష్ట్రాలలో రైతు ఉద్యమానికి గట్టి సంఘీభావం వ్యక్తం కావడం గమనించవచ్చు. ఇప్పుడు జాతీయ ప్రతిపక్షాలు రైతులకు మద్దతుగా నిలబడడం వారి బలాన్ని మరింత పెంచుతుంది. నిలకడగా, సంయమనంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెడుతున్న రైతులను అభినందించాలి. అపశ్రుతులు ఎదురయినప్పుడు కూడా నిగ్రహంతో దిద్దుబాటు చేసుకోవడం వారి వివేకాన్ని సూచిస్తుంది. 


రైతులకు మద్దతుగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించదలచిన పక్షాలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలేవీ లేకపోవడం గమనించవచ్చు. తెలంగాణలో అధికార టిఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఎటువంటి విమర్శనాత్మక వైఖరినీ ప్రకటించదలచుకోలేదని అర్థమవుతున్నది. రకరకాల కారణాల వల్ల కేంద్రం అంటే భయం, ఒక ఖచ్చితమైన వైఖరి తీసుకోవడానికి సంకోచం ఈ పక్షాల చొరవను హరిస్తున్నాయి. లేకపోతే, రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలకు అంతంత మెజారిటీ ఉండి కూడా కేంద్రం ముందు నంగిగా మెలగవలసి రావడం తెలుగువారి దురదృష్టం. ఈ బలహీనత కారణంగా, రాష్ట్రానికి హక్కుగా రావలసిన కేటాయింపులను కూడా గట్టిగా అడగలేని పరిస్థితి ఏర్పడుతున్నది. మరోవైపున, జాతీయ అధికారపార్టీ నేతలు వివిధ సంక్షేమపథకాలకు అయ్యే వ్యయం కేంద్రనిధుల నుంచే జరుగుతోందన్న వాదనను రెండు రాష్ట్రాలలోనూ బలంగా చేస్తూ ఉన్నారు. నిజానికి నిధులను కేంద్రం-రాష్ట్రాలు అన్న ప్రాతిపదికన చూడకూడదు. నిధులన్నీ పన్నుల నుంచి సుంకాల నుంచి సమకూరేవే. కేంద్రం చేసే వ్యయం రాష్ట్రాలలో జరగవలసిన వ్యయమే తప్ప, కేంద్రానికి వేరే భూభాగమేమీ ఉండదు. కానీ, ఆపత్కాలంలో కూడా అవసరమైన కేటాయింపులను ఇవ్వడమో, కనీసం రుణం తెచ్చుకునే వెసులుబాటు కల్పించడమో చేయకుండా రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. పైగా, అప్పు తెచ్చుకోవడానికి ఆలస్యంగా అనుమతించినప్పుడు కూడా, ప్రపంచబ్యాంకు మాదిరిగా అనేక షరతులు విధించడం ఫెడరలిజానికి విరుద్ధమైన నడవడిక అవుతుంది. 


దేశంలోని సందడిని, జీవాన్ని కట్టడిచేసిన కరోనా కాలాన్ని కూడా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు చేయడానికి, విదేశాలతో ఒప్పందాలు చేసుకోవడానికి, ఇంకా అనేక వివాదాస్పద నిర్ణయాలు చేయడానికి కేంద్రం ఉపయోగించుకున్నది. ఇప్పుడు మరిన్ని అమ్మకాలు కూడా జరగనున్నాయి. నవభారతపు ఆత్మనిర్భరతకు ప్రతీకగా నిలిచిన జీవిత భీమా సంస్థను కూడా పరాధీనం చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. వీటి గురించి ఎవరైనా సభల్లో మాట్లాడతారో లేదో తెలియదు. ఇక, వైరస్ నుంచి విముక్తిని ప్రసాదించగల టీకా మందు పంపిణీపై కూడా ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే మంచిది. ఏ మందు ఉపయోగించాలి దగ్గర నుంచి, ఎవరెవరికి ముందు అన్న ఎంపిక వరకూ అనేక చర్చనీయాంశాలున్నాయి. మరో వైపు, టీకా మందుపై ప్రజలలో అనేక సంశయాలున్నాయి. భారతదేశంతో రాకపోకలున్న అనేక దేశాలలో కొత్త పోకడలతో కరోనా విజృంభిస్తోంది. కట్టడి విషయంలో పూర్తి ఉదాసీనత మన దేశంలో కనిపిస్తోంది. వ్యాప్తి నిరోధం, టీకా పంపిణీ వంటి బృహత్కార్యక్రమంపై అన్ని పక్షాల ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ ఉండాలి.

Updated Date - 2021-01-29T10:13:53+05:30 IST