ఆసుపత్రుల్లోనూ తగ్గిద్దాం!

ABN , First Publish Date - 2022-07-26T05:10:22+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రులలో నిబంధనలకు మించి వైద్యులు, సిబ్బంది ఉన్నారని ప్రభుత్వం భావిస్తోంది.

ఆసుపత్రుల్లోనూ తగ్గిద్దాం!

సిబ్బంది కుదింపుపై ప్రభుత్వ ప్రయత్నం

ఇప్పటికే ప్రత్యేక జీవోల జారీ

అదనం పేరుతో భారీగా బదిలీలు

మిగులు సిబ్బంది ఇతర శాఖల్లో సర్దుబాటు

భారీగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగవర్గాలు


ప్రభుత్వ ఆసుపత్రులలో రేషలైజేషన్‌కు (హేతుబద్ధీకరణ) రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 143వ జీవోను జారీ చేసింది. అలాగే వైద్య విధాన పరిషత్‌కు చెందిన ఆసుపత్రులలో రేషలైజేషన్‌కు 165, 166, 167, 169 జీవోలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఆయా ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బందిని భారీగా బదిలీ చేయాల్సి ఉంటుంది. అదనపు సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వైద్యసిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


నెల్లూరు (వైద్యం) జూలై 25 : ప్రభుత్వ ఆసుపత్రులలో నిబంధనలకు మించి వైద్యులు, సిబ్బంది ఉన్నారని ప్రభుత్వం భావిస్తోంది.  ఈ మేరకు బదిలీలపై విడుదలైన జీవోల ప్రకారం వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఏరియా ఆసుపత్రులలో కొందరు వైద్యులు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు బదిలీ కావాల్సి ఉంటుంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖలోనూ భారీగా స్థానచలనాలు ఉంటాయి. జిల్లాలో 52 ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఒక్కో కేంద్రంలో 25 నుంచి 30 మంది వరకు సిబ్బంది పని చేస్తున్నారు. జీవో నెం.143 ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇద్దరు వైద్యులతో కలిపి 12 మంది మాత్రమే ఉండాలి. అయితే తాజాగా ప్రభుత్వ నిర్ణయం వల్ల 14 మంది ఉంటారు. ఈ లెక్కన సగానికి సగం మంది బదిలీ కావాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 29 పట్టణ ఆరోగ్య కేంద్రాలలో  మిగులు సిబ్బందిని నియమించినా ఇంకా ఉద్యోగులు మిగులుతారు. వీరిని ఇతర శాఖలను మళ్లించే అవకాశం ఉంది. ఆగస్టు 15వ తేదీలోగా వైద్య శాఖలో పలు మార్పులు తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరుణంలో వైద్య శాఖలో ఈ హేతుబద్ధీకరణ ఎంతవరకు ఉంటుందోనన్న సందేహాలు కూడా వ్యక్త మవుతున్నాయి. 


24 గంటలు అందుబాటులో పీహెచ్‌సీలు?

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటలు రోగులకు అందుబాటులో ఉండాలి. ఆగస్టు 16వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అందుబాటులో రానుంది. ఇందులో భాగంగా ఆయా కేంద్రాలలో అనేక మార్పులు చేశారు. ప్రత్యేకించి వైద్యుల పని వేళల్లో మార్పులు తీసుకువస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక వైద్యుడు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు మరో వైద్యుడు అందుబాటులో ఉండాలి. రాత్రిపూట వైద్యులు ఫోన్‌కు అందుబాటులో ఉండాలి. ఇక నర్సులు 24 గంటలు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. 30 పడకలు ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాలలో కూడా ఇక నుంచి వైద్యులు అందుబాటులో ఉండాలి. జిల్లాలో 10 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా రాపూరు, అల్లూరు లలో 50 పడకలు ఉండగా ఉదయగిరి సీహెచ్‌సీని కూడా 50 పడకలు చేసే దిశంగా కసరత్తు జరుగుతోంది. 


వైద్యసిబ్బందిలో వ్యతిరేకత

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై వైద్య ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే కందుకూరు ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో 600 మందికిపైగా ఉన్న వైద్య ఉద్యోగులలో కేవలం 100 మందితోనే  సర్దుబాటు ఉంటుంది. మిగిలిన వారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారనుంది. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య కార్యకర్తలు ఎన్నో రకాల వైద్య సేవలను అందిస్తున్నారు. జాతీయ ఆరోగ్య కార్యాక్రమాలను ప్రజలకు అందించడంలో వీరే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో కొందరు బదిలీ కావాల్సి ఉంటుంది. ఈ బదిలీలలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బంది ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాల్సి ఉందని ఇందుకు విరుద్దంగా ఎలా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. ఓజిలి మండలంలో కేవలం 30వేల జనాభా ఉంటే ఇక్కడ 3 పీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. రాపూరు మండలంలో 80వేల జనాభా ఉంటే ఇక్కడ కేవలం ఒక్క పీహెచ్‌సీ మాత్రమే ఉంది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో 70వేల జనాభా ఉంటే ఇక్కడ జొన్నవాడలో మాత్రమే పీహెచ్‌సీ ఉంది. ఇలా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు సక్రమంగా వైద్యం అందించటం లేదని ఇవి సరిదిద్దకుండా పీహెచ్‌సీలలో సగం మంది సిబ్బందిని బదిలీ చేయడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. 



పెద్ద సంఖ్యలో ఉద్యోగుల బదిలీలా!?

రేషలైజేషన్‌ పేరుతో భారీ సంఖ్యలో ఉద్యోగులను బదిలీ చేయడం సరికాదు. ముందుగా పీహెచ్‌సీలను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. అలాకాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయం. పీహెచ్‌సీలలో సిబ్బంది తగ్గితే వైద్యసేవలు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాణాంతక వ్యాధుల కాలం. దోమలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది అవసరం ఉంది. ఇది ఆలోచించకుండా సిబ్బందిని కుదిండటం అన్యాయం.

- ఆంజనేయవర్మ, ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు


ఇది సమర్ధనీయమే

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 143 జీవో ద్వారా సంస్కరణలు తీసుకురావడం సమర్ధనీయమే. ఇప్పటికే ఎక్కువ మంది ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగణంగా చర్యలు ఉంటాయి. పీహెచ్‌సీలలో ఉన్న అదనపు సిబ్బందిని బదిలీ చేయడం జరుగుతుంది. త్వరలో ఈ సంస్కరణలు ఉంటాయి. అదనపు ఉద్యోగులను పట్టణ ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేస్తారు. అక్కడ వారి సేవలను వినియోగించుకుంటాం. 

- డాక్టర్‌ పెంచలయ్య, డీఎంహెచ్‌వో


Updated Date - 2022-07-26T05:10:22+05:30 IST