ఆసుపత్రులా? రియల్ ఎస్టేట్ పరిశ్రమలా? మూసేస్తే మంచిది... నిప్పులు చెరిగిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-07-19T23:13:58+05:30 IST

ఆసుపత్రులు సేవా దృక్పథంతో కాకుండా రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లా మారుతుండటంపై..

ఆసుపత్రులా? రియల్ ఎస్టేట్ పరిశ్రమలా? మూసేస్తే మంచిది... నిప్పులు చెరిగిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆసుపత్రులు సేవా దృక్పథంతో కాకుండా రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లా మారుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాంటి ఆసుపత్రులు మూసేయడం మంచిదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక ఆసుపత్రులు అగ్నిప్రమాదాల నుంచి రక్షణకు (ఫైర్ సేఫ్టీ) ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం తప్పుపట్టిది. ఒక సుమోటో కేసుపై విచారణ సందర్భగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.


''ఆసుపత్రులను రియల్ ఎస్టేట్ పరిశ్రమలుగా మనం చూస్తున్నామా? మానవసేవా దృక్పథంతో చూస్తున్నామా?'' అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఆసుపత్రులు మానవ విపత్తులను అడ్డుపెట్టుకుని భారీ పరిశ్రమలుగా మారుతున్నాయని, ప్రజల ప్రాణాలను అడ్డుకుని సంపద పోగుచేసుకుందామంటే అందుకు తాము అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అలాంటి ఆసుపత్రులు మూసేసి, హెల్త్ కేర్ సదుపాయాలను మెరుగుపరచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తే మంచిదని ధర్మాసనం పేర్కొంది. నాలుగైదు గదుల్లో ఆసుపత్రులు నడపాల్సిన పని లేదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. అనేక ఆసుపత్రులు 'ఫైర్ సేఫ్టీ' విధానాలను పాటించడం లేదని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా ఓ ఆసుపత్రిలో కోవిడ్ నుంచి కోలుకుని మరుసటి రోజే డిశ్చార్జి కావాల్సిన ఒక పేషెంట్ అదే ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో సజీవదహనమయ్యాడని, మరో ఇద్దరు నర్సులు కూడా ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ''ఇలాంటి విషాధ ఘటనలు మన కళ్ల ముందే జరుగుతున్నాయి. ఈ ఆసుపత్రులు ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా? మానవాళికి సేవలందించేందుకా?'' అని ఆయన సూటిగా ప్రశ్నించారు.


గుజరాత్ సర్కార్‌కు అక్షింతలు...

ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలపై తమ ఆదేశాలను పాటించకపోవడంపై గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం మందలించింది. బిల్డింగ్ బై-లా ఉల్లంఘనలను సరిచేసుకుంటూ నిబంధనలు పాటించేందుకు జూన్ 2020 వరకూ గడువును పొడిగించింది. ఆసుపత్రుల్లో భద్రతపై కమిషన్ సమర్పించి సీల్డ్ కవర్ రిపోర్టుపైనా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ''సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇదేమీ న్యూక్లియర్ సీక్రెట్ కాదు'' అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఆసుపత్రులకు సంబంధించిన  సమగ్ర ఆడిట్ నివేదికను కోర్టుకు సమర్పించాలని గుజరాత్ సర్కార్‌ను ఆదేశించింది. మరో రెండు వారాల తరువాత తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది.

Updated Date - 2021-07-19T23:13:58+05:30 IST