Advertisement
Advertisement
Abn logo
Advertisement

Delta Variant: అమెరికాలో పిల్లలపై పంజా.. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీని దెబ్బకు మూడు వారాల క్రితంతో పోల్చుకుంటే యూఎస్‌లో ప్రస్తుతం సగటున 240శాతం కరోనా కేసులు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పిల్లలపై డెల్టా తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి దాపురించింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సమాచారం మేరకు గడిచిన వారం రోజుల్లో కరోనా బారిన పడ్డవారిలో 94వేల మంది వరకు పిల్లలు ఉన్నారని తెలిసింది. ఇది వీక్లీ కేసుల్లో 15 శాతానికి సమానం అని పేర్కొంది. 


ఇక కరోనా సోకిన పిల్లలకు అసలు వారికి ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదని, శ్వాస అందక వారు ఇబ్బంది పడడం చూస్తుంటే చాలా బాధగా ఉంటుందని ప్రముఖ పిల్లల వైద్యురాలు డా. కేలేచి ఇహీగ్వారా పేర్కొన్నారు. మార్చి, జూలై మధ్య దేశవ్యాప్తంగా కరోనాతో సుమారు 81 మంది పిల్లలు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయిదాటకముందే తగిన చర్యలు తీసుకోవాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) హెచ్చరించింది. అలాగే పాఠశాలలు తెరచుకున్న తర్వాత కూడా పిల్లల్లో వైరస్ వ్యాప్తి పెరిగినట్లు ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. అర్కాన్సస్, మిస్సౌరి, హ్యూస్టన్, లూసియానాలో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. 


ఈ నేపథ్యంలో 12 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వీలైనంత త్వరగా అనుమతిస్తే బాగుటుందని అధ్యక్షుడు జో బైడెన్ కోరుతున్నారు. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ 12 ఏళ్లలోపు పిల్లల టీకాలకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశాయి. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. దీంతో సెప్టెంబర్ నాటికి 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.         


Advertisement
Advertisement