రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి

ABN , First Publish Date - 2020-11-29T05:42:11+05:30 IST

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశం జరిగింది.

రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి

  • ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశంలో కలెక్టర్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 28: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశం జరిగింది. కొవిడ్‌ కారణంగా కలెక్టర్‌ కాకినాడలోని కలెక్టరేట్‌ నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌లో వైద్యాధికారులు, ఎమ్మెల్యేలు, అభివృద్ధి సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రిలోని క్యాంటీన్‌కు కొత్తగా టెండర్లు పిలవాలనినిర్ణయించారు. రెండు అదనపు బోర్‌వెల్స్‌ వేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సీటీ స్కాన్‌ మెషీన్‌ను రూ.59వేలతో బాగు చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రి భవనానికి మరమ్మతులు చేపట్టాలని, కొన్ని ఎలక్ర్టికల్‌ కేబుల్స్‌ మార్చాలని, మరుగుదొడ్లకు మరమ్మతులు, ఆధునికీకరణ చేపట్టాలని, ఆసుపత్రిలో అవసరమైన కంప్యూటర్లు, ఫిజియోథెరపీ పరికరాలు, చెవి, ముక్కు, గొంతు విభాగాల్లో పరికరాలను కొనుగోలు చేయాలని తీర్మానించారు. దంత వైద్యుడిని డిప్యుటేషన్‌పై నియమించాలని, రూ.7.50 లక్షలతో ఆసుపత్రి ప్రహరీకి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపాలని తీర్మానించారు. జూమ్‌ కాన్ఫరెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి నుంచి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.సోమసుందరరావు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఇన్‌చార్జి కె.సరళకుమారి పాల్గొనగా ఆయా ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నగరపాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ టి.రమేష్‌కిషోర్‌, ఏపీఎంఎస్‌డీసీ ఈఈ సీతారామరాజు, ఆకుల మంగాయమ్మ, డాక్టర్‌ ఎస్‌ఎస్‌ రామరాజు, మార్గాని రాము పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-29T05:42:11+05:30 IST