సత్తుపల్లికి 100 పడ‘కల’ సాకారం

ABN , First Publish Date - 2021-06-10T04:54:17+05:30 IST

నాలుగు దశాబ్ధాల చరిత్ర కలిగిన సత్తుపల్లి ప్రధాన ప్రభుత్వాసుపత్రికి నూతన భవనం మంజూరైంది.

సత్తుపల్లికి 100 పడ‘కల’ సాకారం
సత్తుపల్లి ఏరియా వైద్యశాల

 సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

కేసీఆర్‌కు  ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృతజ్ఞతలు

సత్తుపల్లి, జూన్‌ 9: నాలుగు దశాబ్ధాల చరిత్ర కలిగిన సత్తుపల్లి ప్రధాన ప్రభుత్వాసుపత్రికి నూతన భవనం మంజూరైంది. 100పడకలతో ఆసుపత్రి మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిచే ప్రారంభించుకున్న ఈ ఆసుపత్రి ఇప్పడు శిథిలావస్థకు చేరింది. పలుమార్లు వైద్యారోగ్య శాఖమంత్రులు, అధికారులతో పాటు సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే కృషి ఇప్పటికి నెరవేరడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్న ప్రమాదం జరిగినా, ఏ శస్త్ర చికిత్స చేయించుకోవాలన్నా పేదప్రజలకు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రే ఆధారం.. అలాంటి అవసరాలకు తగ్గట్లుగా ఆసుపత్రి కూడా నూతన హంగులతో ఉంటేనే సత్వర సేవలతో పాటు మెరుగైన వైద్యం పేద ప్రజలకు అందించవచ్చునని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు.


మాతా శిశుసంరక్షణ ఆసుపత్రిగా..


ఇప్పుడు సేవలందుతున్న కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిగా మార్చనున్నామని ఎమ్మెల్యే చెప్పారు. వెనుకనున్న సువిశాల ప్రాంతంలో నూతన పరిజ్ఞానం, ఆధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. కరోనా తీవ్రత దృష్ట్యా రోజుకు నియోజకవర్గంలో 3500నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, కరోనా పటిష్ఠ చర్యల కారణంగా 38శాతం ఉన్న వ్యాధి తీవ్రతను 5.5కు తగ్గించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యంతో పాటు భోజనం అందిస్తున్నట్లు చెప్పారు.


సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం


ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కూసంపూడి మహేష్‌ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. స్థానిక రింగ్‌సెంటర్‌ వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో మునిసిపల్‌ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-10T04:54:17+05:30 IST