Abn logo
Apr 16 2021 @ 01:59AM

హోరు ముగిసింది...జోరు పెరిగింది

 ఓటుకు వెయ్యి 

మద్యం షరా మామూలే

వలంటీర్లు, స్వయం సహాయక సంఘాల లీడర్ల ద్వారా పంపిణీ

 అడ్డుకునే వ్యూహంతో సిద్ధమైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు


తిరుపతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సబంధించి ప్రచార పర్వం గురువారం సాయంత్రంతో ముగిసిందో లేదో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. గతానికి భిన్నంగా ఈ పర్యాయం నగదు, మద్యం పంపకాలకు అధికార పార్టీ సరికొత్త పద్ధతిని ఎంచుకుంది.ఏరికోరి ఏర్పాటు చేసుకున్న వలంటీర్ల వ్యవస్థ ద్వారానే ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేపడుతున్నట్టు సమాచారం. ఓటుకు రూ. వెయ్యి పంచుతుండగా మద్యం పంపకాలు షరామామూలుగానే సాగుతున్నాయి.వైసీపీ ప్రభుత్వాధినేతకు సన్నిహిత బంధువుగా వుండి జిల్లాలో కీలకపాత్ర వహిస్తున్న ఓ ముఖ్యనేత ఈ పంపకాలకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పంపకాలకు సంబంధించి తిరుపతిలోనే మకాం వేసి పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది.ఈ మూడు సెగ్మెంట్లలో నగదు, మద్యం పంపకాలను పూర్తిగా వలంటీర్ల ద్వారానే చేపడుతున్నారు.వలంటీర్లు తృప్తికరమైన సేవలందించేందుకు గానూ వారికి కూడా ఒక్కరోజు సేవల కోసం రూ. 5 వేల చొప్పున నగదు ముట్టజెప్పినట్టు సమాచారం. గురువారం రాత్రి 7 గంటల నుంచే వలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయిస్తున్నారు. ఓటుకు వెయ్యి రూపాయల వంతున పంచుతున్నట్టు చెబుతున్నారు.అదనంగా అడిగిన వారికి మద్యం కూడా అందజేస్తున్నారు. రాత్రికల్లా పంపిణీ ముగించాలని, శుక్రవారం మరోమారు వలంటీరు పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్ళి కరపత్రాలు పంచాలని ఆదేశించినట్టు తెలిసింది. దానితో పాటు శనివారం బాధ్యతగా తమ పరిధిలోని ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్ళి ఓటు వేయించే బాధ్యత కూడా వారికే అప్పగించారని చెబుతున్నారు. అధికార పార్టీ వార్డు ఇంఛార్జి తన పరిధిలోని వలంటీర్లపై పర్యవేక్షణ కలిగి వుంటున్నారని సమాచారం. అదనంగా మహిళా స్వయం సహాయక సంఘాల సహకారం కూడా తీసుకుంటున్నారని, అందులో భాగంగా నమ్మకమున్న గ్రూపు లీడర్లు, సంఘమిత్రలకు కూడా వారి సొంతానికి రూ.5 వేలు చొప్పున ముట్టజెప్పినట్టు తెలిసింది. వారి ద్వారా గ్రూపు సభ్యులను ఒప్పించి ఓటు వేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అయితే తిరుపతి, సత్యవేడు కంటే పంపకాలు ముందుగానే మొదలైనట్టు సమాచారం. ఇక్కడ గురువారం పగలే వలంటీర్లకు నగదు అందజేయడంతో పాటు ఓటర్లకు పంచే నగదు మండల కేంద్రాలకు చేరవేసినట్టు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ నిఘా వుంచడానికి యత్నిస్తున్నాయి. వీలైన కాడికి ఫొటోలు, వీడియోలు తీసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి సన్నద్ధమవుతున్నాయి.పోలీసులకు సమాచారమిచ్చి పంపిణీని అడ్డుకునే వ్యూహంతో టీడీపీ వర్గాలు సిద్ధంగా వున్నాయి. ముఖ్యంగా టీడీపీ బలంగా వున్న గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది.


తిరుపతిలో ముగిసిన ప్రచార పర్వం

ప్రచార పర్వం ముగిసింది. దాదాపు నెలన్నరపాటు తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోని పట్టణాలు, పల్లెలు వివిధ పార్టీల జెండాలతో, నాయకులతో కిటకిటలాడాయి. పట్టణాల్లో రోడ్‌షోలు, పల్లెల్లో ఇంటింటి ప్రచారాలు సాగాయి. వైసీపీ నుంచి మంత్రులు మొహరించగా, టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేశ్‌ సహా పలువురు ముఖ్య నాయకులు సుడిగాలి ప్రచారాలు చేశారు. మండల్లాలో తిష్టవేసి వ్యూహరచన చేశారు. విమర్శలు చేసుకున్నారు. ఆరోపణలు సంధించుకున్నారు. సవాళ్లు విసురుకున్నారు. మొత్తానికి కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణను లెక్కకూడా చేయకుండా పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాలను హోరెత్తించాయి. ఈ ప్రచారపర్వంలో ఆయా పార్టీలు విజయాస్త్రాలుగా నమ్మి జనం ముందుకు తీసుకువెళ్లిన కొన్ని ప్రధానాంశాలు దిగువ ఇస్తున్నాం. ప్రజలు వేటిని ఆదరించి ఆమోదిస్తారో శనివారం పోలింగ్‌లో తేలినా, మే 2 దాకా అవి ఈవీఎంల్లో భద్రంగా దాగే ఉంటాయి. 


ప్రచార విజయాస్త్రా లపై పార్టీల ఆశలువైసీపీ: నవరత్నాల ధీమా

నవరత్నాల పేరుతో అమలు చేసిన పథకాలే వైసీపీ అభ్యర్ధిని అఖండ మెజారిటీతో గెలిపిస్తాయని ఆ పార్టీ నమ్మకంతో ఉంది. అమ్మఒడి: వైసీపీ అత్యధికంగా ఆశపెట్టుకున్న పథకం ఇదే. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో బడి పిల్లలు 1,63,471 మంది ఉంటే వీరిలో 1,20,921మందికి ఈ పథకం ద్వారా లబ్ధి కలిగింది. ఇంటికి రూ.15వేలు అని ప్రకటించినా వెయ్యి మినహాయించుకుని రూ.14వేలు ఖాతాల్లో వేస్తున్నారు. - కాపునేస్తం కింద రూ. 15 వేలు, వాహన మిత్ర పేరుతో రూ.10 వేలు, జగనన్న చేదోడు కింద రజక, నాయీబ్రాహ్మణ వృత్తిదారులకు, టైలర్లకు రూ. 10 వేలు, చిరువ్యాపారులకు రూ.10వేలు, చేయూత పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.18 వేలు ఇస్తున్నారు. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలు ఓట్లు రాలుస్తాయనే నమ్మకంతో వైసీపీ నేతలున్నారు.- వలంటీర్లను రాజకీయ కార్యకర్తల్లా వాడుకోవడం, పోలీసులు, ఉద్యోగులు స్థానిక ఎన్నికల తరహాలోనే తమకు పూర్తిగా సహకరిస్తారనే నమ్మకం.- భారీ ఎత్తున ఓటర్లకు పంచే డబ్బు.


టీడీపీ: ప్రజల కష్టాలే గెలిపిస్తాయి

ఏదో చేస్తారనే ఆశతో ఒక్క ఛాన్స్‌ ఇద్దామనుకున్న ప్రజలు మోసపోయారని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు అణచివేతకు, అవమానాలకు గురవుతున్నారని, ఉద్యోగుల్లో అసంతృప్తి పేరుకుపోతోందని.. వీటితో పాలనా దక్షుడైన చంద్రబాబు లేకపోవడం వల్ల జరిగిన నష్టం జనం గుర్తించారని టీడీపీ చెబుతోంది. రెండున్నర ఏళ్ల పాలనలో రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో వివరిస్తూ ఆ పార్టీ నేతలు ప్రజల ముందుకు వెళ్లారు. 

వైసీపీ అధికారంలోకి రాకముందు నిత్యావసరాల ధరలు ఎంత ఉన్నాయో, ప్రస్తుతం ఎంతో వివరిస్తూ చేసిన ప్రచారం జనంలోకి వెళ్లిందని టీడీపీ వర్గాలు నమ్ముతున్నాయి.  ఇక పథకాల లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత,నవరత్నాల పేరుతో జనం డబ్బు అప్పనంగా పంచినా అవేవీ పేదలకు మిగలడం లేదని పెరిగిన ధరలతో,నాసిరకం మద్యంతో అంతకు పదింతలు లాగేసుకుంటున్నారనే అంశాన్ని ప్రచారంలో ప్రధానాంశం చేసుకున్నారు. ఇసుక కష్టాలతో అవస్థలు పడుతున్న జనం వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని అంటున్నారు.  కరెంటు ఛార్జీల పేరుతో వీరబాదుడు,  రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపు, పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను పెంపు వంటివి సామాన్య జనంలో అసంతృప్తిని పెంచాయని వారంతా చేసిన పొరపాటును దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నది టీడీపీ వాదన, నమ్మకం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకర వైఖరి, పెరిగిన రౌడీయిజం వంటి అన్ని అంశాలనూ జనం గమనిస్తున్నారని, ఓటు రూపంలో తమ అభిప్రాయం ప్రకటిస్తారని భావిస్తున్నారు.


నిత్యావసర వస్తువుల ధరల పట్టిక (కిలో చొప్పున)

వస్తువు 2018లో ధర ప్రస్తుత ధర

ఎండుమిరప రూ. 140 రూ. 250

కందిపప్పు రూ.  80 రూ. 130

శెనగపప్పు రూ.  60 రూ. 140

పెసరపప్పు రూ.  70 రూ. 110

ఉద్దిపప్పు రూ.  70 రూ. 120

చింతపండు రూ.  90 రూ. 180

శెనగనూనె రూ. 130 రూ. 210

రిఫైన్డ్‌ నూనె రూ.  80 రూ. 165


 బీజేపీ:హిందుత్వ మీదే ఆశలు

బీజేపీ ప్రచారం యావత్తూ హిందూత్వ అంశం మీదే ప్రధానంగా సాగింది. అలాగే ఆలయాలపై దాడుల అంశాన్ని పార్టీ నేతలు జనంలోకి విస్తృతంగా తీసుకెళ్ళేందుకు యత్నించారు.  వైసీపీ పాలనలో హిందూ మతానికి ప్రమాదం కలుగుతోందని, హిందూ ధర్మాన్ని, సంస్కృతిని అణచివేసే ప్రయత్నం జరుగుతోందంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం కావడం, లోక్‌సభ నియోజకవర్గం యావత్తూ తిరుపతి, తిరుమల పుణ్యక్షేత్రాలకు భౌగోళికంగా చేరువగా వుండడంతో హిందూత్వ సెంటిమెంట్‌ బలంగా పనిచేస్తుందన్న నమ్మకం బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.


కాంగ్రెస్‌: దళిత ఓట్లపైనే ఆశలు

పీసీసీ ఛైర్మన్‌ సాకే శైలజానాధ్‌, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, తులసి రెడ్డి వంటి వారు ప్రచారం చేసినా చింతామోహన్‌ వ్యక్తిగత ప్రచారం మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. అందునా దళిత వర్గాలనే లక్ష్యం చేసుకున్నారు. వైసీపీ పాలనలో దళితులు ఎలా మోసపోయారో ఇంటింటికీ వెళ్లి వివరించారు. ఇందిరమ్మ పాలన తిరిగి వస్తేనే దళితులకు మేలు జరుగుతుందని ప్రచారం చేశారు.ప్రధాని మోదీ మీదా, సీఎం జగన్‌ మీదా తీవ్రమైన విమర్శలు చేశారు. వైసీపీ వైపు వెళ్లిపోయిన దళిత వర్గాలు తిరిగి కాంగ్రె్‌సకు చేరువ అవుతున్నాయనే నమ్మకంతో ఆయన ఉన్నారు. 


సీపీఎం: ఓట్లు పెరగచ్చు

గెలుపు లక్ష్యం కాకపోయినా తమకు ఓట్ల శాతం పెరగవచ్చన్న అంచనాతో సీపీఎం ఉంది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ జిల్లాలో ప్రచారం చేశారు.  బీజేపీ, వైసీపీ ప్రభుత్వాల తీరుపై దళితులు వ్యతిరేకంగా వున్నారని సీపీఎం నేతలు భావిస్తున్నారు. ఆ వర్గంవారు సీపీఎంను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశముందనే నమ్మకం , ఆశ వామపక్షాల్లో ఉన్నాయి.  


Advertisement
Advertisement
Advertisement