Tirupati : చెల్లి పెళ్లికి అప్పిచ్చి.. నలుగురిలో అవమానించాడని చంపేశాడు..!

ABN , First Publish Date - 2021-11-30T12:19:04+05:30 IST

చెల్లి పెళ్లికి అప్పిచ్చి.. నలుగురిలో అవమానించాడని చంపేశాడు..!

Tirupati : చెల్లి పెళ్లికి అప్పిచ్చి.. నలుగురిలో అవమానించాడని చంపేశాడు..!
నారాయణ (ఫైల్ ఫొటో)

  • నారాయణ హత్యకేసులో ఆరుగురి అరెస్టు 
  • చేతబడి చేశాడన్న అనుమానం తోడైంది

చిత్తూరు జిల్లా/ఏర్పేడు : తీసుకున్న అప్పు తీర్చమని నలుగురిలో అవమానించిన వృద్ధుడిపై ఓ వ్యక్తి కసి పెంచుకున్నాడు. ఇప్పటికే చేతబడి చేశాడని ఆయనపై కక్ష పెంచుకున్న మరొకరితో చేతులు కలిపాడు. ఇరువర్గాలు కలసి ఈనెల 25న అర్ధరాత్రి ఏర్పేడు మండలం పంగూరు గిరిజన కాలనీకి చెందిన కుంభ నారాయణ(59)ను దారు ణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వివరాలివీ.. మండలంలోని పంగూరు గిరిజనకాలనీకి చెందిన నారాయణ వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాడు. 


ఆయన ఇంటి పక్కన నివసిస్తున్న వరుసకు మేనల్లుడైన పూజారి నాగరాజు(56) తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు మొదల య్యాయి. నారాయణ చేతబడి చేయడంతో సమ స్యలు వస్తున్నట్లు అనుమానించాడు. ఈ విష యమై తరచూ రెండు కుటుంబాల వారు గొడవ పడుతున్నారు. ఈనెల 20న స్థానిక కులపెద్దలు నాగరాజు కుటుంబంపై చేతబడి చేయలేదని బుచ్చినాయుడు కండ్రిగ మండలం పచ్చాలమ్మ కాలనీలోని పచ్చాలమ్మ ఆలయంలో నారాయణ ప్రమాణం చేయాలని తీర్మానించారు. దీంతో వచ్చేనెల 6న ప్రమాణం చేసేందుకు సిద్ధమని నారాయణ తేల్చిచెప్పాడు. 


అప్పు తీర్చాలని అవమానించడంతో.. 

పంగూరు గిరిజనకాలనీకి చెందిన పూజారి మస్తానయ్య కుమారుడు పూజారి వెంకటేష్‌ ఈ ఏడాది ఆరం భంలో తన చెల్లి పెళ్లి నిమిత్తం నారాయణ వద్ద రూ.50వేలు అప్పుగా తీసు కున్నాడు. మూడునెలల తర్వాత సొమ్ము అడిగిన నారాయణతో ఆయన గొడవకు దిగాడు. అనంతరం నాగరాజు వద్ద రూ.50వేలు తీసుకుని అప్పు చెల్లించాడు. అయితే అప్పు చెల్లించమని నలుగురి ఎదుట ఒత్తిడి పెట్టిన నారాయణపై కసి పెంచుకున్నాడు. అనంతరం నాగరాజుతో చేతులు కలిపి ఆయన్ను చంపాలని పథకం పన్నాడు. 


ఆ మేరకు.. ఈనెల 25న అర్ధ రాత్రి దాటాక నాగరాజు, ఆయన పెద్ద కుమారుడు పూజారి వెంకటేష్‌(31), చిన్న కుమారుడు పూజారి సతీష్‌(26), మస్తా నయ్య కుమారుడు పూజారి వెంకటేష్‌(23), ఆయన అల్లుడు తిరుపతి లక్ష్మీపురానికి చెందిన అబ్బాస్‌ (35), సమీప బంధువు పూజారి రాజశేఖర్‌ అలియాస్‌ రాజు(24) ఇంటి పక్కనున్న చర్చిలో నిద్రిస్తున్న నారాయణ వద్దకు వెళ్లారు. అనంతరం చర్చి బయట నాగరాజు కాపలా ఉండగా, మిగిలిన నలుగురు ఆయన్ను కదల కుండా గట్టిగా పట్టుకున్నారు. దీంతో మస్తానయ్య కుమారుడు వెంకటేష్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో నారాయణ గొంతుకోసి దారుణంగా చంపాడు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసి వృద్ధుడి హత్యపై దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని శ్రీకాళహస్తి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ శ్రీహరి పేర్కొన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆరుగురిని రిమాండ్‌ నిమిత్తం స్థానిక సబ్‌జైలుకు తరలించినట్లు వివరించారు. 

Updated Date - 2021-11-30T12:19:04+05:30 IST