అడ్డగోలుగా అమ్మకాలు

ABN , First Publish Date - 2022-04-24T06:20:50+05:30 IST

జిల్లాలో మద్యం అమ్మకాలు అడ్డగోలుగా సాగుతున్నాయి. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయా లు జరుపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. పోటీ పడి మరీ మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులు.. దానిని తిరిగి రాబట్టుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు.

అడ్డగోలుగా అమ్మకాలు
ఉదయం 7గంటలకే పర్మిట్‌ రూమ్‌లో మద్యం విక్రయాలు ఇలా..

మద్యం అమ్మకాల్లో వైన్స్‌ యజమానుల ఇష్టారాజ్యం

ఉదయం 7గంటల నుంచే పర్మిట్‌ రూముల్లో జోరుగా లూజు విక్రయాలు

సిండికేటు వ్యాపారులతో సంబంధిత శాఖ అధికారుల కుమ్మక్కు

డోంటువర్రీ.. అమ్మేసుకోండి అంటున్న వైనం

ప్రజల ప్రాణాలతో చెలగాటం

జిల్లావ్యాప్తంగా మొత్తం పది బార్లు, 40 మద్యం దుకాణాలు

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మద్యం అమ్మకాలు అడ్డగోలుగా సాగుతున్నాయి. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయా లు జరుపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. పోటీ పడి మరీ మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులు.. దానిని తిరిగి రాబట్టుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. లూజు మద్యం కల్తీ విక్రయాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. జిల్లాలో పది బార్లు, 40 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో లెక్క లేనన్ని బెల్ట్‌ దుకాణాలు కొనసాగుతున్నాయి. అయినా అధికారులకు పట్టింపే లేకుండా పోతోంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా మందుబాబులను మత్తులో దిం పుతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు కల్తీ మద్యం కాటుకు బలై రోడ్డున పడుతున్నాయి. మద్యానికి బానిసవుతున్న వారిలో ఎక్కువగా సామాన్య, మధ్య తరగతి ప్రజలే కావడం ఆందోళన రేపుతోంది. రెక్కాడితే కాని డొక్కాడని పేద ప్రజలను మత్తులో ముంచుతూ వారి జీవితాలతో చెలగాటమాడుతు న్నా.. సంబంధిత అధికారులకు కనువిప్పే కలుగడం లేదు. ఇదంతా ఎక్సైజ్‌ శాఖ అధికారులకు తెలిసినా డోంట్‌వర్రీ అమ్మేసుకోండి అంటూ మద్యం వ్యాపారులకు పరోక్షంగా సహకారం అందిస్తున్నార న్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయ మై జిల్లా ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ను ఫోన్‌లో వివరణ కోరగా స్పందించ లేదు.

ఉపాధి కోల్పోతున్న పేదలు

జిల్లాలో ఉదయం 7గంటల నుంచే మద్యం అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. అసలు నిబంధనల ప్రకారం ఉదయం 10గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలను జరపాల్సి ఉంది. కాని జిల్లాలో అవేమీ పట్టనట్లుగా వ్యాపారులు ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు జరుపుతున్నా.. అధికారులు నోరుమెదుపడం లేదు. కూలీనాలి చేసుకునే నిరుపేదలు ఉపాధి పనులకు దూరమై మత్తులో తూగుతున్నా రు. అసలే వేసవి కాలం, ఆపై మండిపోతున్న ఎండలకు మద్యం మత్తులో ఆరోగ్యాన్ని చిత్తు చేసుకుంటున్నారు. ఉద యం నుంచే మద్యం తాగి వైన్స్‌ షాప్‌ల ముందు స్పృహ కోల్పోయి పడిపోతున్నారు. అయినా యజమానులు పట్టించుకోవడం లేదు. కనీసం మానవత్వమైన చూపడం లేదు. ఇటీవల అధికంగా మద్యం తాగి ఒకరిద్దరు మృతి చెందిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనలతోనైనా అధికారు లు అప్రమత్తం అయినట్లు కనిపించడం లేదు. పర్మిట్‌ రూమ్‌లలో ఎలాంటి నిబంధనలు కూడా పాటించడం లేదు. దాహం వేస్తే గొంతు తడుపుకునేందుకైనా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం లేదు. అలాగే పర్మిట్‌రూమ్‌ పరిసర ప్రాంతాలు అధ్వానంగా మారి కంపుకొడుతున్నా.. వ్యాపారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం పెట్టుబడులు ఎలా తిరిగి రాబట్టుకోవాలనే తపనతోనే వ్యాపారులు కనిపిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

మద్యం అక్రమ అమ్మకాలు నిత్యం అధికారుల కళ్ల ముందే జరుపుతున్నా.. మాముళ్ల మత్తులో అధికారులు కళ్లు మూసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉదయం 10గంటలకే వైన్స్‌షాపులను తెరుస్తున్నా.. వ్యాపారులు మాత్రం తెలివిగా ముందే మద్యం నిల్వలను సిబ్బందికి అప్పగిస్తూ.. ఉదయం 7 గంటల నుంచి పర్మిట్‌రూమ్‌లలో లూజు విక్రయాలను జరుపుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఏదో టార్గెట్‌ను పూర్తి చే యాలని చెప్పడమే తప్ప, నిబంధనల అమలుపై పట్టింపే లేదు. నెలవారి మాముళ్లకు ఆశపడి అటువైపు కన్నెత్తైన చూడడం లేదు. వ్యాపారులు సిండికేటు గా మారి ఇప్పటికే బెల్ట్‌షాపులకు మద్యాన్ని విచ్చలవిడిగా తరలిస్తున్నా.. తేలికగానే తీసుకుంటున్నారు. ఒక్కో వైన్‌షాపు యజమాని నెలకు మాము ళ్ల రూపంలో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ముట్టచెబుతున్నట్లు తెలుస్తుంది. జిల్లా అధికారి స్థానికంగా ఉండకపోవడంతో మద్యం అక్రమ విక్రయాలపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఏదో ఇలా వచ్చి అలా వెళ్తున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. 

Updated Date - 2022-04-24T06:20:50+05:30 IST