హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలి!

ABN , First Publish Date - 2020-08-04T06:42:38+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్లు అమలుచేయని కారణంగా వందలాదిమంది మెరిట్ పొందిన పురుష నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాలను కోల్పో వాల్సి...

హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలి!

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్లు అమలుచేయని కారణంగా వందలాదిమంది మెరిట్ పొందిన పురుష నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాలను కోల్పో వాల్సి వచ్చింది, ఫలితంగా మెరిట్ పొందని స్త్రీ అభ్యర్థులకు లబ్ధి చేకూరింది, మహిళా రిజర్వేషన్లు 33.33% హారిజాంటల్‍గా అమలు చెయ్యకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి న్యాయస్థానాల తీర్పులకు విరుద్ధం.


భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు తీర్పుల ఆధారంగా దేశంలో ప్రభుత్వ విద్య, ఉద్యోగాలలో కల్పిస్తున్న రిజర్వేషన్లను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు (1) Vertical/ Social రిజర్వేషన్లు (2) Horizontal/ Special రిజర్వేషన్లు. వెర్టికల్ రిజర్వేషన్లలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనకపడిన తరగతులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) లకు సంబంధించినవారు వస్తారు. ఇటీవల సుప్రీం కోర్టు వికలాంగుల రిజర్వేషన్లను కూడా వెర్టికల్‍గా లెక్కించాలని సూచించింది. మహిళలు, ఎన్.సీ.సీ,  స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్‍మెన్ రిజర్వేషన్లు హారిజాంటల్ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తాయి.    


వెర్టికల్ రిజర్వేషన్లు ఆర్టికల్ 15(4), 15(5), 16(4) ద్వారా కల్పిస్తున్నవి కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ పోస్టులకు, వారికి  కేటాయించిన రిజర్వేషన్ పోస్టులకు పోటీ పడి ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని మించి ఎంపిక కావచ్చు. అదే హారిజాంటల్ రిజర్వేషన్లలోని మహిళలకు 33.33% రిజర్వేషన్లు ఆర్టికల్ 15(3) ద్వారా కలిపిస్తున్నారు. అనగా మహిళలు జనరల్ కేటగిరి పోస్టులలో లేదా వారికి కేటాయించిన రిజర్వేషన్లో ఎంపికైనప్పటికీ మొత్తం ఎంపికైన మహిళా అభ్యర్థుల సంఖ్య 33.33%కి  మించకూడదు. 


ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1997లో జీవో.65ని జారీ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్‍మెన్, ఎన్.సి.సి రిజర్వేషన్లను ఉద్యోగ నియామకాలలో కల్పిస్తూ 100రోస్టరును నిర్ధారించి అన్ని రిజర్వేషన్లు కూడా వెర్టికల్‌‍గా అమలు చెయ్యా లనే భావం వచ్చే విధముగా తెలిపింది, అప్పటినుండి నేటి వరకు తెలంగాణాలో అదే విధానం కొనసాగు తుంది. తప్పుని గ్రహించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2016లో జీవో.40, 2018లో జీవో.63ను జారీ చేస్తూ మహిళా రిజర్వేషన్లను ఉద్యోగ నియామకాలలో హారిజాంటల్‍గా అమలు చేస్తున్నది. కానీ మెడికల్ సీట్ల భర్తీలో మొదటి నుండి రెండు తెలుగు రాష్ట్రాలు మహిళా, స్పోర్ట్స్, ఎక్స్‌సర్వీస్‍మెన్, ఎన్.సి.సి కోటాలను హారిజాం టల్‌గా అమలు చెయ్యడం గమనార్హం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలలో మహిళా రిజర్వేషన్లను హారిజాంటల్‍గా అమలు పరిచే విధంగా ఉత్తర్వులను జారీ చేసి జనరల్ కేటగిరి, యస్.సి, యస్.టి, బీసీ లకు చెందిన పురుష మెరిట్ అభ్యర్థులకు న్యాయం చెయ్యాలి.

కోడెపాక కుమార స్వామి

రాష్ట్ర అధ్యక్షులు, 

తెలంగాణ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం

Updated Date - 2020-08-04T06:42:38+05:30 IST