అటవీ భూముల్లో అడ్డగోలు తవ్వకాలు

ABN , First Publish Date - 2020-10-30T11:31:47+05:30 IST

రిజర్వుడు ఫారెస్టులోని గుట్టల్లో గ్రావెల్‌ క్వారీకి అనుమతి ఇచ్చిన అధికారుల తీరుపై ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అటవీ భూముల్లో అడ్డగోలు తవ్వకాలు

అధికారుల అనుమతిపై అనుమానాలు

భారీగా డబ్బు చేతులు మారిందని విమర్శలు


గుండాల, అక్టోబరు 27: రిజర్వుడు ఫారెస్టులోని గుట్టల్లో గ్రావెల్‌ క్వారీకి అనుమతి ఇచ్చిన అధికారుల తీరుపై ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. శెట్టుపల్లి-కొమరారం మధ్య రహదారి నిర్మాణానికి ఎల్‌డబ్ల్యూఎస్‌ఈ ద్వారా రూ.36 కోట్లు మంజూరయ్యాయి. మార్గమధ్య లోని కల్వర్టులు, వంతెనల నిర్మాణానికి గుండాల నుంచి ఇసుకను తరలించడానికి రూ.లక్షలు తీసుకుని అక్రమంగా అనుమతులు ఇచ్చిన అటవీశాఖాఽధికారులు, ఏకంగా రిజర్వుడు ఫారెస్టులో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలకూ అదే తీరులో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. శెట్టుపల్లి పంచాయతీ ప్రజలు స్వచ్ఛభారత్‌లో మరుగుదొడ్ల నిర్మాణానికి గుండాల నుంచి ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేసిన అటవీశాఖాధికారులు, రిజర్వుడు ఫారెస్టులో అక్రమ గ్రావెల్‌ క్వారీకి ఎలా అనుమతులు ఇచ్చారో చెప్పాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. శెట్టుపల్లి-కొమరారం మధ్య 10 కిలోమీటర్ల దూరం ఉండగా, ఆ రోడ్డు కోసం అక్రమ గ్రావెల్‌ క్వారీని రిజర్వుడు ఫారెస్టులో ఏర్పాటు చేయడానికి చేయడానికి అనుమతి ఇవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇల్లెందు మండలంలోని పోచారం, పోలారం, మానిక్యారం గ్రామాలకు గుండాల నుంచి  ఇసుక అక్రమ తరలింపులు అధికారుల కనుసన్నల్లో జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. 


ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 10వేలు?

 ఇసుక తోలకాలకు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10 వేలు తీసుకుంటున్న అటవీశాఖాధికారులు, ఎలాంటి రశీదులు ఇవ్వకుండా స్వాహా చేస్తున్నారని తెలుస్తోంది. ఇల్లెందు మండలంలోని కొమరారం-శెట్టుపల్లి మధ్య ఘాట్‌రోడ్డులోని పోచారం వద్ద సైతం గుట్టల్లో గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ అనుమతుల వెనుక భారీగా డబ్బులు చేతులుమారినట్లు ప్రచారం జరుగుతోంది. పోడు భూముల్లో దుక్కులు దున్నే ఒక్కో ట్రాక్టర్‌ యజమాని నుంచి రూ. ఐదు వేలు వసూలు చేశారని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయమై ఇల్లెందు ఎఫ్‌డీవో అనిల్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. జిల్లా అధికారులు అక్రమ గ్రావెల్‌ తవ్వకాలపై సమగ్ర విచారణ చేసి, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-10-30T11:31:47+05:30 IST