ఎరువు దొరికేనా?

ABN , First Publish Date - 2020-07-08T11:40:29+05:30 IST

సకాలంలో వర్షం... ఆపైన అవసరానికి తగ్గట్టు విత్తనాలు, ఎరువులు అందితేనే ఖరీఫ్‌ ఆశాజనకంగా ఉంటుంది. లేకుంటే అన్నదాతకు ఇక్కట్లు తప్పవు.

ఎరువు దొరికేనా?

ఏటా ఖరీఫ్‌లో వేధిస్తున్న కొరత

సీజన్‌ మధ్యలో దొరకక రైతులకు కష్టాలు

ఈ ఏడాది రైతుభరోసా కేంద్రాలపై ఆశలు

ముందస్తు చర్యలు లేకుంటే గత తప్పిదాలు పునరావృతం


 ఏటా ఖరీఫ్‌లో అన్నదాతలను ఎరువుల కొరత వేధిస్తోంది. కొరత లేకుండా చేస్తామని  అధికారులు చెబుతున్న మాటలు అవసరమైన సమయంలో అక్కరకు రావడం లేదు.   సకాలంలో ఎరువులు అందించలేక చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతుభరోసా కేంద్రాల ద్వారా ఈ ఏడాది ఎరువుల పంపిణీకి వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. దీంతో సక్రమంగా అందుతుందని రైతుల్లో ఆశ ఉన్నా..పర్యవేక్షణ, ముందస్తు చర్యలు చేపట్టకపోతే గత తప్పిదాలు  పునరావృతమయ్యే అవకాశం ఉంది.


(టెక్కలి): సకాలంలో వర్షం... ఆపైన అవసరానికి తగ్గట్టు విత్తనాలు, ఎరువులు అందితేనే ఖరీఫ్‌ ఆశాజనకంగా ఉంటుంది. లేకుంటే అన్నదాతకు ఇక్కట్లు తప్పవు. ఏటా ప్రకృతి విపత్తులతో పాటు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందక రైతు చిత్తవుతున్నాడు. వ్యయప్రయాసలకోర్చి ఖరీఫ్‌ పనులు ప్రారంభించినా..అవసరమైనప్పుడు ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడిన దాఖలాలు ఎన్నో. మధ్యలో అధికారులు చేతులెత్తేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతుభరోసా కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో ఎరువులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 


జిల్లాలో 2 లక్షల 10 వేల హెక్టార్లలో వరి పండుతుందని వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అన్నిరకాల ఎరువులు కలిపి 32,467 మెట్రిక్‌ టన్నులు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇందులో యూరియా 16,360 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 7,840, పొటాష్‌ 1,858, సూపర్‌ 1,751, కాంప్లెక్స్‌ ఎరువులు 4,305, సిటీ కంపోస్టు ఎరువులు 240 మెట్రిక్‌ టన్నులు సిద్ధంగా ఉంచారు. హోల్‌సేల్‌ ఎరువులు వ్యాపారుల వద్ద 3,817 మెట్రిక్‌ టన్నులు, రైతుభరోసా కేంద్రాల వద్ద 216 మెట్రిక్‌టన్నులు, ఏపీ మార్క్‌ఫెడ్‌ వద్ద 8,150 మెట్రిక్‌ టన్నులు, ఎరువులు కంపెనీ గోదాములు వద్ద 1,026 మెట్రిక్‌ టన్నులు, రిటైల్‌ వ్యాపారులు వద్ద 17,400 మెట్రిక్‌ టన్నుల ఎరువలు నిల్వలను ఉంచారు. గతంలో పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌లు ద్వారా ఎరువులు విక్రయించారు. ఈసారి రైతుభరోసా కేంద్రాల ద్వారా సుమారు 30 నుంచి 40 శాతం ఎరువులు విక్రయించాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. 


నెలవారీగా అవసరం ఇలా..

ఖరీఫ్‌లో భాగంగా వరి సాగులో జూలైలో 15,400 మెట్రిక్‌ టన్నుల యూరియా, 5,200 టన్నుల డీఏపీ అవసరం. ఆగస్టులో 19,600 మెట్రిక్‌ టన్నుల యూరియా, 6,500 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, సెప్టెంబరులో 19,800 మెట్రిక్‌ టన్నుల యూరియా, 6,600 మెట్రిక్‌ టన్నుల డీఏపీ అవసరం. డీఏపీ, గ్రోమోర్‌ వంటి ఎరువుల కొనుగోలు రైతులకు భారం.  సాధరణంగా చౌకగా లభ్యమయ్యే యూరియా వంటి ఎరువుల పైనే దృష్టి సారిస్తున్నారు. దీంతో సీజన్‌లో ఏటా యూరియా కొరత అనివార్యమవుతోంది.


కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు అమ్మడం చేస్తున్నారు. దీంతో ఏటా ఎరువు కోసం అవస్థలు పడాల్సి వస్తోంది. వాస్తవానికి 45 కేజీల నీమ్‌కోటెడ్‌ యూరియా రూ.266.50కు విక్రయించాల్సి ఉన్నా... ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కొరతను ఆసరాగా చేసుకొని రూ.300 నుంచి రూ.320 వరకూ విక్రయిస్తున్నారు. ఫలితంగా రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఒడిశా నుంచి నకిలీ ఎరువులు జిల్లాకు చేరుతున్నాయి. వీటిపై వ్యవసాయ శాఖ దృష్టి సారించాల్సిన అవసరముంది.  అయితే ఈ ఏడాది రైతుభరోసా కేంద్రాల ద్వారా 30 నుంచి 40శాతం వరకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు ఎరువులు అందిస్తామని వ్యవసాయశాఖ అధికారులు పదేపదే చెబుతున్నారు. ఇది ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచిచూడాలి.


కొరత లేకుండా చూస్తాం

ఈ ఏడాది రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందిస్తాం. ఎటువంటి కొరత రానివ్వం. 7200 మెట్రిక్‌ టన్నుల బఫర్‌ స్టాక్‌ ఎరువులు ఉన్నాయి. డీఏపీ అందుబాటులో ఉంది.  ఎరువుల దుకాణాలపై నిఘా పెంచుతాం. అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటాం. 

-కె.శ్రీధర్‌, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, శ్రీకాకుళం 

Updated Date - 2020-07-08T11:40:29+05:30 IST