అందరికీ అందేనా?

ABN , First Publish Date - 2021-06-15T06:17:30+05:30 IST

వానాకాలం సాగు సబంధించి రైతుబంధు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. గతంలో భూ సమస్యలు ఉన్నవారికి రైతు బంధు అందలేదు. ఈ సారి రైతుల భూ సమస్యలు పరిష్కరించి రైతుబంధు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందరికీ అందుతుందో లేదోనని సంబంధిత రైతులు అయోమయానికి గురవుతున్నారు.

అందరికీ అందేనా?
వ్యవసాయ పనుల్లో రైతులు

-  రైతుబంధుపై ఆశలు 

-  నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ  

- జిల్లాలో 1,17,577 మంది రైతులు 

 - వానాకాలం సాగు 2.80 లక్షల ఎకరాలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వానాకాలం సాగు సబంధించి రైతుబంధు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.  మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. గతంలో భూ సమస్యలు ఉన్నవారికి రైతు బంధు అందలేదు. ఈ సారి రైతుల భూ సమస్యలు పరిష్కరించి రైతుబంధు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందరికీ అందుతుందో లేదోనని సంబంధిత రైతులు అయోమయానికి గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు సాగు చేయనున్నట్లు  వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీని ప్రకారం చూస్తే రైతుబంధు రూ.140 కోట్ల వరకు రైతులకు అందాల్సి ఉంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతు బంధు కింద 1,17,577 మంది రైతులకు రూ.129.27 కోట్ల   ఆర్థిక సహాయం ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2018 నుంచి ప్రభుత్వం రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తుండగా  2018లో 1,04,636 మంది రైతులు రూ. 97.43 కోట్లు, 2018-2019 యాసంగిలో 1,01,951 మంది రైతులు రూ. 97.01 కోట్లు, 2019 వానాకాలం సాగులో 1,03,153 మంది రైతులే రూ.121.36 కోట్లు లబ్ధిపొందారు. గత వానాకాలం 2020 సంవత్సరం సాగులో 1,12,784 మంది రైతులు రూ.128.06 కోట్లు, ప్రస్తుతం ముగిసిన యాసంగిలో 1,14,626 మంది రైతులు రూ.129.21 కోట్ల లబ్ధి పొందారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 1,17,577 మంది రైతుల ఖాతాల్లో రూ.129.27 కోట్లు జమ కానున్నాయి. జిల్లాలో అనేక మంది రైతులు భూ తగాదాలు, వివాదాలతో రైతు బంధును అందుకోని వారు ఉన్నారు. వారికి ఈ సారైనా రైతు బంధు అందుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో సాగు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అల్పపీడన ప్రభావంతో రుతుపవనాలు బలపడి ముందుస్తుగానే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు కూడా వానాకాలం సాగుపై ఉత్సాహం చూపుతున్నారు. రైతుబంధు డబ్బులు కూడా ఖాతాల్లో జమకానుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఈ సారి జిల్లాలో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచారు. 2.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 1.63 లక్షల ఎకరాలు, పత్తి 1.02 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా జొన్న 70 ఎకరాలు, కందులు 10,500 ఎకరాలు, పెసర్లు 1310 ఎకరాలు, మినుములు 68 ఎకరాలు, పల్లి 10 ఎకరాలు, ఆముదం 331 ఎకరాలు, సోయాబీన్‌ 27 ఎకరాలు, చెరుకు 98 ఎకరాలు, మొక్కజొన్న 2 వేల ఎకరాలు, ఇతర పంటలు 1030 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. ఇందుకు విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటున్నారు.  

Updated Date - 2021-06-15T06:17:30+05:30 IST