గొర్రెల పంపిణీపై ఆశలు

ABN , First Publish Date - 2022-08-20T05:10:42+05:30 IST

గొర్రెల యూనిట్ల పంపిణీపై గొల్లకుర్మల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో రెండో విడత పంపిణీని సెప్టెంబరు నుంచి ప్రారంభించనున్నట్లు స్వాతంత్య్ర వేడుకల్లో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. రూ.81.20 కోట్ల వ్యయంతో గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పశు సంవర్థక శాఖ కూడా పెండింగ్‌లో ఉన్న యూనిట్ల పంపిణీకి సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలోనే గొర్రెల పంపిణీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గతంలో కంటే యూనిట్‌ ధరను పెంచుతూ మార్గదర్శకాలు జారీ చేసింది.

గొర్రెల పంపిణీపై ఆశలు

- సెప్టెంబరులో రెండో విడతకు సన్నాహాలు 

- పెరిగిన యూనిట్‌ ధర  

- జిల్లాలో 16,182 యూనిట్ల లక్ష్యం

-11,674 యూనిట్లు పంపిణీ 

- రెండో విడతలో రూ 81.20 కోట్ల కేటాయింపు 

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

గొర్రెల యూనిట్ల పంపిణీపై గొల్లకుర్మల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో రెండో విడత పంపిణీని సెప్టెంబరు నుంచి ప్రారంభించనున్నట్లు  స్వాతంత్య్ర వేడుకల్లో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. రూ.81.20 కోట్ల వ్యయంతో గొర్రెల యూనిట్లను   పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పశు సంవర్థక శాఖ కూడా పెండింగ్‌లో ఉన్న యూనిట్ల పంపిణీకి సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలోనే గొర్రెల పంపిణీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గతంలో కంటే యూనిట్‌ ధరను పెంచుతూ మార్గదర్శకాలు జారీ చేసింది.   గొర్రెల పంపిణీ మళ్లీ ముందుకు రావడంతో జిల్లాలోని గొల్లకుర్మలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గొల్ల కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించింది. కొవిడ్‌ ఇతర కారణాలతో ఐదేళ్లపాటు నిలిచిపోయింది.  ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం యూనిట్‌ ధరను పెంచుతూ ఒక యూనిట్‌ రూ.1.75 లక్షలుగా నిర్ణయించింది. మరో వైపు అక్రమాల అడ్డుకట్టకు ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేసింది. 

జిల్లాలో రెండో విడత 4,508 యూనిట్లు 

జిల్లాలో 255 గ్రామ పంచాయతీల పరిధిలో 190  సొసైటీల ద్వారా గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారు.  మొత్తం 16,182 యూనిట్లను అందించే లక్ష్యం పెట్టుకోగా 11,674 యూనిట్లను ఇప్పటి వరకు అందించారు. మొదటి విడత 8,153 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో 7,515 మందికి యూనిట్లను పంపిణీ చేశారు. మిగిలిన యూనిట్లతో కలిపి రెండోవిడతలో 8029 మందికి యూనిట్లను అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 4159 యూనిట్లను ఇప్పటికే పంపిణీ చేశారు. మిగిలిన యూనిట్లతో కలిపి 4508 యూనిట్లను పంపిణీ చేయనున్నారు. గొల్లకుర్మల్లో 18 సంవత్సరాలు నిండిన వారిని సొసైటీ సభ్యులుగా చేర్చుకొని డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. గతంలో ఒక యూనిట్‌ ధర రూ.1.25 లక్షలు. ఇందులో 75 శాతం సబ్సిడీ పోగా 25 శాతం లబ్ధిదారుడు వాటా చెల్లించాల్సి ఉండేది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 1.75 లక్షలకు పెరిగింది. ఇందులో 75 శాతం సబ్సిడీ పోను 25 శాతం శాతం లబ్ధిదారుడు తన వాటా కింద రూ.43,750 చెల్లించాలి. జిల్లాలోని యూనిట్లను అందించడాని ప్రభుత్వం రూ.81.20 కోట్ల నిధులను కేటాయించింది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసింది. 

అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?

మొదటి విడత గొర్రెల పంపిణీ యూనిట్లలో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. జిల్లాకు కడప నుంచి తీసుకొచ్చిన గొర్రెల యూనిట్లను మళ్లీ రీసైక్లింగ్‌ చేయడం గొర్రెలకు వేసిన ట్యాగ్‌లను సైతం తొలగించడం వంటి అవకతవకలు జరిగాయి. ఇందులో అప్పటి జిల్లా పశు సంవర్థశాఖ అధికారి, మండల పశు వైద్యాధికారి సస్పెండ్‌ అయ్యారు. గొర్రెల యూనిట్లను అమ్ముకున్న లబ్ధిదారులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ సారి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. లబ్ధిదారుల జాబితా నమోదు కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. అందులో లబ్ధిదారుల వివరాలు, జిల్లా, మండల, గ్రామాల అధారంగా ప్రత్యేక కోడ్‌లను కేటాయించింది. లబ్ధిదారులు నేరుగా తమ ఖాతా నుంచి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఖాతాకు వాటా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఎట్టకేలకు గొర్రెల పంపిణీ ఐదేళ్ల తరువాత మళ్లీ ముందుకు రావడంతో ఈ సారైనా పూర్తవుతుందా? అని లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-08-20T05:10:42+05:30 IST