అభివృద్ధిపై ఆశలు

ABN , First Publish Date - 2021-12-31T06:12:12+05:30 IST

మర్రి చెట్టు కింద ఏ చెట్టు బతకదు అనేది నానుడి. హైదరాబాద్‌ నగరానికి కూతవేటు దూరంలో ఉండటంతో నల్లగొండ పట్టణం అభివృద్ధి చెందడం లేదన్న ప్రచారం ఉంది. ఓ వైపు రాజకీయ లక్ష్యం, మరోవైపు ఎన్నికల హామీల నేపథ్యంలో నల్లగొండను బంగారు తునక చేస్తానని సీఎం స్వయంగా ప్రకటించడం కలిసొచ్చింది.

అభివృద్ధిపై ఆశలు

నల్లగొండలో నిన్న సీఎం ప్రకటన, నేడు మంత్రుల పర్యటన

నల్లగొండ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మర్రి చెట్టు కింద ఏ చెట్టు బతకదు అనేది నానుడి. హైదరాబాద్‌ నగరానికి కూతవేటు దూరంలో ఉండటంతో నల్లగొండ పట్టణం అభివృద్ధి చెందడం లేదన్న ప్రచారం ఉంది. ఓ వైపు రాజకీయ లక్ష్యం, మరోవైపు ఎన్నికల హామీల నేపథ్యంలో నల్లగొండను బంగారు తునక చేస్తానని సీఎం స్వయంగా ప్రకటించడం కలిసొచ్చింది. దీనికి తోడు హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటడంతో ద్వితీయ శ్రేణి నగరాలవైపు పెట్టుబడిదారుల చూపు మళ్లింది.

ఐటీ హబ్‌తో అభివృద్ధిపథం

నల్లగొండలో రూ.10వేలకు గజం స్థలం మంచి ప్రాంతంలో దొరుకుతుంది. హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌ వంటి ప్రాంతాల్లో రూ.40వేలు పెట్టనిదే గజం రాదు. దీంతో పెట్టుబడిదారులు నల్లగొండ వైపు క్రమంగా మళ్లుతున్నారు. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ (రీజినల్‌ రింగ్‌ రోడ్డు) అందుబాటులోకి వస్తుండటంతో చౌటుప్పల్‌ నుంచి నేరుగా అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్‌కు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఐటీహబ్‌ నల్లగొండ అభివృద్ధిలో కలికితురాయిగా మారనుంది. పాలిటెక్నిక్‌ కళాశాలలో మూడు ఎకరాల్లో రెండు టవర్లు నిర్మించనున్నారు. ఒక్కో టవర్‌లో 12ఫ్లోర్లు ఉంటాయి. ఈ ఐటీహబ్‌ రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఐటీహబ్‌తో కనీసంగా 1500 నుంచి 2వేల మందికి ఉపాధి లభించనుంది. వీటిలో మహిళలే 60శాతం మంది ఐపీఓలుగా ఉపాధి పొందనున్నారు. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటం, ఉద్యోగుల భద్రత, సులభంగా రవాణా వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఐటీహబ్‌కు పాలిటెక్నిక్‌ కళాశాలను ఎంపిక చేసినట్లు తెలిసింది. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై మధ్యలో ఉండటం, నార్కట్‌పల్లి-అద్దంకి-చెన్నై మార్గానికి సమీపంలో ఉండటం, హైదరాబాద్‌కు గంటన్నరలో చేరుకునే అవకాశం ఉండటం వంటి అంశాల ప్రాతిపదికన నల్లగొండ ఐటీ హబ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు.

ఐటీ హబ్‌, ఎన్జీ కళాశాలకు రూ.80కోట్లు మంజూరు

నల్లగొండలో ఐటీ హబ్‌ నిర్మాణానికి, ఎన్జీ కళాశాలలో అధునాతన భవన నిర్మాణానికి రూ.80కోట్లు మంజూరుచేస్తూ గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఎన్జీ కళాశాలలో అధునాతన భవన నిర్మాణానికి రూ.30కోట్లు, ఐటీ హబ్‌ నిర్మాణానికి రూ.50కోట్లు కేటాయిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.

రియల్టర్ల ప్రచారానికి బ్రేక్‌

ఐటీహబ్‌ పేరుతో నల్లగొండ జిల్లా కేంద్రంలో రియల్టర్లు భూముల ధరలు పెంచారు. హైదరాబాద్‌ రోడ్డు, ఎంజీయూ, బెటాలియన్‌ ఎదురుగా, పానగల్‌లో ఐటీ హబ్‌ వస్తుందంటూ భూముల ధరలు పెంచేశారు. 12వ బెటాలియన్‌ ఎదురుగా దాసరిగూడెం దారిలో రూ.2వేలు పలికే గజం భూమి, ఈ ప్రచారం కారణంగా రూ.7వేల వరకు వెళ్లింది. యూనివర్సిటీకి రెండు వైపులా ఏర్పాటు చేసిన వెంచర్లలో ధరలు గజానికి రూ.10వేల వరకు తక్కువ లేదు. వీటన్నింటికీ బ్రేక్‌ వేస్తూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలోని మూడెకరాల్లో ఐటీహబ్‌ను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. దీంతో రియల్టర్లు ప్రస్తుత ఐటీహబ్‌ మొదటి దశ అని, రెండో దశ యూనివర్సిటీ వైపే అంటూ ప్రచారం ప్రారంభించడం గమనార్హం.

Updated Date - 2021-12-31T06:12:12+05:30 IST