అంగన్‌వాడీ పోస్టులపై ఆశలు

ABN , First Publish Date - 2022-08-13T05:38:10+05:30 IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో నిరుద్యోగ యువతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.

అంగన్‌వాడీ పోస్టులపై ఆశలు

- ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ప్రకటన

- జిల్లాలో 26 టీచర్‌, 90 ఆయా పోస్టులు ఖాళీ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో నిరుద్యోగ యువతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. గురువారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లాలో రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న 26 టీచర్‌ పోస్టులు, 90 ఆయా పోస్టులు భర్తీకి మార్గం సుగమం అయ్యింది. ఈ పోస్టులను రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి భర్తీ చేసేందుకు సింగిల్‌ నోటిఫికేషన్‌ జారీచేసి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో గత రెండు సంవత్సరాల నుంచి ఖాళీ ఏర్పడ్డ అంగన్‌వాడీ కేంద్రాల టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వివిధ కారణాల రీత్యా పలువురు రాజీనామాలు చేయగా, కొందరు మృతిచెందారు. మరికొందరు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. దీంతో ఖాళీ ఏర్పడ్డ అంగన్‌వాడీ కేంద్రాలను ఇన్‌చార్జీలతో నడిపిస్తున్నారు. ఆయా కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదనే విమర్శలున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పలుసార్లు జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఖాళీ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారా అని నిరుద్యోగ మహిళలు ఎదురుచూస్తున్నారు. 

జిల్లాలో 701 అంగన్‌వాడీ కేంద్రాలు..

జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథనిలో అంగన్‌వాడీ ప్రాజెక్టులు ఉండగా, వీటి పరిధిలో 701 అంగన్‌వాడీ కేంద్రాలు, 5 మినీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాల్లో మంథని ప్రాజెక్టు పరిధిలో మంథని మండలం కన్నాల-1, ఉప్పట్ల-2, మంథని-16, రామగిరి మండలం కల్వచర్ల-3, నాగేపల్లి-1, పన్నూర్‌, లద్నాపూర్‌-2, పెద్దంపేట్‌, ఉప్పర్ల కేశారం1, ముత్తారం మండలం కేశనపల్లి 1, ఓడేడు 3, ముత్తారం 2, కమాన్‌పూర్‌ మండలం పేరపల్లి 2, రాజేంద్రనగర్‌ కేంద్రాల్లో 15 టీచర్‌ పోస్టులు, 41 ఆయా పోస్టులు, రామగుండం ప్రాజెక్టు పరిధిలో రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో రాంనగర్‌ 2, రాంమందిర్‌ 4, పాలకుర్తి మండలం పుట్నూర్‌ కేంద్రాల్లో 3 టీచర్‌ పోస్టులు, 18 ఆయా పోస్టులు, పెద్దపల్లి ప్రాజెక్టు పరిధిలో పెద్దపల్లి మండలం సబితం, ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ 1, శివపల్లి, ఎలిగేడు 3, జూలపల్లి మండలం కుమ్మరికుంట 1, అబ్బాపూర్‌, ఓదెల మండలం గుండ్లపల్లి, శ్రీరాంపూర్‌ మండలం మీర్జంపేట్‌ 1 కేంద్రాల్లో 9 టీచర్‌ పోస్టులు, 31 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అబ్బాపూర్‌ టీచర్‌ పోస్టు కోర్టు పరిధిలో పెండింగులో ఉండగా, ఎలిగేడు3 కేంద్రం టీచర్‌ ఎంపిక ప్రాసెస్‌లో ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇవి 2018 తర్వాత నుంచి ఖాళీగా ఏర్పడ్డాయి. ఈ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారా అని నిరుద్యోగ యువతులు, స్థానిక మహిళలు ఎదురు చూస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్‌కు నెలకు 13,650 రూపాయలు, ఆయాకు 7,800 రూపాయలు గౌరవ వేతనంగా అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాల వారికి ఈ వేతనాలు కొంత మేరకు ఊరటనిచ్చే విధంగానే ఉంటున్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న కేంద్రాల టీచర్లు, ఆయాలకు ఈ వేతనాలు ఏమాత్రం సరిపోవనే చెప్పవచ్చు. ఖాళీగా ఏర్పడ్డ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు. 

పని భారంతో ఇబ్బందులు..

గ్రామాలు, పట్టణాల్లో ఉండే గర్భిణులు, బాలింతలు, ఐదేళ్లలోపు పిల్లలు రక్తహీనతకు గురికాకుండా, శారీరకంగా బలహీనం కాకుండా ఉండేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతి రోజు పాలు, ఉడుకబెట్టిన కోడిగుడ్లతో పాటు ఆకు కూరలు, ఇతరత్రా కూరలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించనున్నారు. కేంద్రాల్లో రెగ్యులర్‌గా టీచర్లు ఉంటేనే అందరికీ పౌష్టికాహారం సక్రమంగా అందుతుంది. అలాగే ఆరోగ్య సర్వేలు, ఇతరత్రా సర్వేల బాధ్యతలను ఎక్కువగా అంగన్‌వాడీ టీచర్లకే అప్పగిస్తూ ఉంటారు. టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్కన గల కేంద్రాల టీచర్లకు అప్పగించడం వల్ల వారిపై అదనంగా పని భారం పడుతున్నది. ఆయా పోస్టులు ఖాళీగా ఉన్న 90 కేంద్రాల్లో టీచర్లే ఆ భారాన్ని మోస్తున్నారు. అక్కడ వాళ్లు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్లకు సర్వే బాధ్యతలు అప్పగించినప్పుడు కేంద్రాలు తొందరగానే మూత పడుతున్నాయి. వంటలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ ప్రకటనతో చాలా మంది నిరుద్యోగులు ఆయా పోస్టులపై ఆశలు పెంచుకున్నారు. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఒకేసారి నోటిఫికేషన్‌ జారీ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. గతంలో ఆయా జిల్లాల్లోనే నోటిఫికేషన్‌ జారీ చేసే వారు. ఆన్‌లైన్‌ ద్వారానే ఒకేసారి దరఖాస్తులను స్వీకరించి రాత పరీక్ష నిర్వహించనున్నారు. వెయిటేజీతో పాటు, రాత పరీక్షలో వచ్చే మార్కులను బట్టి టీచర్లను ఎంపికచేయవచ్చని జిల్లా సంక్షేమ శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయమై డీడబ్ల్యూఓ ఎండీ రవూఫ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని నిర్ణయం తీసుకున్నట్లుగా పత్రికల్లో చూశానని, తమకు ఇప్పటివరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-13T05:38:10+05:30 IST