Abn logo
Sep 20 2021 @ 00:42AM

మళ్లీ ఆశలు!

పోడు వ్యవసాయం

మంత్రివర్గ ఉప సంఘ నియామకంతో గిరిజనుల ఆసక్తి  

ఈసారైనా పట్టాలు దక్కాలంటున్న పోడు రైతులు 

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రక్రియకు అవకాశం 

పోడు భూముల లెక్కలపై అటవీ శాఖ కసరత్తు 

అర్హుల ఎంపికకు దిశా నిర్దేశం  

కేంద్ర హోం శాఖ మంత్రికి సమస్యను వివరించిన ఎంపీ సోయం 

నిర్మల్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో కొన్నేళ్ల నుంచి కీలకంగా మారిన గిరిజనుల పోడు భూము ల సమస్య క్రమంగా పరిష్కారం దిశగా పయనిస్తోంది. రైతులు తమకు ఆ భూముల హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. చిలికి చిలికి గాలివానలా మారిన ఈ సమస్య అటవీ శాఖ అధికారులకు ప్రాణసంకటంగా మారింది. 

పలు మండలాల్లో తీవ్రంగా సమస్య..

జిల్లాలోని ఖానాపూర్‌, కడెం, దస్తూరాబాద్‌, పెంబి, మామడ, సారంగాపూర్‌, కుభీర్‌ తదితర మండలాల్లో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ సమస్య పాలకులకు ఉచ్చు  బిగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు ఈ దిశగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు సమస్యను పరిష్కరిస్తానని ఎన్నోసార్లు గిరిజనుల్లో ఆశలు కల్పించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అట వీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సైతం సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానంటూ భరోసా కల్పించారు. అయితే ఏళ్లు గడుస్తున్నా పాలకులు ఇ చ్చిన హామీ నెరవేరకపోతుండడంతో గిరిజను లు ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే చాలా సార్లు వివిధ రూపాల్లో గిరిజనులు ఆందోళన చేయడమే కాకుండా చాలాచోట్ల ప్రజాప్రతినిధులను నిలదీశారు. అయితే, గతంలో ఆర్‌ఓ ఎఫ్‌ఆర్‌ చట్టం కింద కటాఫ్‌ తేదీని నిర్ణయిం చి ఆ తేదీలోగా పోడు భూములను సాగు చే సుకుంటున్న గిరిజనుల నుంచి పట్టాల మం జూరు కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులు వేల సంఖ్యలో ఉన్న కారణంగా సమస్యను యంత్రాంగం దాటవేస్తూ వస్తోంది. 

మంత్రివర్గ ఉపసంఘం నియామకం..

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పోడు భూముల సమస్య పరిష్కారం కోసం మం త్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసం ఘంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కు మార్‌తో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఇప్పటికే ఒకసారి సమావేశమై సమస్య పరిష్కా రం కోసం దిశానిర్దేశాన్ని రూపొందించారు. మొదట అటవీ భూ ముల విస్తీర్ణంపై వివరాలు సేకరించి, అందులో ఎంత మేరకు పోడు వ్యవసాయ సాగవుతుందన్న అంశాన్ని నిర్ధారించనున్నారు. ఆ తర్వాత అర్హుల ఎంపిక.. పట్టాలు ఇవ్వడం వంటి అంశాలను పరిశీలిస్తోంది. దీంతో త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి.

లబ్ధిదారుల ఎంపికపై నజర్‌

జిల్లాలోని అటవీ భూముల్లో ఏళ్ల నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇ చ్చే ప్రక్రియ యంత్రాంగానికి సవాలుగా మారే అవకాశాలున్నాయి. గతంలో పోడు భూములకు ఓ కటాఫ్‌ తేదీని నిర్ణయించి పట్టాలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా కటాఫ్‌ తేదీ కీలకమయ్యే అవకాశాలున్నాయి. ఏళ్ల నుంచి అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్న పేద గిరిజనులకే పట్టాలు ఇవ్వాలంటూ కోరుతున్నారు. కొన్నిచోట్ల ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని కొంతమంది అటవీ భూము ల్లో కొత్తగా పోడు వ్యవసాయం చేస్తున్న కారణంగా అర్హుల ఎంపిక వివాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. గిరిజనుల్లో సైతం ఆదివాసీలు, లంబాడాల తెగల మధ్య వివాదం కొనసాగుతున్న క్రమంలో లబ్ధి దారుల ఎంపిక, పట్టాల మంజూరు వంటి అంశాలు అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

సీరియస్‌గా కసరత్తు..

కేసీఆర్‌ ఎన్నికల వేళ, ఉద్యమ సమయంలోనూ పోడు భూముల సమస్య పరిష్కారంపై గిరిజనులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకునే దిశగా పా వులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘానికి గడువును పరోక్షంగా సీఎం విధించినట్లు స మాచారం. దీంతో సభ్యులంతా సమీక్షలతో బిజీగా మారిపోయారు. మొత్తం రాష్ట్రంలోని అటవీ భూ ముల విస్తీర్ణం అందులో పోడు భూ ముల విస్తీర్ణంతో పాటు ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకు న్న వారి వివరాలు, అందు లో ఎంత మంది అర్హులు అనే అంశాలపై ఉప సంఘం నజర్‌ పెట్టిం ది. గిరిజన, అటవీ, రె వెన్యూ, పంచాయతీ రాజ్‌ శాఖలు సమష్టి గా తమ వద్ద ఉన్న వివరాలను ఉపసం ఘానికి అందించనున్నాయి. అటవీ హక్కు ల చట్టానికి అనుగుణం గా ఈ ప్రక్రియను చేపట్టా ల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మూడున్నర లక్షల ఎకరాలకు పైగా పోడు భూములకు సంబంధించి పట్టాలు ఇవ్వాల్సి ఉంటుం దని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న వారి వి వరాలను మరోసారి సే కరించి అందులో అర్హులను గుర్తించాల్సి ఉంటుంది. దీని పై గిరిజనుల అభిప్రాయాల ను కూడా తీసుకోవాలంటూ పలువురు కోరుతున్నారు. అటవీ భూముల విస్తీర్ణంపై ఇప్పటి వరకు పూర్తి స్పష్ట త కనిపించకపోతుండడం ప్రక్రియకు ఆటంకాలు సృష్టించే అవకాశాలున్నాయి. 

క్రియాశీలకంగా సోయం..

పోడు భూముల సమస్యను పరిష్కరించాలం టూ మొదటి నుంచి ఎంపీ సోయం బాపురావు గళమెత్తుతున్నారు. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌, మంత్రి అల్లోలపై ఒత్తిడి పెంచుతూ వస్తున్నారు. కాగా, నిర్మల్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లి కేంద్ర పరిధిలో ఈ దిశగా సహకరించి పరిష్కారానికి చొ రవ తీసుకోవాలని కోరారు. ఈ పరిణామాల దృష్ట్యా సమస్య పరిష్కారం దిశగా పయనిస్తోందన్న ఆశలు రేకేత్తుతున్నాయి.