పూచికపుల్ల లాంటి ఆశ

ABN , First Publish Date - 2020-11-05T07:06:44+05:30 IST

తెల్లవారే నిద్రలేచి, టీవీకి కళ్లు అతికించుకుని కూచోవడం ఎందుకు? ట్రంపు కాదు, బైడెన్‌ దూకుడు మీద ఉన్నాడనేసరికి...

పూచికపుల్ల లాంటి ఆశ

నిప్పు రవ్వ దావానల మవుతుందని, అన్యాయం ఎప్పటికైనా కూలిపోతుందని, సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని వినిపించే మాటలు నమ్మేవాళ్లు నమ్మవచ్చు. కానీ, బలమైనవి, నిర్దాక్షిణ్యమైనవి మాత్రమే గెలుస్తాయన్నది ప్రస్తుత వాస్తవికత. ఈ పరమసత్యంతో సహజీవనం సాధ్యం కాదు కాబట్టి, ఎండమావులను, ఆశాపాశాలను మనుగడకు ఆధారం చేసుకోవడం ఒక అవసరం. ఆశ తప్పేమీ కాదు. భ్రమ భగ్నమయినా నిరాశపడడమూ తప్పు కాదు. ఎప్పటికప్పుడు క్షీణించిపోయే విలువల మధ్య, ఉన్నంతలో మెరుగైన, నయమైన వాటిని ఆసరా చేసుకుని, ఆ మాత్రానికే ఒక విప్లవం చేసినంత లేదా చూసినంత సంబరపడడం మన అవసరం, మన ప్రారబ్ధం కూడా.



మన వాస్తవికత ఎంత అధోగతిలో ఉన్నదో, మన ఊహలు అంతగా పాతాళంలో ఊరేగుతాయి. బహుశా మిథ్య లాంటి అధికారమార్పిడుల మధ్య నుంచి, భ్రమాన్విత మహా పరిణామాల మధ్య నుంచి, ప్రతిరూపాల్లాంటి నాయకప్రతినాయకుల మధ్య నుంచి సన్నటి దారులను పరచుకుని భవిష్యత్తు ప్రయాణిస్తుందేమో!


తెల్లవారే నిద్రలేచి, టీవీకి కళ్లు అతికించుకుని కూచోవడం ఎందుకు? ట్రంపు కాదు, బైడెన్‌ దూకుడు మీద ఉన్నాడనేసరికి, ఉత్సాహం వేసి, మళ్లీ అది ఎంతవరకు నిజమో సందేహం కలిగి, బీబీసీ సీఎన్‌ఎన్‌ ఫాక్సు తిరగేసి, పరవాలేదు, కాసేపు ఆశపడవచ్చు అని సంబరపడడం ఎందుకు? ఏదో ఆనందం, ఏదో మారుతోంది. ఫేవరేట్‌ టీమ్‌ గెలుస్తోంది, అంతే. ఎందుకు ఆ టీముపై అభిమానం? ఇంకా రాలేదు, ఇంతా చేసి రాకనూ పోవచ్చును కానీ, ఏమి మారేను ఏమి మారేను బైడెను వస్తే? బరాక్‌ ఒబామా గెలిచినప్పుడు కూడా ఇటువంటి వైరాగ్యంలోకే వెళ్లాము. అంచనాలకు తగ్గట్టుగానే ఆయన రోజులు గడిపేశాడు. అద్భుతాలేమీ చేయలేకపోయాడు. ఆరోగ్యసేవల బీమావ్యాపారుల ముందు చతికిలపడిపోయాడు. అయినా, సముద్రాల మీద యుద్ధనౌకలకేమీ విరామం ఇవ్వలేదు. కొత్త కొత్త ‘ధూర్త’ నేతలను వేటాడడమూ ఆపలేదు. డ్రోన్‌ల వీరవిహారానికి అడ్డూ ఆపూ లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఇరాన్‌తో యుద్ధం రాకుండా అతి కష్టం మీద ఆపగలిగాడు కానీ, పశ్చిమాసియాను పలహారం చేస్తూనే ఉన్నాడు. బైడెను కూడా అంతే. ఈ ప్రపంచాన్ని అమెరికాకు అనువుగా మెరుగైన ప్రపంచంగా చేయడానికి ఏమేమి చేయాలో అదంతా చేస్తూనే ఉంటాడు. అట్లా చేయవలసి వస్తుంది. ఈ కాడికి, బైడెన్‌ వస్తే బాగుండని ఆశించనేల, ట్రంపు మళ్లీ గెలుస్తాడేమోనని కంపించనేల? 


ట్రంపు ఏమిచేశాడంటే, దుర్మార్గానికి ఉన్న సూచికలన్నిటినీ బద్దలు కొట్టేశాడు. ప్రతినాయకుడా, విదూషకుడా, అహంభావియా, హింసోన్మాదియా, ఏదో ఒకటా లేక అన్నీయా అని ఆ వ్యక్తిత్వాన్ని పోల్చుకోలేకపోయాము. తనకు ఓటు వేశామని చెప్పుకోవడానికే సిగ్గుపడే ‘‘షైవోటర్ల’’ ను తయారుచేశాడతను. మానవ ప్రకృతిలోను, రాజకీయ వికృతిలోనూ అతను ఒక నూతన ప్రమాణం సృష్టించాడు. జనకంటకులు పుట్టినప్పుడే లోకంలో హాహా కారాలు ఆర్తరావాలూ వినిపించాయని పురాణాలు రాశాయి. అట్లాగే, మొదటిసారి అతను గెలుపొందాడన్న వార్త విన్న వెంటనే అమెరికన్‌ ఓటర్లు హతాశులై భూకంప బాధితుల వలె వీధుల్లోకి పరిగెత్తారు. అతను, అతని వంటి వారూ అనేకమంది దాదాపుగా ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా ఉద్భవిల్లడం కొవిడ్‌ కంటె ముందే తలెత్తిన ఉత్పాతం. అంతటి వాడు అమెరికాలోనూ, ప్రపంచంలోనూ కలిగించిన తీవ్ర భయోత్పాతం నుంచి బైడన్‌ మీద మనసు కలిగింది–జార్జి బుష్‌ జూనియర్‌ను రెండుసార్లు భరించిన తరువాత ఒబామా మీద కలిగినట్టు. 


ఏమి చేస్తాం? భ్రమో, ఆశో లేకపోతే ఉండలేము కదా? వాడు యుద్ధం మొదలుపెట్టాడు కదా, వీడు విరమించడమన్నా మొదలుపెట్టకపోతాడా? వాడు వంద బాంబులేశాడు కదా, వీడు తొంబైతొమ్మిదితోనే సరిపెడతాడేమో? అబద్ధాలు తగ్గిస్తాడా? పోనీ, పచ్చి అబద్ధాలు ఆడకుండా ఉంటాడేమో? ఆయుధాలు ఎలాగూ కొనకతప్పదు, కనీసం ఒక నాలుగు వీసాలు ఎక్కువ ఇవ్వకపోతాడా? వలసజీవుల మీద ద్వేషం చిటికెడంత తగ్గించకపోతాడా? కనీసపు కోరికలే కదా ప్రపంచానికీ ప్రజలకీ ఉండేది? రోజుకొక్క మనిషిని తిని కడుపునింపుకొమ్మని బకాసురుడిని బతిమాలే ఏకచక్రపురమే కదా లోకమంతా? నేతల మార్పిడితో తలరాతలు మారకపోయినా, భుజం మార్చుకున్నంత ఊరట, కొనప్రాణానికి కొత్తఊపిరి అందినంత ఆసరా. ఆ కాస్త తెరిపి కోసమే కదా, వేటు వేసినంత కసిగా ఓటు వేస్తారు! 


బైడెన్‌ వచ్చినా మరెవరు వచ్చినా మారేదేమీ లేదని ముందే తెలియడం ఒక జ్ఞానం. ఆ జ్ఞానం బహు దుఃఖదాయకం. మనశ్శాంతి ఉండదు. ప్రపంచం మరింత మరింతగా దుఃఖంలోకి దుర్మార్గంలోకి కూరుకుపోతున్నదని, అందుకు కారకులైనవారి చేతికే పగ్గాలు లేని పరమాధికారం లభిస్తూ ఉంటుందని మనకు తెలిసిపోవడం చాలా విషాదం. అప్పుడిక తక్కువ హింస కోసం, తక్కువ దుర్మార్గం కోసం మాత్రమే ప్రయత్నించగలం, నిరీక్షించగలం. విముక్తి కోసం కాదు. రాహుల్‌ మాటల్లో మార్దవం కనిపించి, ఆశకలిగిస్తుంది. రాకుమారుడి వైరాగ్యం మనకే విసుగుపుట్టిస్తుంది. తేజస్వి యాదవ్‌ గెలిచేసి, అద్భుతం జరిగితే సంతోషించాలనిపిస్తుంది. పినరాయి విజయన్‌లో ప్రత్యామ్నాయ పాలన కనిపిస్తుంది. ఫాసిజం రాకుండా కెసిఆర్‌ కాపాడగలడని సిద్ధాంతం చేయబుద్ధేస్తుంది. ఇంతకాలమైంది కదా ఇక బెయిల్‌ వస్తుందనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఉంది కదా వేచిచూద్దామనిపిస్తుంది. ఏదో ఒక నమ్మకాన్ని ఆసరా చేసుకుని ఉనికి అర్థం కల్పించుకుంటాము. ఏమీ చేయలేని, చేయడానికి వీలులేని కట్టడి కాలంలో, ఆశ పూచికపుల్ల లాగా వరదలో తేలిపోతూ ఉంటుంది. కుక్కతోక పట్టుకుని గోదావరి దాటుతూ ఉంటుంది. మన వాస్తవికత ఎంత అధోగతిలో ఉన్నదో, మన ఊహలు అంతగా పాతాళంలో ఊరేగుతాయి. బహుశా మిథ్య లాంటి అధికారమార్పిడుల మధ్య నుంచి, భ్రమాన్విత మహా పరిణామాల మధ్య నుంచి, ప్రతిరూపాల్లాంటి నాయకప్రతినాయకుల మధ్య నుంచి సన్నటి దారులను పరచుకుని భవిష్యత్తు ప్రయాణిస్తుందేమో!


అర్ణబ్‌ గోస్వామిని అరెస్టు చేసినప్పుడు, అయ్యో పాపం అనిపించాలా, అదేమి అన్యాయం అనిపించాలా, తిక్కకుదిరిందని సంతోషించాలా? ప్రతి పెరుగుడుకు ఒక విరుగుడు ఉంటుందనుకోవాలా? ఎంత కాదన్నా జర్నలిస్టు కదా, అట్లా అరెస్టు చేయవచ్చునా? అతన్ని అరెస్టు చేసిన ప్రభుత్వం మాత్రం చొక్కమైనదా? – ఇన్ని ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు ఆ వార్త చుట్టూ ముసురుకుంటాయి. భావప్రకటనా స్వేచ్ఛ ఉండాలి, పాత్రికేయులు ఎవరైనా తిరుగులేని స్వేచ్ఛనే కోరుకుంటారు. దేశంలోని అనేకమంది స్వేచ్ఛను ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తూ వచ్చిన అర్ణబ్‌ గోస్వామికి కూడా స్వేచ్ఛ ఉండడమే న్యాయం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున అరెస్టు కావడం అర్ణబ్‌కు కొంత అన్యాయమే. ప్రచారం తగినంత దొరకలేదు. కానీ, బుధవారం నాడు కేంద్ర హోంమంత్రి, సమాచార మంత్రి ప్రజాస్వామ్యం గురించి, అక్రమ వేధింపుల గురించి మాట్లాడవలసి వచ్చింది. ఆ ప్రకటన ఇచ్చిన సమయానికి వారిలో ప్రజాస్వామిక తత్వం తటిల్లున మెరిసి మాయమై ఉండాలి. గోస్వామి అరుపులకు, కేకలకు అడ్డుకట్ట వేసేవారు లేరా, రియా చక్రవర్తి అనే యువనటిని వేధించడమే ఉద్యమంగా సాగిస్తున్న ప్రసారాలను ఎవరూ ఆపలేరా? అన్న నిస్పృహ ఒకప్పుడు వ్యాపించింది. గోస్వామి గురి తన మీద ఉండడంతో, మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం రంగంలోకి దిగింది. అర్ణబ్‌ సంగతి పక్కనబెడితే, రకరకాల రంగాలలో బిజెపి ప్రభుత్వం చేస్తున్న జైత్రయాత్రను శివసేన ఎదుర్కొనడం ఒక వైచిత్రి. మమతా బెనర్జీకి మించి పరాక్రమించడం ఇంకా విశేషం. చిమ్మచీకటిలో శివసేనను ఒక వెలుగుగా భావించవలసి రావడం ఒక ఆభాస. తక్కువ దుష్టులే తప్ప శిష్టులంటూ ఎవరూ లేరని ముందే అనుకున్నాము కదా? 


నిప్పు రవ్వ దావానలమవుతుందని, అన్యాయం ఎప్పటికైనా కూలిపోతుందని, సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని వినిపించే మాటలు నమ్మేవాళ్లు నమ్మవచ్చు. కానీ, బలమైనవి, నిర్దాక్షిణ్యమైనవి మాత్రమే గెలుస్తాయన్నది ప్రస్తుత వాస్తవికత. ఈ పరమసత్యంతో సహజీవనం సాధ్యం కాదు కాబట్టి, ఎండమావులను, ఆశాపాశాలను మనుగడకు ఆధారం చేసుకోవడం ఒక అవసరం. ఆశ తప్పేమీ కాదు. భ్రమ భగ్నమయినా నిరాశపడడమూ తప్పు కాదు. ఎప్పటికప్పుడు క్షీణించిపోయే విలువల మధ్య, ఉన్నంతలో మెరుగైన, నయమైన వాటిని ఆసరా చేసుకుని, ఆ మాత్రానికే ఒక విప్లవం చేసినంత లేదా చూసినంత సంబరపడడం మన అవసరం, మన ప్రారబ్ధం కూడా.




కె. శ్రీనివాస్


Updated Date - 2020-11-05T07:06:44+05:30 IST