Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఈశాన్యంలో ఆశ

twitter-iconwatsapp-iconfb-icon

ఈశాన్యంలో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (అఫ్‌స్పా) పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కుదిస్తూ కేంద్రప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. నాగాలాండ్, మణిపూర్, అసోం రాష్ట్రాల్లోని పలు జిల్లాలను ‘కల్లోలిత ప్రాంతాల’ జాబితానుంచి తొలగిస్తున్నట్టు హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఈశాన్యవాసులకు కాస్తంత ఊరటనిస్తుంది. పరిస్థితులు మెరుగుపడటంతో అఫ్‌స్పా పరిధిలోకి వచ్చే ప్రాంతాలను ఇలా కుదించగలుగుతున్నామనీ, నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తదేకదీక్షతో చేపట్టిన చర్యలు ఇందుకు కారణమని అమిత్ షా ఓ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.


నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో మూడునెలల క్రితం పద్నాలుగుమంది కార్మికులను ఆర్మీ కాల్చిచంపిన ఘటన ఈశాన్యాన్ని ఎంతో రగిలించింది. పనిముగించుకొని ఒకే వాహనంలో ఇళ్ళకుపోతున్న ఆ అమాయక కార్మికులు హఠాత్తుగా ప్రత్యక్షమైన సైనికులను చూసి భయంతో వొణికిపోయారు. వాహనం అపమనగానే ఆపనందుకు ఆ సైనికులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారిపైన బుల్లెట్ల వర్షం కురిపించారు. ఏ ఆయుధమూ చేతిలో లేని కార్మికులకూ సాయుధ తీవ్రవాదులకూ మధ్య తేడా తెలియని స్థితిలో సైన్యం ఉందని అనుకోలేం. పైగా, ఆ పాతకాలం నాటి వాహనంలో ఉన్న ఆ నిరాయుధులు కేవలం భయంతో సైనికులను దాటిపోయారే తప్ప, దాడిచేయలేదు. ఆ తరువాత మృతదేహాలను మాయం చేయడానికీ, బంధువులను భయపెట్టడానికీ సైన్యం ఎంతో కష్టపడింది. ఈ భయానకమైన ఘటన అఫ్‌స్పా ఎత్తివేత డిమాండ్‌ను మరోమారు మరింత బలంగా ముందుకు తెచ్చింది. కేంద్రప్రభుత్వ కమిటీ ఒకటి చేసిన సూచనలమేరకు నాగాలాండ్‌లోని పలుప్రాంతాలనుంచి దశలవారీగా అఫ్‌స్పా ఎత్తివేయాలని హోంశాఖ నిర్ణయించుకుంది. 1995 నుంచి అఫ్‌స్పా అమల్లో ఉన్న నాగాలాండ్‌లో  ఇప్పుడు ఏడు జిల్లాల్లోని పదిహేను ప్రాంతాలు ఈ చట్టం పరిధినుంచి బయటపడబోతున్నాయి. 1990నుంచి అఫ్‌స్పా అమల్లో ఉన్న అసోంలో ఏకంగా 23జిల్లాలు బయటపడుతున్నాయి. మణిపూర్‌లో ఆరుజిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ అమానుషచట్టంనుంచి విముక్తమవుతున్నాయి.


ఈశాన్యంలో తీవ్రవాదాన్నీ, తిరుగుబాట్లనూ అణిచివేయడానికి తమ ప్రభుత్వం ఎంతో చేసిందని ఈ సందర్భంగా హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు సముచితమైనవే. గత మూడేళ్ళలో ప్రభుత్వం పలు ఒప్పందాలతో ఈశాన్యంలో శాంతికి విశేష కృషి చేసిందంటూ 2020 బోడో ఒప్పందం మొదలుకొని మొన్న మార్చి 29న అసోం- మేఘాలయ మధ్యన కుదిరిన సరిహద్దు ఒప్పందంవరకూ హోంశాఖ పలు వివరాలు ఉటంకించింది. ఈశాన్యంలో పలురాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలున్న నేపథ్యంలో అసోం మేఘాలయ చొరవ అభినందించదగింది. సరిహద్దు వివాదాలే కాక, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఒక ప్రాంతంకోసం పోరాటాలు ఈశాన్యంలో ఎక్కువ. అసోం నుంచి 1972లో వేరుపడ్డ మేఘాలయ కొన్ని ప్రాంతాల కోసం సర్వోన్నత న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య 885 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దాదాపు పన్నెండు ప్రాంతాలు వివాదాస్పదమైనవి. ఇప్పుడు సగం ప్రాంతాలకు సంబంధించి రాజీకుదిరినప్పటికీ, మొత్తం సరిహద్దులో అది 70శాతం కావడమంటే మంచి అడుగే. మిగిలిన ముప్పైశాతంలోని 36చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇంకా వివాదపరిష్కారం కోసం ఎదురుచూస్తోంది. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అసోం ఉదారంగా వ్యవహరించడంతో ఈ ఒప్పందం సాధ్యపడిందని అంటున్నారు. చైనా, మయన్మార్, బంగ్లాదేశ్‌లతో సరిహద్దులు పంచుకొనే ఈశాన్య రాష్ట్రాలు ఏ కారణంగా రగిలినా దేశభద్రతకు ప్రమాదమే. అస్థిరతలు, ఘర్షణలు మిలిటెంట్ సంస్థలకు మరింత ఊతాన్నిస్తాయి కనుక పరస్పర సహకారంతో, ఇచ్చిపుచ్చుకొనే వైఖరితో వివాదాల పరిష్కారానికి అవి కలసికట్టుగా కృషిచేయడం దేశప్రయోజనాల రీత్యా అవసరం. ఇటీవల మణిపూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా ఆ రాష్ట్ర ప్రజలకు ఒక విషయాన్ని గుర్తుచేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో మణిపూర్ పలుమార్లు రహదారుల ఆక్రమణలు, ఆర్థిక దిగ్బంధాలనూ చవిచూసిందనీ, కానీ తమపాలనలో ఒక్కమారు కూడా అలా జరగలేదని అన్నారు. కానీ, బిరేన్ సింగ్ ప్రభుత్వం విస్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి తిరిగివచ్చిన రోజునుంచి పదిరోజుల పాటు నాగాలకు చెందిన ఒక సంస్థ అసోం మణిపూర్ రహదారిని ఆక్రమించి ఆర్థికదిగ్బంధనానికి పాల్పడింది. అమిత్ షా ఈశాన్యంలో చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నది వాస్తవం.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.