కారుచీకట్లో కాంతిపుంజాలు

ABN , First Publish Date - 2020-06-12T07:56:23+05:30 IST

ఆ దేశం.. ఈ దేశం.. అనే తేడా లేదు! ఆ జాతి.. ఈ జాతి.. అన్న భేదం లేదు!! ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని జాతుల ప్రజలకూ సోకుతూ లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటున్న కొవిడ్‌-19కు ముగిం పు ఎప్పుడు? అందుకు ఉన్న అ వకాశాలు రెండే రెండు. ఒకటి.. వ్యాక్సిన్‌, రెండు సమూహ రోగనిరోధక శక్తి...

కారుచీకట్లో కాంతిపుంజాలు

  • పురోగతి దశలో 10 కరోనా వ్యాక్సిన్లు
  • కొన్నిటితో మానవులపై ప్రయోగాలూ మొదలు
  • జూలైలో మోడెర్నా చివరిదశ ప్రయోగాలు
  • యాంటీబాడీ ఔషధాల రూపకల్పనకు కృషి

న్యూయార్క్‌, జూన్‌ 11: ఆ దేశం.. ఈ దేశం.. అనే తేడా లేదు! ఆ జాతి.. ఈ జాతి.. అన్న భేదం లేదు!! ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని జాతుల ప్రజలకూ సోకుతూ లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటున్న కొవిడ్‌-19కు ముగిం పు ఎప్పుడు? అందుకు ఉన్న అ వకాశాలు రెండే రెండు. ఒకటి.. వ్యాక్సిన్‌, రెండు సమూహ రోగనిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ). సమూహ రోగనిరోధక శక్తి గురించి ఇప్ప ట్లో ఆలోచించే అవకాశం లేదు. ఇక ఆశలన్నీ వ్యాక్సిన్‌ పైనే. చైనా నుంచి ఇతర దేశాలకు పాకడం ప్రారంభించినప్పుడే దీనికి వ్యాక్సిన్‌ తయారుచేసేందుకు వివిధ దేశాలు, వివిధ పరిశోధన సంస్థలకు చెందిన 150 బృందాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేయగా.. కేవలం 10 మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరాయి. అవేంటంటే..


జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌

సాధారణంగా జలుబు చేయడానికి కారణమైన ఎడినో వైరస్‌ ఆధారంగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ ఒక వ్యాక్సిన్‌ను రూపొందించింది. దీన్ని వచ్చే నెలలో.. మానవులపై ప్రయోగించనున్నారు.(హ్యూమన్‌ ట్రయల్స్‌). ఇందుకోసం ఇప్పటికే అమెరికా, బెల్జియం దేశాలకు చెందిన 1054 మం దిని ఎంపిక చేశారు. అందులో వృద్ధులు, యువతీయువకులు ఉన్నారు. ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న సమయం కన్నా రెండు నెలల ముందే క్లినికల్‌ ట్రయల్స్‌ ముగించుకుని.. హ్యూమన్‌ ట్రయల్స్‌ దిశగా సాగడం గమనార్హం. 


లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌

కరోనాకు అత్యంత చౌక ధరలో వ్యాక్సిన్‌ తెచ్చేదిశగా లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ శాస్త్రజ్ఞులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వాణిజ్య సంస్థలతో కాకుండా వ్యాక్‌ ఈక్విటీ గ్లోబల్‌ హెల్త్‌ అనే సోషల్‌ ఎంటర్‌ప్రైజ్‌తో కలిసి ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నారు. మనిషి శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్‌ ఉపరితలంపై స్పైక్‌ ప్రొటీన్‌ తయారయ్యేలా చేసే వ్యాక్సిన్‌ ఇది. దీంతో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వెంటనే అప్రమత్తమై వైర్‌సకు యాంటీబాడీలను తయారుచేస్తుంది. వచ్చే సోమవారం (జూన్‌ 15) నుంచి 300 మందితో హ్యూమన్‌ ట్రయల్స్‌ ప్రారంభించనున్నారు. 


చైనాలో ఐదు వ్యాక్సిన్లు

కరోనా వైర్‌సకు పుట్టిల్లయిన చైనాలో అందరికన్నా ముందు నుంచే వ్యాక్సిన్‌ తయారీకి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అక్కడ మొత్తం ఐదు వ్యాక్సిన్‌ కేండిడేట్లను పరీక్షిస్తుండగా.. వాటిలో ఒకటి రెండో దశ ట్రయల్స్‌కు చేరుకుంది. అత్యవసర పరిస్థితుల్లో 2020 డిసెంబరు నాటికి దాన్ని ఉపయోగించవచ్చని సమాచారం. బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయలాజికల్‌ ప్రొడక్ట్స్‌, వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయలాజికల్‌ ప్రోడక్ట్స్‌ కలిసి రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే 2000 మంది ప్రజలపై ప్రయోగించారు.


సినోవాక్‌వారి.. ‘కరోనా వాక్‌’

చైనా ప్రముఖ ఫార్మా సంస్థ సినోవాక్‌.. తాను తయారుచేసే వ్యాక్సిన్‌ కొవిడ్‌-19ను 99శాతం సమర్థంగా అడ్డుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్‌ను కోతులపై ప్రయోగించగా.. వాటిని రక్షించే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు గమనించారు. కోతుల కు వైరస్‌సోకినా.. ఆ యాంటీబాడీల వల్ల ఇన్ఫెక్షన్‌ రాలేదు. 


మోడెర్నా.. మొదటి దశ పూర్తి

అమెరికాకు చెందిన సుప్రసిద్ధ మోడెర్నా ఇన్‌ కార్పొరేషన్‌ ‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’ అనే వ్యాక్సిన్‌ కేండిడేట్‌తో సక్సెస్‌గా తొలిదశ ప్రయోగాలను నిర్వహించింది. ప్రస్తు తం మధ్య దశ ప్రయోగాలను చేస్తోంది. జూలైలో 6000 మందితో చివరి దశ ప్రయోగాలను ప్రారంభించినుంది. మార్చిలో ఈ సంస్థ నిర్వహించిన ప్రయోగాల్లో భాగంగా 45 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా.. వారిలో 8 మంది శరీరాల్లోకరోనాను నిరోధించే రక్షణాత్మక యాంటీబాడీలు తయారయ్యాయి.


3 నెలల్లో.. ఏజెడ్‌డీ1222

కేవలం మూడంటే మూడే నెలల్లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ను భారీగా ఉత్పత్తి చేసేందుకు.. యూకేకు చెందిన ఔషధ రంగ దిగ్గజం ఆస్ట్రాజెనెకా.. అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సె్‌సతో చేతులు కలిపేందుకు కృషిచేస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ తయారుచేసిన వ్యాక్సిన్‌ కేండిడేట్‌ను ‘ఏజెడ్‌డీ1222’గా వ్యవహరిస్తున్నారు. సాధారణ జలుబు కలిగించే  వైర్‌సకు, కొవిడ్‌-19లోని స్పైక్‌ ప్రొటీన్‌ను జోడించడం ద్వారా వారు ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు.


మరికొన్ని మందులు!

కరోనాపై పోరులో ఇప్పటికే చాలా దేశాల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌ వంటివాటిని వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఆరోగ్య పరిస్థితి విషమించిన పేషెంట్లకు రెమ్డెసివిర్‌ ఔషధాన్ని ఇచ్చేందుకు ఎఫ్‌డీఏ కూడా అనుమతిచ్చింది. కరోనాను అద్భుతంగా కట్టడి చేసిన తైవాన్‌ కూడా.. రెమ్డెసివిర్‌ వాడకానికే మొగ్గు చూపింది. మన దేశంలో కూడా విషమించిన కేసుల్లో ఈ మందును ఇస్తున్నారు. తాజాగా.. సెప్సిస్‌ (తీవ్ర ఇన్ఫెక్షన్‌తో రక్తం విషపూరితం అయిపోవడం) సమస్యకు వాడే యూలినస్టాటిన్‌ మందును రోగులకు ఇచ్చేందుకు.. భారత్‌ సీరమ్స్‌ అండ్‌ వ్యాక్సిన్స్‌ లిమిటెడ్‌కు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. సివియర్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌తో (ఊపిరితిత్తుల్లోని గాలితిత్తులు ద్రవాలతో నిండిపోవడం వల్ల తగినంత ఆక్సిజన్‌ లభించని పరిస్థితి) బాధపడేవారికి ఈ ఔషధాన్ని ప్రయోగాత్మకంగా ఇవ్వనున్నారు. అలాగే.. తీవ్రస్థాయి రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ బాధితులకు ఇచ్చే బారిసిటినిబ్‌ ఔషధాన్ని కొవిడ్‌ రోగులపై ప్రయోగించవచ్చని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 


ఎలీ లిల్లీ యాంటీబాడీ చికిత్స

దిగ్గజ ఔషధ సంస్థ ఎలీ లిల్లీ మూడు యాంటీబాడీస్‌ చికిత్సలను పరీక్షిస్తోంది. వాటిలో రెండు రకాల చికిత్సలకు సంబంధించి ఇప్పటికే హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా నిర్వహించింది. మూడో చికిత్సమరికొద్దివారాల్లో ట్రయల్స్‌ దశకు రానుంది. సెప్టెంబరు నాటికి ఆ పరీక్షలన్నీ పూర్తయి.. ఔషధం అందుబాటులోకి రావొచ్చని అంచనా. ఎలీ లీల్లీ నిర్వహిస్తున్న 3 రకాల యాంటీబాడీస్‌ చికిత్సల్లో వాడుతున్నవి.. కేన్సర్‌, రు మటాయిడ్‌ ఆర్థరైటిస్‌  చికిత్సలో ఉపయోగించే బయోటెక్‌ ఔషధాలు(మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌). కరోనా వైరస్‌.. మా నవ కణాల్లోకి చొచ్చుకెళ్లడానికి ఉపయోగించే స్పైక్‌ ప్రొటీన్‌ను అవి అడ్డుకుంటాయి. తద్వారా వైరస్‌ పెరగలేని పరిస్థితి ఏర్పడుతుంది.


Updated Date - 2020-06-12T07:56:23+05:30 IST