హనీ ట్రాప్‌

ABN , First Publish Date - 2022-10-07T05:28:49+05:30 IST

సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు.

హనీ ట్రాప్‌
జిల్లా ఎస్పీ అన్బురాజన్‌

సైబర్‌ నేరగాళ్ల సరికొత్త మోసం

విద్యార్థులు, ఉద్యోగులే టార్గెట్‌

న్యూడ్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌


కడప (క్రైం), అక్టోబరు 6: సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మనుషుల బలహీనతలను, ఆశనే పెట్టుబడిగా పెట్టి మహిళల పేరుతో ‘హనీ ట్రాప్‌’ సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో విద్యార్థులు, ఉద్యోగులనే సైబర్‌ మోసగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు. సైబర్‌ మోసగాళ్ల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సూచించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వాట్స్‌పలో, ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వీడియో కాల్‌ చే స్తూ.. అవతలి వ్యక్తి ఫోన్‌ ఎత్తగానే స్ర్కీన్‌పై పోర్న్‌ వీడియోలు లేదం టే నగ్న దృశ్యాలను పంపిస్తారు. ఇదేదో బాగుందని సదరు వ్యక్తి ఆ దృశ్యాలను చూస్తుంటారు.. అయితే ఆ దృశ్యాలను చూస్తున్నంత సేపు ఫోన్‌ చేసిన వ్యక్తి స్ర్కీన్‌ రికార్డు కానీ లేదా స్ర్కీన్‌ షాట్‌ కానీ చేసి, కాల్‌ కట్‌ చేసిన తరువాత మళ్లీ అదే వ్యక్తికి రికార్డింగ్‌ పంపి డబ్బులు కావాలని బెదిరిస్తుంటారు. లేదంటే నగ్న దృశ్యాలు, వీడియోలు తమ తమ బంధువులకు పంపిస్తామని బెదిరిస్తారు. తాము మోసపోయామనే విషయాన్ని ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందని కొందరు ప్రాణాలు సైతం విడుస్తున్నారని, మరికొందరు మోసగాళ్లు డిమాండ్‌ చేసే డబ్బులు ఇవ్వడంతో పాటు పరువు కూడా కోల్పోతూ మానసికంగా కుమిలిపోతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ హనీ ట్రాప్‌ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా హనీ ట్రాప్‌ ఉచ్చులో పడకుండా ఉండేందుకు తగు సలహాలు, సూచనలు అందించారు.

సోషల్‌ మీడియాలో తెలియని వ్యక్తులతో స్నేహం చేయరాదు

తెలియని వ్యక్తులతో చాట్‌ చేయవద్దు... లేదా వీడియో కాల్‌ అసలు చేయవద్దు

సైబర్‌ నేరస్తులు మీ వీడియో కాల్‌ను రికార్డు చేస్తుంటారనే విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాకుండా మీ ఫొటో నగ్నంగా కనిపించడానికి మార్ఫింగ్‌ చేయవచ్చు.

ఒకవేళ మీరు హనీ ట్రాప్‌ ఉచ్చులో పడినట్లయితే సైబర్‌ నేరగాళ్ల డిమాండ్లను అంగీకరించవద్దు.. డబ్బులు కూడా ఇవ్వవద్దు, వారి బెదిరింపులకు గురి కావద్దు.

పదే పదే బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు వస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. లేదా హెల్ఫ్‌లైన్‌ నెంబరు 1930కు కాల్‌ చేయాలి. లేదా నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సీఐబీఈఆర్‌సీఆర్‌ఐఎంఈ.జీవోవి.ఇన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. 

Updated Date - 2022-10-07T05:28:49+05:30 IST