కడదాకా చెక్కుచెదరని నిజాయితీ

ABN , First Publish Date - 2022-08-02T06:01:34+05:30 IST

ఈరోజుల్లో ఒకసారి ప్రజాప్రతినిధిగా చేస్తే తరగని ఆస్తులు కూడబెడుతున్న నేతలను చూస్తున్నాం. పదవుల్లో ఉన్నవారి వారసులు సైతం కోట్లకు పడగలెత్తుతున్నారు...

కడదాకా చెక్కుచెదరని నిజాయితీ

ఈరోజుల్లో ఒకసారి ప్రజాప్రతినిధిగా చేస్తే తరగని ఆస్తులు కూడబెడుతున్న నేతలను చూస్తున్నాం. పదవుల్లో ఉన్నవారి వారసులు సైతం కోట్లకు పడగలెత్తుతున్నారు. దీనికి భిన్నంగా ఉమ్మడి రాష్ట్రంలో మూడుసార్లు ఎమ్మెల్యేగాను, రెండుసార్లు కాబినెట్‌ మంత్రిగానూ చేసిన జెఆర్‌ పుష్పరాజ్‌ సొంత ఇల్లు, కారు లేకుండా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. ఏడాదిగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుష్పరాజ్‌ జూలై 28న గుంటూరులో మృతి చెందారు.


1972లో జై ఆంధ్ర ఉద్యమంలో పుష్పరాజ్‌ ఏసీ కాలేజి విద్యార్థిగా ఉన్నారు. చదువుకుంటూ జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాడని పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు. రేపల్లె స్టేషనులో ఉంచి చితకబాదారు. ఆ సందర్భంలో పుష్పరాజ్‌ నాకు పరిచయమయ్యారు. తరువాత నాగార్జున యూనివవర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. అప్పట్లో యూనివర్శిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాతోపాటు స్వతంత్రపార్టీ, భారతీయ లోక్‌దళ్‌ (బిఎల్‌డి), జనత, లోక్‌దళ్‌, టీడీపీలో కొనసాగారు. 1982లో టీడీపీ ఆవిర్భావ సమయంలో నాతోపాటు ఎన్టీఆర్‌ వెంట నడిచారు. 1983లో తాడికొండ ఎస్సీ రిజర్వుడు సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో నేను పోటీ చేయలేదు. మీరు లేకుండా నేను అసెంబ్లీకి పోటీచేయనని, నాకు ఈ బీ ఫారం వద్దని చించివేయబోయాడు. నేను పార్లమెంటుకు పోటీచేస్తాను, అసెంబ్లీకి వద్దంటూ సముదాయించి ఎన్నికల్లో పోటీ చేయించాం. 1983లో గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేల్లో పుష్పరాజ్‌ అందరికంటే చిన్నవాడు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత పుష్పరాజ్‌ను ఎన్టీఆర్ బాగా ప్రోత్సహించారు. అప్పట్లో పుష్పరాజ్‌ బాగా దూకుడుగా ఉండేవాడు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నెక్కల్లు గ్రామంలో పేదలకు మంగళగిరి తాశీల్దార్‌ ఇళ్ళస్థలాల పట్టాలిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రొటోకాల్‌ నిబంధనలు పాటించకుండా తాశీల్దార్‌ స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో పట్టాలు పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్పరాజ్‌ తాశీల్దారుపై దాడి చేశారు. దీనిపై తాశీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పుష్పరాజ్‌పై కేసు నమోదైంది. ఇది అప్పట్లో రాష్ట్ర స్థాయిలో పెద్దగొడవగా మారింది. సాయంత్రం తాశీల్దారుపై దాడిచేసిన తరువాత ఆర్టీసీ బస్సులో హైదరాబాదు వచ్చాడు. నేను హైదరాబాదులోని సరోవర్‌ హోటల్‌లో ఉన్నాను. అర్ధరాత్రి వచ్చి తాశీల్దారుపై దాడిచేసానని చెప్పాడు. ఈ విషయం ఎన్టీఆర్ దృష్టికి తెచ్చాం. ఎన్టీఆర్‌తో ‘పట్టాలిస్తే మీరు ఇవ్వాలి. లేదంటే మీ ప్రతినిధిగా స్థానిక ఎమ్మెల్యేగా నేను ఇవ్వాలి. కాంగ్రెస్‌ నాయకులు పట్టా లివ్వటంతో దాడిచేయాల్సి వచ్చిందని’ చెప్పాడు. ఎన్టీఆర్ తొందరపడ్డావన్నారు. సమస్యను పరిష్కరించమని ఎన్టీఆర్ నాకు సూచించారు. అప్పట్లో గుంటూరు కన్నావారి తోటలో నాకు ప్రైవేటు ఆసుపత్రి ఉంది. మాచర్ల ఎమ్మెల్యే కొర్రపాటి సుబ్బారావుకు తాశీల్దారు బంధువని తెలిసింది. ఎమ్మెల్యే సుబ్బారావు ద్వారా తాశీల్దారును మా క్లినిక్‌కు పిలిపించి పుష్పరాజ్‌ సమక్షంలోనే సామరస్యంగా పరిష్కరించాం. పార్టీలోనూ ఇద్దరు, ముగ్గురిపై దాడి చేశాడు. బండారు ఐజాక్‌ ప్రభాకర్‌పై దాడి చేసినప్పుడు ఎన్టీఆర్ పుష్పరాజ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆ సమయంలో నేను ఎన్టీఆర్‌తో మాట్లాడి సస్పెన్షన్‌ను ఉపసంహరించేలా చేశాను.


1984 ఆగస్టు నాదెండ్ల సంక్షోభ సమయం. పుష్పరాజ్‌ కర్ణాటక నందిహిల్స్‌ ఎమ్మెల్యే కాంప్‌లో ఉన్నాడు. పుష్పరాజ్‌ తల్లిదండ్రులు భిక్షాలు, జ్ఞానసుందరం గుంటూరు మునిసిపల్‌ స్కూలు టీచర్లుగా ఉన్నారు. నాదెండ్ల భాస్కరరావు మనుషులు పుష్పరాజ్‌ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళారు. మీ కుమారుడిపై తాశీల్దార్‌ కేసును తీసివేస్తాం. మంత్రి పదవి ఇస్తాం. డబ్బు ఇస్తాం. అప్పులుంటే తీర్చుకోండి అంటూ భాస్కరరావు అనుచరులు ప్రతిపాదించారు. పుష్పరాజ్‌ తల్లిదండ్రులు దీనిని తిరస్కరించారు. 1985లో మరలా ఎన్టీఆర్ టికెట్‌ ఇచ్చారు. 1987–88లో క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రిగా ఎన్టీఆర్ క్యాబినెట్‌లో పని చేశారు. 1989లో ఓడిపోయారు. 1994లో తాడికొండ సీటును సీపీఐకి కేటాయించారు. పుష్పరాజ్‌ ఉన్నత విద్యావంతుడని, అందరికంటె చిన్నవాడని ఎన్టీఆర్ మొదటి నుంచి బాగా ప్రోత్సహించారు. నేను, అప్పటి ఒంగోలు లోక్‌సభ సభ్యుడు బెజవాడ పాపిరెడ్డి ఎన్టీఆర్‌‍ను కలిసినప్పుడల్లా పుష్పరాజ్‌ ప్రస్తావన వచ్చేది. అదేవిధంగా పుష్పరాజ్‌ కూడా ఎన్టీఆర్‌ను కలిసినప్పుడల్లా శివాజీకి ఏదో ఒక పదవి ఇవ్వాలని సూచిస్తూ వచ్చాడు.


పుష్పరాజ్‌ సతీమణి మేరి క్రిష్టియానా జడ్‌పి హైస్కూల్‌లో డ్రిల్‌ టీచరుగా ఉద్యోగం చేసేవారు. ఆమెను ఉద్యోగం నుంచి రాజీనామా చేయించాలని పుష్పరాజ్‌ ప్రయత్నించారు. దీనిని విరమించుకోవాలని నేను సలహా ఇచ్చాను. ఒకరు ఉద్యోగంలో లేకపోతే కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంటుందని, రిటైరైన తరువాత ఆమె పెన్షన్ ఆలంబనగా ఉంటుందని నచ్చచెప్పాను. అవినీతి మరకలులేని విధంగా దామోదరం సంజీవయ్య తరహాలో పుష్పరాజ్‌ నిజాయితీకి నిలువుటద్దంగా ఉన్నాడనటంలో అతిశయోక్తికాదు. నాకు తెలిసి సొంత ఇల్లు లేని రాజకీయ నాయకులు చేకూరి కాశయ్య తరువాత పుష్పరాజే.


చివరివరకు పుష్పరాజు నిజాయితీగా ఉన్నారు. తాడికొండ ఎస్సీ రిజర్వు సీటు. అక్కడ ఎవరితోను గొడవలు లేకుండా సామరస్య వాతావరణాన్ని కొనసాగించారు. 1987 మండల, జడ్‌పి ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో టీడీపీకి 12 మండలాలు మాత్రమే వచ్చాయి. జడ్‌పి ఛైర్మనుతో పాటు, 45 మండలాల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. తాడికొండ నియోజకవర్గంలో తుళ్ళూరు, పెదకాకాని మండలాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. తుళ్ళూరులో సామాన్య రైతు యంపరాల నాగేశ్వరరావు, పెదకాకానిలో హేమలత టెక్స్‌టైల్‌ మిల్లు దినసరి కార్మికుడు తాడిబోయిన కోటేశ్వరరావులు ఎంపీపీలుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. టీడీపీలో పనిచేసే కార్యకర్తలకు పుష్పరాజ్‌ ప్రాధాన్యత ఇచ్చారు. పుష్పరాజ్‌ 1983, 85, 89, 99, 2004లో అసెంబ్లీకి పోటీ చేశారు. 1983, 85, 99 సంవత్సరాల్లో గెలుపొందగా, 1989, 2004 సంవత్సరాల్లో ఓడిపోయారు. ఉదయం ఎన్నికల ప్రచారం చేస్తూ సాయంత్రం గుంటూరులో చందాలకోసం వెతుక్కోవాల్సి వచ్చేది. 2001లో మాజీ మంత్రి డాక్టర్‌ ఎమ్.ఎస్.ఎస్. తాడికొండ మండలం తుళ్ళూరు జడ్‌పిటిసిగా పార్టీ టికెట్‌ ఇవ్వాలని కోరారు. నా విజ్ఞప్తి మేరకు పుష్పరాజ్‌ ఖాళీ బీ ఫారాన్ని తెచ్చి ఇచ్చారు. అప్పట్లో జిల్లా నేతలంతా పుష్పరాజ్‌పై ధ్వజమెత్తారు. ‘నీకంటే ముందే డాక్టర్‌ ఎమ్.ఎస్.ఎస్ మంత్రిగా చేశారు. ఆయన జడ్‌పిటిసి అడిగేస్థాయి కాదు. ఇవ్వాల్సిందే’నని నేను పట్టుబట్టటంతో మారు మాట్లాడకుండా డాక్టర్‌ ఎమ్.ఎస్.ఎస్.కు బీ ఫారమ్‌ ఇచ్చారు. ఉన్నత విద్యావంతుడైన పుష్పరాజ్‌ ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిజాయితీని వీడకుండా సొంత ఇల్లు, కారులేకుండా నిబద్ధతతో పని చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి వచ్చే యువత పుష్పరాజ్‌ రాజకీయ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆశిద్దాం.

డాక్టర్‌ యలమంచిలి శివాజీ

రాజ్యసభ మాజీసభ్యుడు

Updated Date - 2022-08-02T06:01:34+05:30 IST