ఇచ్చిన ‘చోటు’కే వెళ్లు..!

ABN , First Publish Date - 2020-06-29T10:18:33+05:30 IST

జిల్లాలో జూలై 8వ తేదీ నాటికి 1,24,378 మంది పేదలకు ఇంటి నివాస స్థలాలు ఇవ్వాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 3,249.81 ఎకరాలు భూమి

ఇచ్చిన ‘చోటు’కే వెళ్లు..!

పట్నాలకు దూరంగా ఇంటి స్థలాలు

కొన్ని పల్లెల్లో పాత పట్టాలు రద్దు.. కొత్తవి జారీ

కడప, ప్రొద్దుటూరులో ప్రైవేటు భూమి అన్వేషణ

బైనపల్లిలో చెరువులో పట్టాలు ఇచ్చేందుకు సన్నాహాలు

రాయచోటిలో దూరంగా పట్టాలు


పేదల ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేశారు. జూలై 8 నాటికి జిల్లాలో 1,24,378 మందికి పట్టాలు పంపిణీ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం భూములు ఉన్నచోటే ఇంటి స్థలాలు ఇస్తాం..! అంటూ పట్టణాలకు దూరంగా సిద్ధం చేస్తున్నారు. కొన్ని చోట్ల పాత పట్టాలు రద్దు చేసి కొత్త పట్టాలు ఇవ్వనున్నారు. బైనపల్లిలో చెరువులో ఇస్తున్న ఇంటి పట్టాలు మాకొద్దని గ్రామస్తులు అంటున్నారు. కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లో ప్రైవేటు భూముల కోసం రెవిన్యూ అధికారులు అన్వేషిస్తున్నారు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): 

జిల్లాలో జూలై 8వ తేదీ నాటికి 1,24,378 మంది పేదలకు ఇంటి నివాస స్థలాలు ఇవ్వాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 3,249.81 ఎకరాలు భూమి అవసరం ఉంది. అందులో 2,654.13 ఎకరాలు ప్రభుత్వ భూమిని గుర్తించారు. మరో 596.68 ఎకరాలు ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది. అందులో 479 ఎకరాలు ఒక్క కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లోనే సేకరించాల్సి ఉంది. ఆ దిశగా రెవిన్యూ యంత్రాంగం అన్వేషణ చేస్తుంది. కాగా ప్రభుత్వంపై ఆర్థికభారం పడకుండా 81.76 శాతం ప్రభుత్వ భూములనే గుర్తించారు. ఇంతవరకు భాగానే ఉన్నా పట్టణాలకు దూరంగా నివాస యోగ్యానికి అనువుగాని భూమును చదును చేసి పట్టాలు ఇస్తున్నారు.. అక్కడ పక్కా ఇళ్లు నిర్మించుకోవడం సాధ్యమా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త పట్టాలు ఇవ్వనున్నారు. 


కడపలో ఇది పరిస్థితి

కడప నగరంలో 25,047 మందికి ఇంటి స్థలాలకు అర్హులుగా గుర్తించారు. 363.76 ఎకరాలు ప్రభుత్వ భూమి గుర్తించారు. కొండ ప్రాంతాన్ని చదును చేసి ప్లాట్లు వేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన 502, 2006-07లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆచారుల కాలనీలో 500 పట్టాలు, వైఎ్‌సఆర్‌ కాలనీలో మరో 500 పట్టాలు, చెర్లోపల్లి దగ్గర గతంలో ఇచ్చిన 1500 పట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పట్టాలు ఇచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. అందరికీ ఇంటి పట్టా ఇవ్వాలంటే మరో 129 ఎకరాలు ప్రైవేటు భూమి కావాలి. ఉక్కాయపల్లి, చలమారెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో ఎకరా రూ.35 లక్షలకు రైతులతో ఓసీ ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. రాజీవ్‌ గృహకల్ప కోసం 2006-07లో 175 ఎకరాలు సేకరించారు. అందులో దాదాపుగా 30 వాటికే పరిహారం చెల్లించినా.. ఇప్పటికీ రైతుల ఆధీనంలో ఉన్న భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. పరిహారం రాని రైతులకు ఎకరాకు రూ.35 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. పాత పట్టాలు రద్దు చేసిన వారికే కొత్తగా పట్టాలు ఇవ్వాలని బాధితులు కొరుతున్నారు. 


పట్టణానికి దూరంగా

రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో 7,588 మందికి ఇంటి స్థలాలు ఇవ్వడానికి 185 ఎకరాలు కావాలి. టౌన్‌ పక్కనే ప్రభుత్వ భూమి లేదు. ప్రైవేటు భూమి సేకరిస్తే ప్రభుత్వంపై భారం పడుతోందని పట్టణానికి దాదాపుగా 5 కి.మీలు రింగ్‌ రోడ్డుకు 2-3 కి.మీల దూరంలో సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లి సమీపంలో కొండ అంచునా ప్రభుత్వ భూమిని గుర్తించి చదును చేసి పట్టాలు వేస్తున్నారు. అయితే 70 ఎకరాలను 30-40 ఏళ్లుగా పేద రైతులు సాగు చేసుకుంటున్నారు. వారికి పట్టా లేదని పరిహారం కూడా ఇవ్వకుండా బలవంతంగా రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎకరాకు రూ.1.50 లక్షలు పరిహారం ఇప్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చినా ఆ దిశగా చర్యలు శూన్యం. పులివెందులలో కూడా రింగ్‌ రోడ్డుకు 3 కి.మీల దూరంలో ఇస్తున్నారు. 


ప్రొద్దుటూరులో అన్వేషణ

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 20 వేల మంది లబ్ధిదారులను గుర్తించారు. 350 ఎకరాలు కావాల్సి ఉంది. ఎక్కడ ప్రభుత్వ భూమి లేదు. కేవలం పట్టణానికి 3 కి.మీల దూరంలో బల్లావరంలో ఎకరా రూ.16 లక్షలు, రామేశ్వరంలో రూ.11 లక్షల ప్రకారం 67.68 ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేశారు. స్థానికంగా పలికే ధర కంటే ఎక్కువ చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే భూసేకరణ చట్టం ప్రకారం స్థానిక ధర కంటే 2.5 శాతం ఎక్కువ చెల్లించామని రెవిన్యూ అధికారులు అంటున్నారు. ఇంకా 282.32 ఎకరాల సేకరణ కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. జూలై 8న ఈ పట్టణవాసులకు భూపట్టాలు పంపిణీ ప్రశ్నార్థకమే..!


చెరువులో ఇంటి పట్టాలా..?

బద్వేలు మండలం బైనపల్లిలో ఇంటి స్థలాలు ఇస్తామంటే గ్రామస్తులు ఆనందించారు. సర్వే నెంబర్‌ 27బి పరిధిలో చెరువు భూమిలో ఇంటి పట్టాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంటే.. ఈ పట్టాలు మాకొద్దు అంటున్నారు. చెరువులో ఇళ్లు కట్టుకుంటే భవిష్యత్తులో ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. రోడ్డు పక్కనే సర్వే నెంబర్లు 22, 113 పరిధిలో ప్రభుత్వ భూముల్లో పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


నియోజకవర్గాల వారీగా గుర్తించిన లబ్ధిదారులు, భూములు (ఎకరాల్లో):

నియోజకవర్గం లబ్ధిదారులు భూములు

కడప 25,047 492.76

కమలాపురం 3,856 135

బద్వేలు 6,956 276.89

ప్రొద్దుటూరు 20,208 350

మైదుకూరు 6,700 209.78

జమ్మలమడుగు 10,057 176.11

రాయచోటి 12,442 274.39

రాజంపేట 8,255 230

రైల్వేకోడూరు 4,523 149

పులివెందుల 12222 122.22


వానొస్తే ముంపే - గంపా సుబ్బరత్నమ్మ, బయనపల్లి గ్రామం, బద్వేలు మండలం

ఏడేళ్లుగా ఈ గ్రామంలో ఉంటున్నాం. ఇంటి స్థలం లేదు.. సొంత ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం ఇంటి పట్టా ఇస్తుంది.. జాబితాలో పేరు ఉందని తెలిసి ఆనందించాను. అయితే రోడ్డుకు 10 అడుగుల లోతులో చెరువులో ఆనుకొని చెరువు స్థలాన్ని కేటాయించారు. వానొస్తే చెరువుకు నీళ్లొచ్చి ఇళ్లు మునిగిపోతాయి. ముంపునకు గురికాని ప్రదేశంలో స్థలాలు ఇచ్చి ఆదుకోవాలి. 


చెరువు లోతట్టులో ఇంటి స్థలమా..? - పందివీటి సుబ్బారెడ్డి, బయనపల్లి గ్రామం 

ఇరవై ఏళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చాను. సొంత ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. జగన్‌ ప్రభుత్వం ఇంటి స్థలం ఇస్తుందంటే సంతోషించాను. సర్వే నెంబరు 27బి పరిధిలో చెరువు లోతట్టు భూములు సర్వే చేసి పట్టాలు వేస్తున్నారు. ఆక్కడ పట్టాలు ఇస్తే భవిష్యత్తులో కాస్త నీళ్లొచ్చినా ముంపునకు గురి అవుతుంది. అక్కడ కాకుండా నివాసయోగ్యమైన చోట ఇంటి స్థలాలు ఇవ్వాలి.

Updated Date - 2020-06-29T10:18:33+05:30 IST