నేత్రదాతలకు నిలయాలు

ABN , First Publish Date - 2022-04-25T05:45:15+05:30 IST

నేత్రదాతలకు నిలయాలు

నేత్రదాతలకు నిలయాలు
ఇక్కరెడ్డిగూడ గ్రామం ముఖ చిత్రం


  • నేత్ర దానానికి వందశాతం ముందుకు వచ్చిన దేవునిఎర్రవల్లి, ఇక్కరెడ్డిగూడ గ్రామాల ప్రజలు
  • ఇప్పటివరకు రెండు గ్రామాల్లో 40 మంది కళ్ల సేకరణ
  • కళ్ల దానంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న రెండు గ్రామాలు

 చేవెళ్ల, ఏప్రిల్‌ 24 : చిన్న గ్రామాలు పెద్ద ఆలోచన చేశాయి. చనిపోయిన తరువాత కూడా మరొకరికి చూపు ఇవ్వాలనే ఉద్దేశంతో కళ్లను దానం చేసేందుకు ఆ రెండు గ్రామాల ప్రజలంతా ముందుకు వచ్చారు. దీంతో వారంత నేత్రదాన అంగీకార పత్రాలను ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి అందించారు. ఇప్పటివరకు ఆ రెండు గ్రామాల్లో కలిపి మొత్తం 40 మంది చనిపోయిన తర్వాత వారి నేత్రాలను ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రికి అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 

చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామంలో ఇప్పటివరకు 29 మంది నేత్రాలను దానం చేశారు. అలాగే చనువల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన ఇక్కరెడ్డిగూడ గ్రామంలో 11 మంది వారి నేత్రాలను దానం చేశారు. ఈ రెండు గ్రామాలు చిన్నవే అయినా ఆలోచనలో గొప్పవారిగా నిలిచారు. అక్షరాసులు, నిరక్షరాసులు, రైతులు, కూలీ పనులు చేసుకునే వారు సైతం  నేత్రాలను దానం చేయాలని తీర్మానించుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో దాదాపు 90శాతం కుటుంబాలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. చేవెళ్ల మండలంలోనే దేవునిఎర్రవల్లి గ్రామం నేత్రాలను దానం చేసి ముందు వరుసలో ఉండగా.. ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కరెడ్డిగూడ గ్రామ ప్రజలు నేత్రదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ గ్రామంలోని స్వామివివేకానంద యువజన సంఘం సభ్యుల ప్రోత్సాహంతో ప్రజలు మరణానంతరం నేత్ర దానం చేసేందుకు ముందుకు వచ్చి  నగరంలోని ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రి వారికి అంగీకార పత్రాలను అందజేశారు. 

ఆ రెండు గ్రామాల్లో వంద శాతం

దేవునిఎర్రవల్లి, ఇక్కరెడ్డిగూడ గ్రామాల్లో వందశాతం ప్రజలు కళ్లను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. 2010 నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా దేవునిఎర్రవల్లిలో మొత్తం జనాభా 1780 మంది ఉన్నారు. ఇప్పటివరకు ఈ గ్రామం నుంచి 29 మంది కళ్లను ఆసుపత్రి వైద్యులు తీసుకెళ్లారు. అలాగే ఇక్కరెడ్డిగూడలో మొత్తం జనాభా 520 మంది ఉన్నారు. కాగా ఇప్పటివరకు ఈ గ్రామంలో 11 మంది కళ్లను ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రి వైద్యులు సేకరించారు. 

మార్పునకు శ్రీకారం ఇలా..

 చేవెళ్ల మండల పరిధిలోని దేవునిఎర్రవల్లి గ్రామానికి చెందిన కావలి చంద్రయ్య, నర్సింహులుతోపాటు మరో ఇద్దరు పుట్టుకతోనే అంధులు. అయితే వారి కష్టం అంతా ఇంతా కాదు. అయినా ఎవరి సాయం లేకుండా ఏదో ఒక పనిచేసేవారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేవెళ్ల మండల కేంద్రానికి నడుచుకుంటూ వెళ్లేవారు. వారికే చూపు ఉంటే ఎలా ఉంటుందని భావించిన దేవునిఎర్రవల్లి అప్పటి మాజీ సర్పంచ్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి గ్రామస్తులందరినీ ఏకం చేసి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయనలో పుట్టిన ఆ ఆలోచననే ఆ పల్లెనే నేత్రాలు దానం చేసేవిధంగా ముందుకు తీసుకెళ్లింది. చనిపోయిన తర్వాత కండ్లను బూడిద కానీయకుండా అంధుల జీవితాల్లో దీపాలుగా మార్చాలని ఊరు ఊరంతా నిశ్చయించుకుంది. దీంతో గత 2010 సంవత్సరంలో నేత్రాల దానానికి శ్రీకారం చుట్టారు. అలాగే మండల పరిధిలోని ఇక్కరెడ్డిగూడ గ్రామంలోని ప్రజలంతా వ్యవసాయం తప్పా మరో ప్రపంచం తెలియదు. అలాంటి ఈ గ్రామంలో 1994లోనే పరిచయమైన స్వాధ్యాయ పరివార్‌ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఎంతోమంది మార్పునకు దారితీసింది. ఆనాటి నుంచి గ్రామంలో ప్రతి రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గ్రామస్తులు పాల్గొంటుంటారు. గ్రామస్తులంతా ఒకే కుటుంబంగా ఉంటూ గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించారు. వివేకానంద యువజన సంఘం ఏర్పాటు చేసుకుని గ్రామంలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతుంటారు. 

కరోనా కాలంలో సేకరణ బంద్‌

నేత్ర దాన కార్యక్రమంలో భాగంగా ముందుకు వచ్చిన ఆ రెండు గ్రామాల్లో కరోనా కాలంలో నేత్రాలు సేకరించలేకపోయారు. ఆ సమయంలో ఈ రెండు గ్రామాల్లో కలిపి మొత్తం 24 మంది చనిపోయారు. కాని కరోనా కారణంతో దానం చేసిన కళ్లను వైద్యులు సేకరించలేకపోయారు. దీంతో కరోనా మూలంగా కళ్లు దానం చేయలేకపోయామని ఆ గ్రామల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. 

నేత్రాలు దానం చేయడం సంతోషంగా ఉంది

అంధుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ ఆలోచన ఎంతో బాగుంది. గ్రామస్తులంతా మాకు మద్దతుగా నిలిచారు. కళ్లదానంపై అవగాహన కల్పించి నేత్రాలను దానం చేసిన వారి పేర్లను ఎప్పటికప్పడు నమోదు చేస్తున్నాం. చనిపోయిన తర్వాత కళ్లు ఎందుకు పనికి రాకుండా పోయే బదులు ఇలా ఇతరులకు ఉపయోగపడం ఎంతో సంతోషాన్నిస్తుంది. 

                                   - గణపతి చంద్రశేఖర్‌రెడ్డి, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు, ఇక్కరెడ్డిగూడ

మరొకరి జీవితంలో వెలుగులు

గ్రామస్తులందరి సహకారంతో నేత్రదానం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మరణించిన తరువాత కూడా ఈ కళ్లు మరొకరికి పనికి వస్తాయని గుర్తించి దానం చేస్తున్నాం. వంద శాతం ప్రజలు నేత్రా దానం చేయడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్‌లోను ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. కరోనా కాలంలో మాత్రం నేత్రాలను సేకరించలేదు. 

                                                                        - సామ మాణిక్యరెడ్డి, సర్పంచ్‌ , దేవుని ఎర్రవల్లి

నేత్రదానంపై అవగాహన కల్పించాలి

ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దేవునిఎర్రవల్లి గ్రామంలో నేత్రదానానికి శ్రీకారం చుట్టాం. 2010 సంవత్సరం నుంచి నేటి వరకు ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికి కళ్లు దానం చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నాం. నేత్రదానంపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో అవగాహన కల్పించాలి. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు పకడ్బందీగా చేపట్టి నేత్రాదానంపై అవగాహన కల్పిస్తే రాష్ట్రంలో కళ్లులేనివారందరికీ కంటి చూపు వచ్చే అవకాశం ఉంటుంది.

                                                       - సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్స్‌ అధ్యక్షుడు

తాత కళ్లు ఇంకా బతికే ఉన్నయ్‌

మా తాత పెంటయ్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. కానీ తాత కళ్లు దానం చేయడం ద్వారా ఇద్దరికి చూపునిచ్చినట్లైంది. తాత చనిపోయాడు కానీ.. ఆయన కళ్లు బతికే ఉన్నయ్‌. చాలా సంతోషంగా ఉంది. మా గ్రామంలోని వివేకానంద యువజన సంఘం సభ్యుల ప్రోత్సాహంతో నేత్రాలు ఇచ్చేందుకు తమ కుంటుంబంతోపాటు ఊరంతా ముందుకు వచ్చి కళ్లు దానం చేసేందుకు అంగీకారం చేసుకున్నాం. 

                                                                             - కె.ప్రశాంత్‌, ఇక్కరెడ్డిగూడ, గ్రామం 

Updated Date - 2022-04-25T05:45:15+05:30 IST