Abn logo
Jun 3 2020 @ 00:00AM

నా బాధ్యతగా చేయాలనుకున్నా..

  • కరోనా సమయంలో ‘నేను సైతం..’ అంటూ డాక్టర్‌ అశోక్‌ పరికిపండ్ల ముందుకొచ్చారు. వైరస్‌ కట్టడికి ‘ప్రజాచైతన్య యాత్ర’ ప్రారంభించారు. సాధారణ మానవుని సంపూర్ణ ఆరోగ్యమే ఆయన యాత్ర లక్ష్యం. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి వరంగల్‌ అర్బన్‌కు ఆయన యాత్ర చేరింది. ఇప్పటివరకూ 1868 కిలోమీటర్లు యాత్ర సాగింది. ఇక కరీంనగర్‌ జిల్లాకు ప్రణాళిక సిద్ధంచేసుకున్నారు కూడా. రోగనిరోధకశక్తిని పెంపొందించే హోమియోపతి మందులను ఇప్పటిదాకా 52,076 మందికి ఆయన పంపిణీ చేశారు. లక్షమందికి ఈ మందులను అందచేయాలన్నది డాక్టర్‌ అశోక్‌ టార్గెట్‌. దీనిపై ఆయన అంతరంగం...

 ‘‘సమాజానికి ఏదైనా కష్టమొస్తే మనం ప్రభుత్వాన్ని నిందిస్తాం. నాకు అది కరెక్టు కాదనిపించింది. వ్యక్తిగా నేను ఏం చేశాను? అని ఎప్పుడూ అవలోకించుకుంటా. అదే నన్ను కరోనా కట్టడి ప్రజా చైతన్యయాత్రకు పూనుకునేట్టు చేసింది. సమాజంలోని పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లు, హెల్త్‌ వర్కర్లు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, విలేకరులను వైరస్‌ నుంచి కాపాడడానికి నా వంతు ప్రయత్నం మొదలెట్టా. కారణం వీరంతా ఇరవై నాలుగు గ ంటలూ పనిచేసే వృతి జీవులు. ఈ విపత్తు సమయంలో వీరిని కాపాడడం నా సామజిక బాధ్యతగా భావించా. 

తొలుత మహబూబాబాద్‌ జిల్లాలోని పదహారు మండలాల్లో ప్రతి రోజూ ఒక మండలం చొప్పున చుట్టా! అలా ఒక్కొక్క మండలంలో పది గ్రామాలు తిరిగా. అక్కడి పేద ప్రజలను, పారిశుద్ధ్య కార్మికులను చైతన్య పరుస్తూ వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే హోమియోపతి మందులను వారికి ఉచితంగా అందజేశా. నా చైతన్య యాత్రను మోటర్‌సైకిల్‌ మీద ప్రారంభించా. దానికి ప్లకార్డులు కట్టి, అవసరమైన హోమియో మందులు పెట్టుకుని యాత్ర షురూ చేశా! మహబూబాబాద్‌ నుంచి జనగామ, వరంగల్‌ రూరల్‌ నుంచి వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చేరా. అంతేకాదు పారిశుద్ధ్య కార్మికులు, ఇతరులకు రోగనిరోధకశక్తిని పెంచే హోమియోపతి మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నా. తర్వాత కరీంనగర్‌ జిల్లా నా టార్గెట్‌. అక్కడికి చేరడానికి ప్రణాళిక సిద ్ధం చేసుకున్నా. ఇందులో కరీంనగర్‌ జిల్లాతో కలిపి ఐదు జిల్లాలను కవర్‌ చేయాలన్నది నా ఆలోచన.  హోమియోపతి మందులను లక్షమందికి ఉచితంగా పంపిణీ చేయాలన్నది నా యాత్ర ముఖ్య లక్ష్యం. మొత్తం తెలంగాణాలోని పన్నెండు జిల్లాలను కవర్‌ చేస్తూ 3వేల కిలోమీటర్లు ప్రయాణించాలనుకుంటున్నా.   సేవాతత్వం అలవడిందలా....

సామాజిక అంశాలపై నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఎక్కువ. కర్నాటకలో ఒక ఆశ్రమంలో ఉండి వైద్య వృత్తిని అభ్యసించా. అందువల్లే నాకు సేవా తత్వం అలవడింది. ఎన్నో ఏళ్లుగా సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నా. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలోనూ పాలుపంచుకున్నా. కరోనా విపత్తు సమయంలో  రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే దానికన్నా, ఒక వ్యక్తిగా నేను ఈ కష్ట సమయంలో ప్రజలకు ఏం చేస్తున్నా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. అలా ఈ ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించా. మా సొంతూరు వరంగల్‌. కరోనా వైరస్‌ తగ్గడానికి వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే ఆర్సెనికమ్‌ అల్బమ్‌ మందును ప్రయోగాత్మకంగా గుజరాత్‌ ప్రభుత్వం 5,014 మందిపై పరీక్షించింది. అక్కడ కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గాయి. అందుకే ఆ మందును ఇపుడు అందరికీ పంచుతున్నా. నాకు ఈ ఆలోచన రావడానికి మా నాన్నగారు స్ఫూర్తి. ఆయన రాష్ట్రపతి అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు. ఆయనలో సామాజిక సేవా ధోరణి ఎక్కువగా ఉండేది. 

నేను ఇప్పటివరకూ తెలంగాణాలో ఐదు జిల్లాలు, 58 మండలాలు, 286 ప్రాతాలు, 1,868 కిలోమీటర్ల దూరం ప్రయాణించా. 52,076 మందిని కలిసి వారికి ఉచితంగా మందులు ఇచ్చా. నా యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు నాతో ఎంతో అప్యాయంగా మాట్లాడారు. కరోనా కట్టడిపై ఎంతో నిబద్ధతతో స్పందించారు. పట్టణ ప్రాంతాల్లో కరోనా నియంత్రణ నిర్దేశాలను పాటించడంలో కొంత నిర్లక్ష్య ధోరణి గమనించా. అందుకే గ్రామీణ ప్రజలు నాకు స్ఫూర్తిగా నిలిచారు. నా ఈ యాత్రలో చాలామంది తిండి, ఉపాధి కరువై నానాకష్టాలు పడుతున్నామంటూ ఆవేదన చెందారు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు వారివి. వారికి వైరస్‌ గురించిన అవగాహన ఉంది. అయితే, కరోనా వచ్చిన రక్తసంబంధీకులను సైతం కొందరు దూరం పెడుతున్నారు. కరోనా అంటే ప్రజలలో భయం, అభద్రత కనిపించాయి. అందుకే సమగ్ర వైద్య విధానం ద్వారా ప్రభుత్వం ఈ వైరస్‌కు చెక్‌ పెట్టాలి. ఒక వైద్యుడిగా నావంతు చేయగలిగింది చేస్తా. ప్రజా చైతన్యం కోసమే ఈ ప్రయత్నమంతా!’’