కరోనా విలయం.. రోడ్డునపడ్డ కుటుంబం!

ABN , First Publish Date - 2020-04-05T22:22:12+05:30 IST

కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దీని కారణంగా 65వేల మంది మరణించారు. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యా

కరోనా విలయం.. రోడ్డునపడ్డ కుటుంబం!

దుబాయి: కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దీని కారణంగా 65వేల మంది మరణించారు. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డునపడ్డాయి.  తినడానికి తిండి దొరక్క లక్షలాది మంది పేద ప్రజలు అల్లాడుతున్నారు. ఫాజ్మా ఫారూక్ కుటుంబం కూడా ఈ కోవకు చెందిందే. వివరాల్లోకి వెళితే.. 


ఫాజ్మా ఫారుక్ (28) స్వదేశం పాకిస్థాన్. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు. రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణిచడంతో.. కుటుంబ భారాన్ని ఆమె తన భుజాన వేసుకుంది. ఇద్దరు చెల్లెళ్లు, తల్లిని వెంటబెట్టుకుని.. పొట్టకూటి కోసం యూఏఈలో అడుగు పెట్టింది. కష్టాల్లో ఉన్న వారి కుటుబాన్ని యూఏఈ అక్కున చేర్చుకుంది. ఫాజ్మా ఫారుక్ చదివిన చదువుకు.. ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం వచ్చింది. పని చేయడం వల్ల వచ్చిన డబ్బులతో.. ఆమె తన కుటుంబ సభ్యుల కడుపు నింపింది.


అయితే ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితాన్ని కరోనా వైరస్ చిన్నాభిన్నం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయం సృష్టిస్తుండటంతో ఆమె పని చేస్తున్న కంపెనీ మూతపడింది. చేతిలో డబ్బులు లేకపోవడంతో.. ఫాజ్మా ఫారుక్ కుటుంబం అద్దె ఇంటిని ఖాళీ చేసింది. వీళ్ల పరిస్థితిని గమనించిన కొందరు.. పెద్ద మనసుతో ముందుకొచ్చారు. వారికి ఆహారపదార్థాలు అందించారు. చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన వాటిని తింటూ.. రాత్రి సమయాల్లో రోడ్లపక్కన, పార్కులోని బెంచీలపై  నిద్రిస్తూ నెల రోజులు నెట్టుకొచ్చారు. అయితే కరోనా ప్రభావం నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో రోడ్లపక్కన, పార్కులో నిద్రించే పరిస్థితులు ఇప్పుడు అక్కడ లేవు. ఈ నేపథ్యంలో మీడియా ముందు ఆమె తన గోడును వెల్లబోసుకున్నారు. 


‘కరోనా వైరస్ ప్రభావంతో మా కుటుంబం రోడ్డున పడింది. మా పరిస్థతిని గమనించి కొందరు.. ఆహారపదార్థాలను అందించారు. చుట్టుపక్కన వాళ్లు ఇచ్చినవి తింటూ.. దాదాపు నెల రోజులుగా రోడ్లపక్కన నిద్రిస్తున్నాం. అయితే ఇప్పుడు రోడ్లపక్కన, పార్కుల్లో నిద్రించే పరిస్థితులు లేవు. నేను, నా చెల్లెళ్లు ఆకలికి తట్టుకోగలం. కానీ మా అమ్మ అలా కాదు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. ఎక్కువ సేపు నడవ లేదు, కూర్చోలేదు. ఆమె గురించే నా ఆందోళన. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఉండటానికి మాకు కాస్త చోటు కావాలి’ అని తెలిపారు. కాగా.. కరోనా విలయతాండం చేస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు ఇటువంటి గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి.


Updated Date - 2020-04-05T22:22:12+05:30 IST