Abn logo
Sep 29 2020 @ 12:41PM

ఎముకల నొప్పులకు ఇంటి వైద్యం!

ఆంధ్రజ్యోతి(29-09-2020)

కరోనా కాలంలో ఎక్కువ రోజుల పాటు ఇళ్లకే పరిమితమయ్యాం! ఈ సమయంలో వ్యాయామాలు చేయడం తగ్గింది. ఎముకల సమస్యలు తిరగబెట్టే అవకాశాలు పెరిగాయి. కీళ్లు, ఎముకలకు సంబంధించిన పలు రకాల నొప్పులు, అసౌకర్యాలను చిన్నపాటి వ్యాయామాలు, చిట్కాలతో ఎలా అదుపులో పెట్టుకోవాలో డాక్టర్‌ దశరాధ రామిరెడ్డి వివరిస్తున్నారిలా...


జీవనశైలి మార్పులు, శరీర భంగిమలు, తీసుకునే ఆహారం... ఇలా ఎముకలకు సంబంధించిన నొప్పులకు బోలెడన్ని కారణాలు ఉంటాయి. ఎక్కువ సమయాల పాటు ఏ పని చేసినా ఆ ప్రభావం ఎముకల మీద పడుతుంది అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. వాటి మీదా దృష్టి పెట్టాలి. అయితే సమస్య కారణాన్ని కనిపెట్టి, నొప్పిని అదుపుచేసే వ్యాయామాలు, చిట్కాలు అనుసరించవచ్చు.   

కీళ్లు కిర్రు కిర్రు!

మోకీళ్లు అరిగిపోయే ఆర్థరైటిస్‌ సమస్య ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మందులు వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. వాటితో పాటు నొప్పిని పెంచే పనులు తగ్గించి, కీళ్లను బలపరిచే వ్యాయామాలు సాధన చేయాలి. ఇందుకోసం...


చేయకూడనివి: మెట్లు ఎక్కడం, ఏటవాలు ప్రదేశాల్లో నడవడం, ఏరోబిక్‌, జుంబా వ్యాయామాల్లో భాగంగా స్టెప్పర్‌ను వాడడం వల్ల కీళ్ల మీద ఒత్తిడి పెరిగి నొప్పులు పెరుగుతాయి. కాబట్టి ఈ పనులు మానుకోవాలి. అలాగే మోకాళ్లు వంచి చేసే పద్మాసనం, వజ్రాసనం వంటి యోగాసనాలు వేయకూడదు. నేల మీద బాసింపట్టా వేసి కూర్చోకూడదు. 


అనుసరించవలసిన చిట్కాలు: కుర్చీలో కూర్చుని, కాళ్లను మార్చి మార్చి, నడుము ఎత్తుకు గాల్లోకి లేపి పది అంకెలు లెక్కబెట్టి దించాలి. ఇదే వ్యాయామాన్ని వెల్లకిలా పడుకుని చేయాలి. మోకాలి అడుగున మెత్తని టవల్‌ లేదా స్ట్రెస్‌ బాల్‌ను ఉంచుకుని కిందకు నొక్కాలి. ఈ వ్యాయామాలతో నొప్పి అదుపులోకి వస్తుంది. కరోనా కారణంగా జిమ్‌లకు వెళ్లలేక ఇంట్లోనే ట్రెడ్‌మిల్‌ వాడేవాళ్లు, దాన్ని చదునుగానే ఉంచి, ఐదు కిలోమీటర్ల వేగాన్ని సెట్‌ చేసి నడవాలి.

వెన్ను నొప్పి!

శరీరంలో దాగిన ఆరోగ్య సమస్యకు చిహ్నంగా వెన్నునొప్పి రావచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు, గర్భాశయ వ్యాధులు, పిత్తాశయ ఇన్‌ఫెక్షన్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఎముకలు గుల్లబారడం, వెన్నులో డిస్క్‌లు పట్టు తప్పడం... ఇలా పలు సమస్యల్లో వెన్ను నొప్పి ప్రధాన లక్షణంగా ఉంటుంది. కాబట్టి సమస్యకు అసలు కారణం తెలుసుకోవాలి. ఇవేవీ లేకుండా శరీర భంగిమలో తేడాలు, ఊబకాయంతో కూడా వెన్ను నొప్పి మొదలవుతుంది. 


చేయకూడనివి: చదునైన బల్లపై పడుకుంటే వెన్ను నొప్పి తగ్గుతుందనేది అపోహ. కాబట్టి ఈ పని చేయకూడదు. అస్తవ్యస్థ భంగిమల్లో నిద్రించకూడదు.


అనుసరించవలసిన చిట్కాలు: వెన్నుకు ఆసరా అందించే మెత్తని పరుపు మీద పడుకోవాలి. కుర్చీలో జారగిలబడి, ముందుకు వంగిపోయి కూర్చోకుండా నిటారుగా కూర్చోవాలి.


నడుం పట్టుకుంటే?

కొందరికి తరచుగా నడుం పట్టుకుపోతూ ఉంటుంది. ఇందుకు కీళ్లవాతం ఒక కారణం. కనీసం మూడు రోజుల పాటు వేధించే ఈ సమస్య తరచుగా తలెత్తుతూ ఉంటే, శరీర భంగిమలో పొరపాట్లు దొర్లుతున్నాయని అర్థం.


చేయకూడనివి: వంగి ఎక్కువ బరువులు ఎత్తడం, వంగే అవసరం ఉండే పనులు ఎక్కువగా చేయడం.


అనుసరించవలసిన చిట్కాలు: బరువైన వస్తువులను మోకాళ్లు వంచి, కిందకు కుంగి ఎత్తాలి. ఎక్కువ సమయం పాటు వంగి పనులు చేయడం తగ్గించాలి. నొప్పి తగ్గడం కోసం ఎక్కువ సమయం పాటు విశ్రాంతి తీసుకోవాలి. పడుకునే భంగిమ అడ్డదిడ్డంగా కాకుండా సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.


మణికట్టులో నొప్పి!

వర్క్‌ ఫ్రం హోమ్‌లో భాగంగా ఇంట్లో కంప్యూటర్ల ముందు పని చేసే వారు కంప్యూటరు మోస్‌ను వాడే విధానం క్రమం తప్పకుండా చూసుకోవాలి. లేదంటే మణికట్టుకు సంబంధించిన కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ తలెత్తుతుంది. బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేళ్లలోని కీళ్లకు సంబంధించిన ఈ అసౌకర్యాన్ని సులువుగానే తగ్గించుకోవచ్చు.


చేయకూడనివి కంప్యూటర్‌ ముందు ఏకధాటిగా గంటల తరబడి పనిచేయకూడదు.


అనుసరించవలసిన చిట్కాలు: కంప్యూటర్‌ టేబుల్‌, కుర్చీ సమమైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. మౌస్‌ కీబోర్డు పక్కనే ఉండేలా చూసుకోవాలి. ప్రతి 45 నిమిషాలకు బ్రేక్‌ తీసుకుంటూ మణికట్టును సవ్య, అపసవ్య దిశల్లో తిప్పాలి. మెటికలు సున్నితంగా విరుచుకోవాలి. హ్యాపీ బాల్‌ను నొక్కాలి. ఏసీ చల్లదనం కారణంగా వేళ్లలోని కీళ్లు పట్టేస్తూ ఉంటే, గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసి, అరచేతులు ముంచి ఉంచితే జాయింట్లు వదులవుతాయి. బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలు తిమ్మిరిగా మారి, భరించలేనంత నొప్పి ఉంటే వైద్యులను సంప్రతించాలి.

టెయిల్‌ బోన్‌ పెయిన్‌!

వెన్నుపాము అడుగున ఉండే టెయిల్‌ బోన్‌కు ప్రమాదవశాత్తూ దెబ్బతగిలినా, ఆ ఎముక విరిగినా జీవితాంతం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే...


ఆఫీసులో, ఇంట్లో, కారులో, మరెక్కడైనా కూర్చునే సందర్భంలో తప్పనిసరిగా ‘యు’ ఆకారంలో ఉండే కుషన్‌ వాడాలి. ఇలా చేస్తే టెయిల్‌బోన్‌ అడుగున తగలకుండా ఉండి, నొప్పి కలగదు.

మడమ శూల!

హైపోథైరాయిడ్‌, పెరిగిన మధుమేహం, విటమిన్‌ డి లోపం, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, గౌట్‌ వ్యాధి... ఇలా పలు కారణాలతో మడమ శూల మొదలవుతుంది. ఇవే కాకుండా అకారణంగా కూడా మడమ నొప్పి రావచ్చు. కాబట్టి మూల కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి. ఈ నొప్పిని అదుపుచేసే చిట్కాలను కూడా పాటించవచ్చు.


చేయకూడనివి: గట్టి చెప్పులు వాడకూడదు. స్టెరాయిడ్‌ ఇంజెక్షన్‌ తీసుకోకూడదు.  ఇంజెక్షన్‌తో తాత్కాలిక ఉపశమనం కలిగినా, దీర్ఘకాలంలో ఇన్‌ఫెక్షన్‌కు దారితీయవచ్చు. 


అనుసరించవలసిన చిట్కాలు: మెత్తని చెప్పులు వాడాలి. షూలో సిలికాన్‌ హీల్‌ కప్స్‌ వాడాలి. చెప్పులు వేసుకునేవాళ్లు సిలికాన్‌ సాక్స్‌ వాడాలి. ఉదయం, రాత్రి గోరువెచ్చని నీళ్లలో రాతి ఉప్పు వేసి, పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. నొప్పి తగ్గే జెల్స్‌, నూనెలు వాడవచ్చు. ఈ చిట్కాలతో సమస్య తగ్గనప్పుడు పరీక్ష్లల్లో ఇతరత్రా సమస్యలేవీ కారణం కాదని తేలినప్పుడు పి.ఆర్‌.పి  ఇంజెక్షన్‌ చేయించు కోవచ్చు.

స్పాండిలోసిస్‌!

సాధారణంగా స్పాండిలోసిస్‌ 50 ఏళ్లు దాటినవారికే వస్తుంది. అంతకంటే తక్కువ వయసులో వచ్చే స్పాండిలోసి్‌సను పోలిన నొప్పులకు వేర్వేరు కారణాలుంటాయి. ఎక్కువ సేపు కంప్యూటర్‌ ముందు పనిచేయడం, ఏటవాలుగా పడుకుని పొట్ట మీద ల్యాప్‌టాప్‌ పెట్టుకుని పని చేసినా, సోఫాల్లో జారగిలబడి, బోర్లా పడుకుని ల్యాప్‌టాప్‌ వాడుతున్నా స్పాండిలోసి్‌సను పోలిన నొప్పులు తప్పవు. అలాగే కొందరు తల కింద రెండు, మూడు దిండ్లు పెట్టుకుని టీవీ చూస్తూ ఉంటారు. ఈ అలవాటుతో కూడా స్పాండిలోసిస్‌ నొప్పులు మొదలవుతాయి.


చేయకూడనివి: కంప్యూటర్‌ ముందు గంటలతరబడి ఒకే భంగిమలో పని చేయకుండా మధ్య మధ్యలో బ్రేక్‌ తీసుకోవాలి. కంప్యూటర్‌, ల్యాప్‌టా్‌పలను వాడేటప్పుడు శరీరం అసౌకర్యానికి లోను కాని భంగిమలను అనుసరించాలి. మెత్తని, చిన్న దిండ్లను వాడాలి. మెడ, వెన్నుపాముకు సర్జరీ జరిగిన తర్వాత మాత్రమే వైద్యుల సూచన మేరకు మెడకు కాలర్‌ వాడాలి. అలాకాకుండా నొప్పి అనిపించిన ప్రతిసారీ నెక్‌ కాలర్‌ వాడడం సరికాదు. 


అనుసరించ వలసిన చిట్కాలు: స్పాండిలోసిస్‌ లేదా దాన్ని పోలిన మెడ నొప్పిని తగ్గించే ఐసొమెట్రిక్‌ వ్యాయామాలు వైద్యుల సూచన మేరకు చేయాలి. ఈ నొప్పితో పాటు తలతిరుగుడు మొదలైనా, చేయి, మెడ, భుజం మొద్దుబారుతున్నా వైద్యులను కలవాలి.

మెడ నొప్పి!

కరోనాతో కలిసివచ్చిన ఖాళీ సమయాల్లో సెల్‌ఫోన్ల వాడకం మరింత పెరిగింది. దాంతో మెడను ఎక్కువ సమయం పాటు వంచి ఫోన్‌ చూడడం మూలంగా టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌ మొదలవుతుంది. ఈ సమస్యలో మెడ లాగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే...


చేయకూడనివి: తల దించి ఫోన్‌లో టెక్ట్స్‌ చేసే సమయాన్ని తగ్గించుకోవాలి. మొత్తంగా సెల్‌ఫోన్‌ వాడకాన్ని పరిమితం చేయాలి.


అనుసరించవలసిన చిట్కాలు: సెల్‌ఫోన్‌ను కళ్లకు సమాంతరంగా పైకెత్తి వాడడం అలవాటు చేసుకోవాలి. మెడలోని ఎముకలు, కండరాలు వదులయ్యే వ్యాయామాలు చేయాలి. తలను నెమ్మదిగా కిందకు వంచి, పైకి లేపడం, కుడి వైపు, ఎడమ వైపు తిప్పే వ్యాయామాలు చేసినా నొప్పి తగ్గుతుంది. 

విటమిన్‌ డి, క్యాల్షియం సప్లిమెంట్లు!

విటమిన్‌ డి, క్యాల్షియం సప్లిమెంట్లు ప్రతి ఒక్కరూ వాడవలసిందే! క్యాల్షియం మాత్రలు అదే పనిగా వాడితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయనేది అపోహ మాత్రమే! కాబట్టి వయసును బట్టి విటమిన్‌ డి 1000 ఇంటర్నేషనల్‌ యూనిట్లు, క్యాల్షియం 500 నుంచి 1500 మిల్లీ గ్రాములు తీసుకోవాలి.

-డాక్టర్‌ టి.దశరాధ రామిరెడ్డి

చీఫ్‌ ఆర్థొపెడిక్‌ సర్జన్‌,

యశోదా హాస్పిటల్స్‌,

సోమాజిగూడ, హైదరాబాద్‌.