నెగెటివ్‌ వచ్చినా.. హోం క్వారంటైన్‌

ABN , First Publish Date - 2021-11-29T08:52:53+05:30 IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ను ఎదుర్కొనేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమైంది.

నెగెటివ్‌ వచ్చినా.. హోం క్వారంటైన్‌

  • పాజిటివ్‌ ఉంటే ప్రభుత్వ ఆస్పత్రికి..
  • వెంటనే జీనోమ్‌ స్వీక్వెన్సీకి ఆ నమూనాలు
  • దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి
  • థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో 68 వేల పడకలు రెడీ
  • ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌ సమీక్ష


హైదరాబాద్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ను ఎదుర్కొనేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమైంది. ఆ వైరస్‌ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడి నమూనాలను పరీక్షించాలని, పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను వెంటనే జీనోమ్‌ స్వీక్వెన్సీకి పంపాలని సర్కారు నిర్ణయించింది. కొత్త వేరియంట్‌ కేసు దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇంతవరకు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ దాని వ్యాప్తి ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తం అయింది. అందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ద్విముఖ వ్యుహంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ముందుగా కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన సర్వైలెన్స్‌ సిస్టమ్‌ను సర్కా రు మరింత బలోపేతం చేస్తోంది. ఇప్పటికే ఆ బృందాలన్నింటినీ అప్రమత్తం చేసింది. ఎయిర్‌పోర్టు సర్వైలెన్స్‌ సిస్టమ్‌ను మరింత అలెర్ట్‌ చేసింది. ఒమైక్రాన్‌ ప్రభావం ఉన్న 12 రిస్కు దేశాల జాబితాను కేంద్రం ఇప్పటికే విడుదల చేసింది. 


దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిల్యాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌లు రిస్కు దేశాల జాబితాలో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకు రెండు రకాల పద్ధతులను వైద్యశాఖ అవలంబిస్తోంది. ఆ దేశాల నుంచి వచ్చే వారు ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకొని, ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ ఉంటే, వారిని నేరుగా 14 రోజుల హోం క్వారంటైన్‌కు పంపనుంది. ఒకవేళ వ్యాక్సినేషన్‌ తీసుకొని, ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ ఉండీ, ఇక్కడికి రాగానే లక్షణాలు ఉంటే, వారి నమూనాలను వైద్య సిబ్బంది సేకరించి టెస్టులు చేస్తారు. నెగెటివ్‌ వస్తే హోం క్వారంటైన్‌కు పంపుతారు. అలాకాకుండా పాజిటివ్‌గా తేలినవారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తారు. వెంటనే ఆ పాజిటివ్‌ నమూనాలను జీనోమ్‌ స్వీక్వెన్సీకి పంపుతారు.  


ఇక రెండు డోసుల ముగింపుపై దృష్టి

రాష్ట్రంలో ఐదు మాసాలుగా కొవిడ్‌ పాజిటివ్‌లు రోజూ రెండొందలలోపే వస్తున్నాయి. నిత్యం 30-32 వేల మధ్య టెస్టులు చేస్తున్నారు. కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ నేపథ్యంలో టెస్టుల సంఖ్యను అవసరాన్ని బట్టి పెంచనున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ల పైబడినవారు 2.77 కోట్ల మంది ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 2.46 కోట్ల మంది తొలిడోసు తీసుకున్నారు. అలాగే 1.23 కోట్ల మంది రెండో డోసు తీసుకున్నారు. ఇంకా 30 లక్షల మంది తొలిడోసు తీసుకోవాల్సి ఉంది. ఇక 45 ఏళ్లు పైబడిన వారిలో 2.31 లక్షల మంది, 18-44 మధ్య వయస్కుల్లో 28 లక్షల మంది కనీసం మొదటి డోసు కూడా తీసుకోకపోవడం వైద్య శాఖను ఆందోళనకు గురిచేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు చివరి నాటికి రెండు డోసుల టీకా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని వైద్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. 


థర్డ్‌ వేవ్‌కు సన్నద్ధత ఇలా..

థర్డ్‌ వేవ్‌ వస్తుందనే ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసింది. ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, ఐసీయూ పడకలను సిద్ధం చేసింది.  

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌  కోసం ఏర్పాటు చేసిన పడకల సంఖ్య - 68,069

సర్కారీలో 112, ప్రైవేటులో 1215 ఆస్పత్రులు 

సర్కారీలో 27,966 బెడ్ల ఏర్పాటు. వాటిలో 5,447 ఐసీయూ, మిగతావి ఆక్సిజన్‌ పడకలు

ప్రైవేటులో 40,103 పడకల ఏర్పాటు. వాటిలో జనరల్‌ 16,320, ఆక్సిజన్‌ కోసం 14,081, ఐసీయూ కోసం 9,702 కేటాయించారు.

ఇక రాష్ట్రంలో సర్కారీ దవాఖానాల్లో మొత్తం 82 చోట్ల సెల్ఫ్‌ జనరేటెడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో ఇప్పటికే 75 ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని తక్షణమే వినియోగించుకునే వెసులుబాటు ఉంది.  

థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో పిల్లల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందు కోసం రూ. 133.9 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.  

కొవిడ్‌ కోసం ప్రత్యేకమైన పరికరాల కొనుగోలుకు రూ.122.34 కోట్లు ఖర్చు పెట్టారు. రూ. 7.88 కోట్లతో అవసరమైన మందులు కొనుగోలు చేశారు.

Updated Date - 2021-11-29T08:52:53+05:30 IST