Abn logo
Mar 27 2020 @ 08:45AM

క్వారంటైన్‌ కోసం హాస్టళ్లు, గృహాలు వుంటే ఇవ్వండి!

చెన్నై : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్వారంటైన్‌ కోసం ఉపయోగించని ప్రైవేటు హాస్టళ్లు, గృహాలు ఉంటే ఇచ్చి సహకరించాలని చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక ముందస్తు చర్యల్లో భాగంగా చెన్నైలో 22వేల ఇళ్లను క్వారంటైన్‌లో ఉంచి, నిఘా పెడుతున్నట్టు కార్పొరేషన్‌ కమిషనర్‌ తెలిపారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలను మరింత తీవ్రతరం చేసింది. విదేశాల నుంచి రాష్ట్రానికి దాదాపు 54వేల మంది వచ్చారని సమాచారం. వారందరిపైనా ఆరోగ్యశాఖ ప్రత్యేక నిఘా పెట్టి, క్వారంటైన్‌లో ఉంచింది.


ఈ నేపథ్యంలో చెన్నైలో క్వారంటైన్‌ వైద్య సేవల కోసం మరిన్ని ప్రదేశాలు అవసరమని, అందువల్ల ఉపయోగించని వసతి గృహాలు, ఇళ్లు ఉంటే ఇచ్చి సహకరించాలని ఆయన కోరారు. ఆపత్కాలంలో చేసే ఈ సహకారం కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు.


అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేల విరాళం

కరోనా నిరోధక చర్యల కోసం ప్రభుత్వానికి అన్నాడీఎంకే తరపున ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే ఎంపీలు తమ నియోజకవర్గ నిధుల నుంచి రూ.1కోటి చొప్పున, ఎమ్మెల్యేలు రూ.25 లక్షలు చొప్పున విరాళంగా ఇవ్వనున్నట్టు అన్నాడీఎంకే ప్రకటించింది.

Advertisement
Advertisement
Advertisement