శ్మశానంలో ఇంటి స్థలం!

ABN , First Publish Date - 2020-02-24T08:32:18+05:30 IST

పేదలకు ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించి చేపట్టిన భూసేకరణ పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతోంది. అధికారుల తీరుతో ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం కాకుటూరి పంచాయతీలోని కంచరగుంటలో రెండు

శ్మశానంలో ఇంటి స్థలం!

  • మృతదేహానికి రోడ్డుపక్కనే దహన సంస్కారాలు
  • ప్రకాశంలో ఇరు సామాజికవర్గాల మధ్య వివాదం


కందుకూరు, ఫిబ్రవరి 23: పేదలకు ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించి చేపట్టిన భూసేకరణ పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతోంది. అధికారుల తీరుతో ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం కాకుటూరి పంచాయతీలోని కంచరగుంటలో రెండు సామాజికవర్గాల మధ్య వివాదం నెలకొంది. కంచరగుంటలో సర్వే నం.52, 53లలో 9ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. అందులో కొంతభాగాన్ని దళితుల్లోని రెండు వర్గాల వారు వేర్వేరు శ్మశానాలుగా ఉపయోగిస్తున్నారు. మరికొంత స్థలాన్ని బీసీల్లోని ఓ సామాజికవర్గం శ్మశానంగా వాడుకుంటున్నారు. మిగిలిన స్థలం పంచాయతీ కింద ఉంది. ఇప్పుడు ఇళ్లస్థలాలకు పట్టాలు ఇచ్చేందుకు అధికారులు బీసీల శ్మశానాన్ని చదును చేయించారు. ఆ వర్గానికి చెందిన మాజీ సర్పంచ్‌ సీతారావమ్మ భర్త సంగా హుస్సేనయ్య మృతిచెందగా అదివారం దహన సంస్కారాలు చేసేందుకు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువచ్చారు. ఆ స్థలాన్ని తమకు పట్టాలు ఇచ్చేందుకు చదును చేయించారంటూ ఎస్సీలు అడ్డగించారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ తాము శ్మశానంగా ఉపయోగిస్తున్న స్థలాన్ని నివాస స్థలాలకు ఎలా ఇస్తారని మృతుడి వర్గీయులు వాదనకు దిగారు. మృతుడి కుటుంబీకులు, అతని వర్గీయులు మృతదేహాన్ని రోడ్డుపైనే దించి బైఠాయించగా, శ్మశాన స్థలంలో ఎస్సీలు మోహరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వలేటివారిపాలెం తహశీల్దారు, కందుకూరు ఆర్డీవో ఓబులేసు, డీఎస్పీ బి.రవిచంద్ర, ఎస్‌ఐ తిరుపతిరావు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోచోట దహన సంస్కారాలు చేసుకోవాలని సూచించడంతో వారు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. శ్మశాన స్థలం ఇళ్ల పట్టాలకు ఎలా కేటాయిస్తారంటూ నిలదీశారు. ప్రత్నామ్నాయంగా మరో స్థలం కేటాయిస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో చివరకు రోడ్డుపక్కనే మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా, ఉలవపాడు మండలం కె.రాజుపాలెంలో గుడి స్థలాన్ని చదును చేయించి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధపడగా మహిళలు ఆ స్థలంలోనే టెంట్లు వేసి దీక్షకు దిగారు. 

Updated Date - 2020-02-24T08:32:18+05:30 IST