నోరు జారిన హోం మంత్రి

ABN , First Publish Date - 2022-04-07T18:33:02+05:30 IST

చామరాజపేట నియోజకవర్గం జగజ్జీవన్‌రామ్‌ నగర్‌కు చెందిన దళిత యువకుడు చంద్రు (19) హత్య ఘటన మలుపులు తిరిగింది. మంగళవారం రాత్రి బర్త్‌డే పార్టీకి సంబంధించి చంద్రు జగజ్జీవన్‌రామ్‌

నోరు జారిన హోం మంత్రి

                        - మండిపడ్డ కాంగ్రెస్‌ 


బెంగళూరు: చామరాజపేట నియోజకవర్గం జగజ్జీవన్‌రామ్‌ నగర్‌కు చెందిన దళిత యువకుడు చంద్రు (19) హత్య ఘటన మలుపులు తిరిగింది. మంగళవారం రాత్రి బర్త్‌డే పార్టీకి సంబంధించి చంద్రు జగజ్జీవన్‌రామ్‌ నగర్‌కు బైక్‌పై వెళ్లిన సమయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే విషయమై గొడవ తీవ్రమై ప్రత్యర్థులు చాకుతో పొడవడంతో చంద్రు మృతి చెందాడు. అయితే జేజే నగర్‌కు చికెన్‌రోల్స్‌ తీసుకొనేందుకు వెళ్లిన సమయంలో ఉర్దూ మాట్లాడాలంటూ అక్కడివారు గొడవ చేశారనే ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర బుధవారం వెల్లడించారు. ఉర్దూ మాట్లా డలేదని హత్యకు పాల్పడ్డారని ఇటువంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాసేపటికే హోం మంత్రి మరోసారి మీడియా ముందుకు వచ్చి ఉర్దూ మాట్లాడాలనే వివాదంతో హత్య జరగలేదని, వాహనం మరో వ్యక్తికి తగలడంతో గొడవ చోటు చేసుకుందని ఇదే కారణంతోనే హత్య జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశామని సమగ్ర విచారణ జరుపుతున్నట్టు వివరించారు. కాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి బెంగళూరులో మాట్లాడుతూ కన్నడ మాట్లాడినందుకు చంద్రు అనే యువకుడిని హత్య చేశారని ఆరోపించారు. ఈ సంఘటనపై మేధావులు మౌనం ఎందుకన్నారు. మృతిచెందింది హిందువైతే కాంగ్రెస్‌ వారికి కన్నీరు రాదని ఆరోపించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ రూ.2లక్షల పరిహారం ఇస్తానని ప్రకటిం చారు. ద్విచ క్రవాహనం తగిలిన మేరకు గొడవ జరిగిందని, షోయబ్‌ అనే వ్యక్తి చాకుతో పొడవడంతో చంద్రు మృతి చెందాడన్నారు. చంద్రు తమిళనాడుకు చెందిన వారన్నారు. 


కాంగ్రెస్‌ నాయకుల మండిపాటు

జేజే నగర్‌లో చోటు చేసుకున్న హత్యపై కాంగ్రెస్‌ నేతలు డీకే శివకుమార్‌, బీకే హరిప్రసాద్‌లు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. చంద్రు హత్యను మత రాజకీయం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు. కనీస సమాచారం లేకుండా హోం మంత్రి రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని, వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వాస్తవ సంఘ టనను నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ వెల్లడించారని, హత్యకు కారకులైనవారిని అరెస్టు చేశారన్నారు. హత్యను సమర్థించే ప్రసక్తే లేదని కానీ బాధ్యతాయుతమైన మంత్రి హత్యను వైభవీకరించి, హత్య జరుగుతున్నప్పుడు ప్రత్య క్షంగా చూసినట్టు మాట్లాడడం ఆ వెంటనే యూ టర్న్‌ తీసు కోవడం ఎంతవరకు సమంజసమన్నారు. హోం మంత్రి కేశవ కృప... లేదా నాగ్‌పూర్‌ వో అంటూ ఎద్దేవా చేశారు. అమాయక యువకుల శవాలపై రాజకీయం చేయ రాద న్నారు. 


చంద్రు హత్యపై సమగ్ర దర్యాప్తు 

- పార్టీ తరపున రూ.5 లక్షల పరిహారం 


బెంగళూరు: బెంగళూరు జేజే నగర్‌లోని గౌరిపాళ్యలో దళిత యువకుడు చంద్రు హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి సీటీ రవి డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబీకులను బుధవారం సాయంత్రం పరామర్శించారు. ఈ హత్యకు వ్యక్తిగత కక్షలు కారణం కాదని, ఉర్దూలో మాట్లాడలేదన్న కారణంతోనే అంతమొందించారని ఇది అన్యాయమని ఆవేదన చెందారు. బాధిత కుటుంబానికి పార్టీ తరపున రూ. 5లక్షల పరిహారం అందించారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తామన్నారు. చంద్రు హత్యకు గల కారణాలను బీజేపీ నిజనిర్ధారణ కమిటీ కూడా పరిశీలించి తేల్చిందన్నారు. మత సహనం ఎవరికి లేదో గత కొద్దిరోజుల ఘటనలే నిరూపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని అంతకుముందు చంద్రు కుటుంబీకులు సీటీ రవికి విన్నవించుకున్నారు. చంద్రు కుటుంబ సభ్యులను పరామర్శించిన బృందంలో ఎంపీ పీసీ మోహన్‌, బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు చలవాది నారాయణస్వామి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ రవికుమార్‌ తదితరులు ఉన్నారు. 





Updated Date - 2022-04-07T18:33:02+05:30 IST