బోనాలు, బక్రీద్ సందర్భంగా శాంతిభద్రతలపై హోం మంత్రి సమీక్ష

ABN , First Publish Date - 2021-07-17T20:03:20+05:30 IST

రానున్న బోనాల జాతర, బక్రీద్ పండగల నేపధ్యంలో రాజధానిలో శాంతిభద్రతలను పకడ్బందీగా నిర్వహించాలని హోంమంత్రి మహమూద్అలీ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

బోనాలు, బక్రీద్ సందర్భంగా శాంతిభద్రతలపై హోం మంత్రి సమీక్ష

హైదరాబాద్: రానున్న బోనాల జాతర, బక్రీద్ పండగల నేపధ్యంలో రాజధానిలో శాంతిభద్రతలను పకడ్బందీగా నిర్వహించాలని హోంమంత్రి మహమూద్అలీ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు  ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్), పోలీసు డిజి, హోంశాఖ పరిధిలోని వివిధ విభాగాల అధిపతులు, పోలీసు కమిషనర్లు, హైదరాబాద్ మరియు వరంగల్ ప్రాంతీయ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరళ్ళు ఈ  సమీక్షల్లో పాల్గొన్నారు. బోనాలు, బక్రీద్ సందర్భంగా బందోబస్తు,శాంతి భద్రతల ఏర్పాట్లతో పాటు హోం శాఖ పరిధిలోని విభాగాలలో వివిధ పోస్టుల ఖాళీల పై ఈ సమావేశాలలో సమీక్షించారు. 


బోనాలు, బక్రీద్  ఉత్సవాలకు విస్తృతమైన బందోబస్ట్ చేయాలని, లా అండ్ ఆర్డర్ ఏర్పాట్లు పకడ్బందీగా అమలుచేయాలని అన్నారు. ఏర్పాట్ల విషయమై  సంబంధిత ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని మరియు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ -19 సంబంధించి నిబంధనలు ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రజలు పాటించేటట్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈద్గా లలో  ఈద్-ఉల్-జుహా ప్రార్థనలు చేసేటప్పుడు భౌతిక దూరం మరియు మాస్కులు విధిగా ధరించాలని, బక్రీద్ సందర్భంగా ఆవులను బలి ఇవ్వకుండా చూడాలని హోం మంత్రి ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. 


బోనాలఉత్సవాలను శాంతియుతంగా జరిగేటట్లు చూడడానికి  స్థానిక పోలీసులు ఆలయ కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకోవాలని హోం మంత్రి ఉన్నత అధికారులను ఆదేశించారు. ఇక హోంశాఖలోని అన్ని విభాగాలలోని వివిధ పోస్టుల ఖాళీ స్థానాలపై చర్చించి సమీక్షించారు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను వెంటనే అప్‌డేట్ చేయాలని, ఖాళీగా ఉన్న స్థానాలపై స్పష్టత ఉండాలని అధికారులను ఆదేశించారు.  హోం ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, డిజిపి మహేందర్ రెడ్డి,  డిజి జైళ్లు రాజీవ్ త్రివేది,  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ తదితరులు ఈ  సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-07-17T20:03:20+05:30 IST