50 వేల కొవిడ్‌ కిట్లు సిద్ధం

ABN , First Publish Date - 2020-08-11T10:58:22+05:30 IST

హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారి కోసం 50 వేల హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేశామని జాయింట్‌ కలెక్టర్‌ (డబ్ల్యూ) జి.రాజకుమారి తెలిపారు.

50 వేల కొవిడ్‌ కిట్లు సిద్ధం

జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి


కాకినాడ (డెయిరీఫారమ్‌ సెంటర్‌), ఆగస్టు 10: హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారి కోసం 50 వేల హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేశామని జాయింట్‌ కలెక్టర్‌ (డబ్ల్యూ) జి.రాజకుమారి తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో సిద్ధం చేస్తున్న హోం ఐసోలేషన్‌ కిట్ల ప్రక్రియను సోమవారం జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్న వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచుతున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 10,850 మందికి హోం ఐసోలేషన్‌ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామన్నారు.


కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి ఇప్పటి వరకు 50 వేల కిట్లు సిద్ధం చేశామన్నారు. ఈ కిట్లను డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి జిల్లాలో ఉన్న అన్ని పీహెచ్‌సీలు, క్వారంటైన్‌ సెంటర్లు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు తరలిస్తున్నామన్నారు. అదే విధంగా చిన్నపిల్లలకు వారి  వయసుకు తగినట్లు 5 వేల కిట్లు సిద్ధమవుతున్నాయన్నారు. కొవిడ్‌ నుంచి ఆరోగ్యవంతంగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామన్నారు. అనంతరం  వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని మెడికల్‌ స్టోర్‌ను పరిశీలించి  వివరాలు తెలుసుకున్నారు. జేసీ వెంట అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.రమేష్‌, హోం ఐసోలేషన్‌ కిట్స్‌ నోడల్‌ అధికారి, వికాస పీడీ కె.లచ్చారావు పాల్గొన్నారు.  

Updated Date - 2020-08-11T10:58:22+05:30 IST