Abn logo
Sep 16 2020 @ 16:34PM

తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు దారులకు ఊరట

హైదరాబాద్: తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు దారులకు ఊరట లభించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు తగ్గిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం వేయమని, రిజిస్ట్రేషన్‌ చేసిన సమయంలో ఉన్న ధర మేరకే ఫీజులు తీసుకుంటామని కేటీఆర్‌ తెలిపారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పల్లె, పట్టణం, నగరం అన్న తేడా లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రజలకు ఎల్‌ఆర్‌ఎస్‌ గుబులు పట్టుకుంది. ఎప్పుడో కొని, రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్న స్థలాలకు ఇప్పుడు రూ.లక్షల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ను చెల్లించాలనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో స్థలం కొనుక్కొని, వీలైతే చిన్న ఇల్లు కట్టుకుని ఉంటున్న వారికి ఎల్‌ఆర్‌ఎ్‌స్‌ పిడుగుపాటులా మారింది. ఎప్పుడో కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ఇంటిని కూడా నిర్మించుకున్న స్థలాలకు ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణ  చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు ఎల్‌ఆర్‌ఎస్‌ను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చక్రం తిప్పడం ప్రారంభించారు. రాష్ట్రంలో కోట్ల రూపాయల విలువైన శిఖం భూములను ఆక్రమించి ప్లాట్లుగా చేసి విక్రయించిన వ్యాపారులు.. వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి చట్టంలో లొసుగులను వెతుకుతున్నారు. శిఖం భూములను ఆక్రమించి ప్లాట్లుగా చేసిన రియల్‌ వ్యాపారులు వాటిని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అమ్మేశారు. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement