హోం ఐసోలేషన్‌కే మొగ్గు

ABN , First Publish Date - 2022-01-18T18:21:33+05:30 IST

రాజధాని బెంగళూరు నగరంలో కరోనా కేసులు రోజు రోజుకు విజృంభిస్తున్నా ఆసుపత్రుల్లో పడకలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. రెండోవేవ్‌నాటి పరిస్థితికి ఇదిపూర్తిగా భిన్నంగా ఉండటం గమనార్హం. కరోనా లక్షణాలు

హోం ఐసోలేషన్‌కే మొగ్గు

- బెంగళూరులో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు 

- ఆసుపత్రుల్లో చేరేందుకు విముఖత.. ఖాళీగా పడకలు 

- ఇంటి వద్దే చికిత్సలు పొందుతున్న బాధితులు 

- బీబీఎంపీ ఆరోగ్య శాఖాధికారుల పర్యవేక్షణ


బెంగళూరు: రాజధాని బెంగళూరు నగరంలో కరోనా కేసులు రోజు రోజుకు విజృంభిస్తున్నా ఆసుపత్రుల్లో పడకలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. రెండోవేవ్‌నాటి పరిస్థితికి ఇదిపూర్తిగా భిన్నంగా ఉండటం గమనార్హం. కరోనా లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకోని వారు, పరీక్షలు చేయించుకున్న తర్వాత పాజిటివ్‌ వెలుగు చూసిన వారు, దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు క్వారంటైన్‌, హోం ఐసొలేషన్‌లోనే చికిత్స పొందుతున్నట్లు వైద్యశాఖ వర్గాలు సోమవారం వెల్లడించాయి. వీరి సంఖ్య లక్షల్లోనే ఉందని ఈ వర్గాలు తెలిపాయి. నగర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ సోకినా ఆసుపత్రుల్లో చేరకుండా ఇంట్లోనే చికిత్స అందుకుంటున్న వారిపై బీబీఎంపీ ఆరోగ్య శాఖాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. పాజిటివ్‌కు గురైన వారి ద్వారా ఇంట్లో మిగిలిన వారికి వైరస్‌ సోకకుండా ఉండేలా చూడాలని బీబీఎంపీ చీఫ్‌ కమిషనర్‌ గౌరవ్‌గుప్తా తెలిపారు. కాగా హోం ఐసోలేషన్‌ నోడల్‌ అధికారిగా పంకజ్‌ కుమార్‌ పాండేను నియమించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిపై నిఘా విధించేందుకు వారి ఆరోగ్య స్థితి గతుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఐదో సెమిస్టర్‌లో ఉన్న వైద్యవిద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని తీర్మానించారు. దాదాపు 10 వేల మంది వైద్య విద్యార్థులకు నగరవ్యాప్తంగా అన్ని వార్డుల్లోనూ హోం ఐసోలేషన్‌ రోగుల ఆరోగ్య పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితుల వివరాలను పూర్తిగా వీరికి అందుబాటులో ఉంచారు. ప్రతిరోజూ బాధితులకు ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయడంతో పాటు ఔషధాల వినియోగం, పౌష్టికాహారం ఇత్యాది అంశాలపై సలహాసూచనలు చేయనున్నారు. రెండోవేవ్‌ సమయంలో బెంగళూరులో టెలికాలర్‌ సేవల ద్వారా 1.33 లక్షల మంది కరోనా బాధితుల ఆరోగ్య పరిస్ధితిని పరామర్శించడంతో పాటు సీరియస్‌ కేసులను స్వయంగా పర్యవేక్షించి వేలాది మందికి కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించారు. నగరంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఇప్పటికే వార్‌రూమ్‌లను ప్రారంభించిన బీబీఎంపీ టెలికాలర్‌ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది. రెండోవేవ్‌ సమయంలో ప్రాణభయంతో ఆసుపత్రులకు పరుగులు తీసి తీరా ఆక్సిజన్‌ లభించక వందలాది మంది బలయ్యారు. ఈ చేదు అనుభవాలను కూడా దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఆసుత్రులకు వెళ్లేందుకు జంకుతున్నారు. పైగా ప్రభుత్వం కూడా కొద్దిపాటి లక్షణాలు ఉంటే గాభరా పడకుండా ఇంట్లోనే ఎంచక్కా చికిత్స అందుకోవాలని సూచించడంతో లక్షలాది మంది హోం ఐసోలేషన్‌కే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇలా హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్యకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం తమ వద్ద లేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే గత పది రోజుల కరోనా కేసులను పరిగణనలోకి తీసుకుంటే ఇది రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-01-18T18:21:33+05:30 IST