Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 09 Aug 2022 13:32:23 IST

Olivia Newton-John: హాలీవుడ్ నటి, పాప్ సింగర్ ఒలివియా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.. మరణమే ఆమె విశ్రాంత బిందువు

twitter-iconwatsapp-iconfb-icon

ఒలివియా న్యూటన్-జాన్ (Olivia Newton-John) గుర్తుందా..


ఒలికిపోతున్న తేనెల తీపిని స్వరాల్లో ఒంపిన ఆ పాప్ గాయని గుర్తుందా..


ఒయ్యారాల పచ్చిద్రాక్షతీగలా నర్తించిన ఆనాటి హాలీవుడ్ నటి గుర్తుందా..


ఆమె ఇప్పుడు ఓ గుర్తుగానే మిగిలిపోయింది. తన పాటని.. ఆటనీ ఎన్నటికీ చెరగని గుర్తులుగా వదిలి ఒలివియా న్యూటన్-జాన్ కానరాని లోకాలకి తరలిపోయింది.


'If Not For You (నువ్వే లేకుంటే..)' పాడి, అప్పటి కుర్రకారు గుండెల్లో గుబులురేపిన నిన్నటి తరాల ప్రముఖ పాప్ గాయని, హాలీవుడ్ నటి ఒలివియా న్యూటన్-జాన్ తన 73 ఏట కన్నుమూశారు. క్యాన్సర్ తో కొంతకాలంగా పోరాడుతున్న ఒలీవియా కాలిఫోర్నియాలోని తన నివాసంలో సోమవారం ఉదయం కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.


నటి, సంగీతకారిణి, గాయనిగా లక్షలాది హృదయాలలో నిలిచిపోయిన ఒలీవియా ప్రశాంతంగా శాశ్వతనిద్రలోకి జారుకున్నారని ఆమె భర్త జాన్ ఈస్టర్లింగ్ (John Easterling) తెలిపారు.


పాప్ సింగర్ గా పేరు తెచ్చుకున్నా, 1978లో విడుదలైన సంగీత ప్రధాన చిత్రం 'Grease'లో హైస్కూల్ స్టూడెంట్ Sandy Olssonగా నటించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమయ్యింది ఒలివియా. సంగీత ప్రాథాన్యత ఉన్న సినిమాలలో గొప్పదిగా ఎన్నదగిన గ్రీస్ లో హీరో Danny Zukoగా నటించిన John Travolta ఆమెకి జీవితకాల స్నేహితుడయ్యాడు.

Olivia Newton-John: హాలీవుడ్ నటి, పాప్ సింగర్ ఒలివియా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.. మరణమే ఆమె విశ్రాంత బిందువుమొదటి భర్త మ్యాట్ లెటేన్జీతో ఓలివియా...

"ప్రియనేస్తం ఒలివియా! మా అందరి జీవితాలూ నీ స్నేహంతో ఉన్నతం చేశావు, గొప్పగా ప్రభావితం చేశావు. నా జ్ఞాపకాల్లో సదా స్మరిస్తూనే ఉంటాము, అంతే కాదు, నిన్ను తప్పకుండా కలుస్తం. నిన్ను చూసిన మరుక్షణమే నీవాడినైపోయాను, ఎప్పటికీ అలానే ఉంటాను. నీ డానీ... నీ జాన్." అంటూ, ఒలివియా మరణవార్త తెలియగానే తన Instagram లో పోస్ట్ చేశాడు ట్రవోల్టా.


గ్రీస్ విడుదలై 40 ఏళ్ల సందర్భంగా 2018లో జరిగిన వేడుకలో వేదిక మీద కాలు కదిపారు ఒలీవియా - జాన్ ట్రవోల్టా జంట.


ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్..

ఒలివియా 1948 సెప్టెంబర్ 26న  కేంబ్రిడ్జ్ ఇంగ్లాడులో పుట్టారు. ఆమె తండ్రి బ్రిన్లే ( Brinley Newton-John) రెండో ప్రపంచ యుద్ధంలో Mi5 సైనికపటాలంలో పనిచేశారు. ఆమె తల్లి Irene Born జర్మన్, ఆమె తండ్రి Max Born నోబెల్ బహుమతి పొందిన భౌతికశాస్త్రవేత్త. హిట్లర్ కాలంలో జర్మనీ నుంచి ఇంగ్లాండ్ వలస వచ్చేసిందా కుటుంబం.  


ఆస్ట్రేలియా యూనివర్శిటిలో ప్రొఫెసర్‌గా బ్రిన్లే చేరడంతో ఒలివియ తన ఐదేళ్ల వయసులో యుకె నుండి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. చిన్నతనం నుంచే సంగీతం మీద ఇష్టంతో స్కూల్ రోజుల్లోనే స్నేహితులతో ఒక మ్యూజిక్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని పాటలు పాడేది ఒలివియా. 14 సంవత్సరాల వయస్సులో టీవీ టాలెంట్ పోటీలో గెలవడమే కాకుండా, ATV 10లో ఒక మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహించే అవకాశం కూడా ఆమెకి దక్కింది. ఒలివియ టాలెంట్ గుర్తించిన ఆమె తల్లి తన కెరీర్ కోసం 1966లో మళ్లీ ఇంగ్లాండుకు మకాం మార్చింది. అక్కడ నుంచి ఒలివియా అంచలంచెలుగా ఎదిగింది.

Olivia Newton-John: హాలీవుడ్ నటి, పాప్ సింగర్ ఒలివియా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.. మరణమే ఆమె విశ్రాంత బిందువు

కెరీర్ మలుపు తిప్పిన ఆల్బమ్

సంగీత సాహిత్యాలలో అత్యున్నత పురస్కారాలైన Grammy, Oscar, Nobel  పొందిన ఒకేఒక్కడు, అమెరికన్ పాప్ వాగ్గేయకారుడు Bob Dylan ప్రసిద్ధ గీతం 'If Not For You' పాడే అవకాశం రావడం ఒలివియా కెరీర్ లో గొప్ప మలుపు.


"నువ్వే లేకుంటే


నా ఆకాశాలు నేలకూలుతాయ్..


వానలు సైతం ముంచెత్తుతయ్ 


నీ ప్రేమ లేకుంటే నేను అస్సలే లేను


ఓ! నేనంటూ ఏమిటి


నువ్వే లేకుంటే .. "


(If not for you


My sky would fall


Rain would gather too


Without your love I'd be nowhere at all


Oh! What would I do


If not for you) 


.. అని ఒలివియా ఆలపిస్తుంటే, ఆ పాట.. పదం తన కోసమే అని వెర్రిత్తిపోయింది ఆనాటి కుర్రకారు. ఆ ఆల్బం ఆమెని ఎక్కడికో తీసుకుపోయింది. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా, ఆమె పాటలు యూకే టాప్ ర్యాంకుల్లో నిలిచాయి. 'Let me be There' ఆల్బం తో ఆమె అమెరికా సంగీత వినీలాకాశంలోకి దూసుకుపోయింది. ఉత్తమ దేశవాళీ గాయని (Best Female Country Vocalist) గా Grammy అవార్డు దక్కించుకుంది.

Olivia Newton-John: హాలీవుడ్ నటి, పాప్ సింగర్ ఒలివియా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.. మరణమే ఆమె విశ్రాంత బిందువు

హాలీవుడ్ లోకి అడుగులు..

సంగీత ప్రధానంగా తాను నిర్మించాలనుకుంటున్న Grease చిత్రానికి అందం, అభినయాలతో పాటు మంచి గొంతు ఉన్న నటి కోసం వెదుకుతున్నాడు నిర్మాత Alan Carr. సుగాత్రి.. సుగాత్ర.. త్రిగుణధారల త్రివేణి వంటి ఒలివియానే తన మ్యూజికల్ సినిమా 'Grease' లో శాండీ పాత్రకి తగినదని ఫిక్సైపోయాడు. కానీ, అప్పటికే ఆమెకి 28 ఏళ్లు, శాండీ అయితే టీనేజ్ పిల్ల. హీరో జాన్ టివోల్ట వయసులో ఆమె కంటే చిన్నవాడు కూడా. అయినా అదగొట్టేసింది ఒలివియా, ఆ సినిమాలో. ఆ సినిమా ఒక పెద్ద బాక్సాఫీస్ హిట్టు. Golden Globe  ఉత్తమ నటి అవార్డుకు నామినేట్ కూడా అయ్యిందామె. గ్రీస్ కి ముందు 1965, 1970 లలో రెండు సినిమాల్లో నటించినా, గ్రీస్ ద్వారానే ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. టెలివిజన్ సినిమాలతో సహా ఆమె 15 సినిమాల్లో నటించినా, ఆమె ఎక్కువ సంగీత ప్రపంచానికే అంకితమైపోయారు.


అమెరికన్ నటుడు, డ్యాన్సర్ మ్యాట్ లెటేన్జీ (Matt Lattanzi) ని 1984లో పెళ్లి చేసుకొని, 1995లో విడిపోయాక, 2008లో John Easterling ని పెళ్లిచేసుకుందామె. అమెరికన్ గాయని, నటి- Chloe Rose Lattanzi ఆమె కూతురు. 


వెంటాడిన అనారోగ్యం

1992లో, 2013లో కూడా అనారోగ్య సమస్యలతో బాధపడినా, 2017లో ఒలివియా రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) బారిన పడ్డారు. తన ఇతర అనారోగ్య సమస్యల కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ ని గుర్తించడంలో ఆలస్యమయ్యి, అది  ప్రమాదకరమైన 4వ స్టేజ్ లో గుర్తించబడింది. అదే ఆమె మరణానికి దారితీసింది. ప్రొఫెషనల్ రంగంలో పేరుప్రఖ్యాతులు పొందినా, వ్యక్తిగత జీవితంలో అనేక ఆటుపోట్లని ఎదుర్కొంది ఒలివియా.


'A Little More Love(మరికాస్త ప్రేమ)' అనే పాటలో ఇలా పాడుతుంది ఒలివియా:


నేను చిక్కుకుపోయాను


నీ కళ్ల కనికట్టులో


నీ చేతుల వెచ్చదనంలో


నీ అబద్ధాల సాలెగూట్లో..


.. నేను చిక్కుకుపోయాను..


("I'm trapped, trapped in the spell of your eyes


In the warmth of your arms


In the web of your lies.").


మరింత ప్రేమ కావాలని తపించిన ఒలివియా మృత్యుకౌగిలిలో చివరికలా చిక్కుకుపోయింది. 


*********Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement