ఆడేద్దామా...హోలీ!

ABN , First Publish Date - 2020-03-09T07:48:13+05:30 IST

హోలీ పండుగ...రంగుల్లో మునిగితేలే రోజు. స్నేహితులతో సరదాగా గడపాల్సిన సమయం.

ఆడేద్దామా...హోలీ!

హోలీ పండుగ...రంగుల్లో మునిగితేలే రోజు. స్నేహితులతో సరదాగా గడపాల్సిన సమయం. మరి హోలీ పండుగ ఆనందంగా గడిచిపోవాలంటే రంగులతో ఆడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.

వీలైనంత వరకు సహజ రంగులనే ఉపయోగించండి. ఎలాంటి రసాయనాలూ కలపని రంగులు వాడటం వల్ల చర్మానికి హాని జరగదు. అంతేకాదు ఒంటికి అంటిన రంగులు నీటితో సులభంగా వదులుతాయి.

వాటర్‌గన్స్‌ ఉపయోగించి రంగులు చల్లుకుంటారు కదా! అయితే  ఇతరుల కళ్లలో, చెవుల్లో రంగులు కొట్టకూడదు. 

రంగులు నోటిలోకి వెళ్లకుండా చూసుకోవాలి. కొన్ని రంగులు నోటిలోకి వెళ్లినప్పుడు వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కళ్లలో రంగు పడినట్లయితే వెంటనే నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అలాకాకుండా కళ్లను రుద్దకూడదు. ఒకవేళ కన్ను బాగా ఎర్రబడితే డాక్టర్‌ను సంప్రతించాలి. కళ్లలో రంగు పడకుండా కళ్లద్దాలు పెట్టుకుంటే మరీ మంచిది.

హోలీ ఆడే సమయంలో హాయిగానే ఉంటుంది కానీ తరువాత రంగులను వదిలించుకోవడానికి చాలా శ్రమపడాల్సి వస్తుంది. ఆ శ్రమ తప్పాలంటే ముందుగానే ఒంటికి నూనె, క్రీమ్‌ లేదా పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. 

ఒకవేళ ఆస్తమా, బ్రాంఖైటిస్‌, స్కిన్‌ అలర్జీ వంటి సమస్యలున్న పిల్లలు హోలీ ఆడకపోవడమే మేలు. ఎందుకంటే పొడి రంగుల వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది.

Updated Date - 2020-03-09T07:48:13+05:30 IST