జీవితాలను వర్ణభరితం చేద్దాం

ABN , First Publish Date - 2022-03-18T05:30:00+05:30 IST

హోలీ రంగుల పండుగ. ప్రకృతిలో ఉన్నట్టే... మన భావాలు, అనుభూతులు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. మనలోని అన్ని ఆలోచనలు, అనుభూతులు ఆత్మ నుంచే వస్తున్నాయి.....

జీవితాలను వర్ణభరితం చేద్దాం

హోలీ రంగుల పండుగ. ప్రకృతిలో ఉన్నట్టే... మన భావాలు, అనుభూతులు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. మనలోని అన్ని ఆలోచనలు, అనుభూతులు ఆత్మ నుంచే వస్తున్నాయి. ‘ఆత్మ’ అనేది శరీరం లోపలా, బయటా... ఆకాశంలా అంతటా వ్యాపించి ఉంది. అదే మన జీవితాలను శాసిస్తోంది. మనం కేవలం తోలు బొమ్మలా ఆడుతున్నాం. చిక్కేమిటంటే... మన ఆలోచనలు ఎలా నడుస్తున్నాయో, మనలో ఎలాంటి భావావేశాలు కలుగుతున్నాయో, మన లోపల ఏం జరుగుతోందో గమనించం. ఆలోచించకుండా, మన లోపలి భావాలు ఏం చెబుతున్నాయో పట్టించుకోకుండా పని చేస్తాం.


నియమాలు ఉన్నప్పటికీ... మన ఆవేశాలకు మనమే కొన్నిసార్లు బాధితులుగా మారుతాం. ఈ భావావేశాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అంతటా శూన్యం ఆవరించి ఉంటుంది. అదే మన నిజమైన స్వభావం. మనల్ని మన ఆలోచనలతో, భావాలతో, ఆవేశాలతో ముడిపెట్టి చూసుకుంటే... మనం వాటిలో చిక్కుకుపోతాం. మనల్ని మనం తక్కువవారుగా భావించుకుంటాం. కానీ మన లోపల ఉన్న ఆకాశం లాంటి ఆ శూన్యమే... అసలైన, అద్భుమైన ‘నువ్వు’ అనే అస్తిత్వం. అక్కడే సంపూర్ణమైన ప్రశాంతతను అనుభవించగలం. ఆ ప్రశాంతతలో లేదా సంపూర్ణమైన ప్రేమలో మునిగి ఉన్నప్పుడు... మనం అంతటా వ్యాపించి ఉన్నామనే అనుభూతి కలుగుతుంది. అదే మన నిజమైన స్వరూపం. అదే సౌందర్యం. 


అజ్ఞానంలో ఉన్నప్పుడు భావావేశాలు చికాకు పెడతాయి. జ్ఞానంలో ఉన్నప్పుడు అవే భావావేశాలు రంగులై విరబూస్తాయి. హోలీ పండుగలా... జీవితం కూడా అనేక రంగుల్లో నిండి ఉండాలి. ప్రతి రంగూ విస్పష్టంగా కనిపించాలి. మనం ధరించే పాత్రలు, మన భావాలు... ఇలా ప్రతీదీ స్పష్టంగా తెలియాలి. భావాలు కలగలిసిపోయి, గందరగోళంగా ఉంటే సమస్యలు వస్తాయి. ‘‘నేను ధరించే ప్రతి పాత్రకూ న్యాయం చేస్తాను’’ అని మనకు మనం చెప్పుకోవాలి. ‘నేను ఒక మంచి భర్తను, మంచి భార్యను, మంచి పిల్లవాడిని, మంచి తల్లిని, మంచి తండ్రిని’ అనుకోవాలి. అందుకు అవసరమైన గుణాలన్నీ మనలో ఉన్నాయి. వాటిని మనం గుర్తించాలి. వికసించనివ్వాలి. ఇంతటి వైవిధ్యంలో సైతం సామరస్యంగా ఉండడమే జీవితాన్ని ఆనందమయంగా, రంగులమయంగా చేస్తుంది. 


ఉత్సవాలు చేసుకొనే హడావుడిలో... మన మనసు చాలాసార్లు దైవాన్ని మరచిపోతుంది. దైవాన్ని విడిచి మనం ఏ క్షణంలోనూ లేనేలేమనే విషయాన్ని గుర్తుంచుకొని, అన్నిటా ఉన్న దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ‘నేను ఈ భూగోళంలో ఒక భాగం’ అని ఎప్పుడైనా అనుకున్నారా? ఈ గాలిలో, సముద్రంలో ఒక భాగంగా ఎప్పుడైనా భావించుకున్నారా? అనంతమైన ఈ విశ్వంతో మమేకమైన అనుభూతి ఎప్పుడైనా కలిగిందా? ఆ అనుభూతే దివ్యమైన ప్రేమ. దైవాన్ని చూసేందుకు ప్రయత్నించకండి. అది మీతోనే ఉందని తెలుసుకోండి. గాలి ఉన్నట్టే అది కూడా ఉంది. మనం గాలిని పీలుస్తాం, విడిచిపెడతాం. కానీ దాన్ని చూడలేం. అయితే అది ఉందని మనకు తెలుసు. అదే విధంగా దివ్యత్వం అంతటా ఉంది. హృదయం మాత్రమే దాన్ని అనుభూతి చెందగలదు. మీరు సంపూర్ణమైన ప్రశాంతతతో ఉన్నప్పుడు... ఈ విశ్వమంతా దివ్యత్వంతో నిండి ఉందనే అనుభూతి కలుగుతుంది. ఈ అన్ని వ్యవస్థల వెనుకా, ఒకటే వ్యవస్థ నిలిచి ఉన్నదని, అదే దైవత్వం అని గ్రహిస్తాం. అప్పుడు ఉత్సవం దానంతట అదే జరుగుతుంది. జీవితం రంగులమయమై విరాజిల్లుతుంది. 


శ్రీశ్రీ రవిశంకర్‌ 

Updated Date - 2022-03-18T05:30:00+05:30 IST